మేము స్వాగతించాం; క్షమాపణలు చెప్పండి!

14 Oct, 2019 08:32 IST|Sakshi

సీఎం మనోహర్‌లాల్‌ ఖట్టర్‌కు కాంగ్రెస్‌ పార్టీ చురకలు

చండీగఢ్‌ : ఎన్నికల ప్రచారంలో భాగంగా హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌... తమ పార్టీ అధ్యక్షురాలిపై చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ పార్టీ మండిపడింది. సీఎం స్థాయిలో ఉండి దిగజారుడు వ్యాఖ్యలు చేసిన మనోహర్‌లాల్‌ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేసింది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీలు ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోనీపట్‌లో జరిగిన ప్రచార కార్యక్రమానికి హాజరైన సీఎం మనోహర్‌లాల్‌ కాంగ్రెస్‌ పార్టీ తీరుపై విమర్శలు గుప్పించారు. ఆయన మాట్లాడుతూ... ‘లోక్‌సభ ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత రాహుల్‌ గాంధీ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. అంతేకాదు తన స్థానాన్ని గాంధీ కుటుంబేతర వ్యక్తి భర్తీ చేస్తారని చెప్పారు. ఆయన నిర్ణయాన్ని మేము కూడా స్వాగతించాం. వారసత్వ రాజకీయాలకు చరమగీతం పాడేందుకు ఇది ఉపయోగపడుతుందని భావించాం. రాహుల్‌ నిర్ణయం మేరకు కాంగ్రెస్‌ పార్టీ వాళ్లు దేశవ్యాప్తంగా తమ నాయకుడి కోసం గాలించారు. అయితే కొండను తవ్వి ఎలుకను పట్టుకున్న చందంగా సోనియా గాంధీనే మళ్లీ పార్టీ చీఫ్‌ను చేశారు’ అని వ్యాఖ్యానించారు.

ఈ నేపథ్యంలో మనోహర్‌లాల్‌ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ పార్టీ తీవ్రంగా స్పందించింది. బీజేపీ మహిళా వ్యతిరేకి అని చెప్పడానికి ఇదొక ఉదాహరణ అని పేర్కొంది. ‘బీజేపీకి చెందిన ముఖ్యమంత్రి వ్యాఖ్యలు దిగజారుడుగా, అభ్యంతరకరంగా ఉన్నాయి. ఆయన మాటలను మేము ఖండిస్తున్నాం. మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ వెంటనే క్షమాపణలు చెప్పాలి’ అని ట్విటర్‌ వేదికగా డిమాండ్‌ చేసింది. కాగా 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ పరాభవానికి నైతిక బాధ్యత వహిస్తూ రాహుల్‌ గాంధీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో యూపీఏ చైర్‌పర్సర్‌ సోనియా గాంధీ మరోసారి పార్టీ పగ్గాలు చేపట్టారు. ఇక అత్యధిక స్థానాలున్న యూపీలో తమ కుటుంబానికి కంచుకోటగా ఉన్న ఆమేథీ నుంచి మరోసారి బరిలోకి దిగిన రాహుల్‌ బీజేపీకి చెందిన స్మృతి ఇరానీ చేతిలో ఘోర పరాజయం పాలయ్యారు. ప్రస్తుతం కేరళలోని వాయనాడ్ తరఫున ఎంపీగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు. 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా