‘బీసీలకు 69 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలి’

14 Dec, 2018 15:13 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : బీసీలను రాజకీయంగా ఎదగనీయకుండా కేసీఆర్‌ అడ్డు పడుతున్నారంటూ కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు వీ హన్మంతరావు ఆరోపించారు. శుక్రవారమిక్కడ గాంధీ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాజీవ్‌ గాంధీ తీసుకొచ్చిన ఆలోచనే పంచాయతీ ఎన్నికలని తెలిపారు. పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్‌ ఉంటే కేసీఆర్‌ దాన్ని తగ్గించాడని ఆరోపించారు. బీసీల జనాభా 53 శాతం ఉంటే.. 33 శాతం రిజర్వేషన్‌ ఎలా ఇస్తారని ప్రశ్నించారు. తమిళనాడులో ఇచ్చినట్లు తెలంగాణలో కూడా 69 శాతం రిజర్వేషన్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

లోకల్‌ బాడీ ఎలక్షన్‌లలో బీసీలను సర్పంచ్‌లు, జడ్పీటీసీలుగా కాకుండా కేసీఆర్‌ అడ్డుకుంటున్నారని దుయ్యబట్టారు. ముస్లీంలకు ఎలాను రిజర్వేషన్లు పెరగవు.. బీసీలకైనా రిజర్వేషన్లు పెంచాలని కోరారు. కేసీఆర్‌కి నిజంగా బీసీల మీద ప్రేమ ఉంటే రిజర్వేన్లు పెంచి.. 9వ షెడ్యూల్‌లో చేర్చాలని డిమాండ్‌ చేశారు. అసెంబ్లీ ఎన్నికల ఓటమి గురించి మీటింగ్‌లో చర్చించిన తరువాత కారణాలు చెప్తామని తెలిపారు. పార్టీలో కోవర్ట్‌లున్నారని.. ఈవీఎంల సమస్యలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు