‘ర్యాలీ’పైనే కాంగ్రెస్, ఆర్జేడీ సీట్ల బేరం

2 Feb, 2019 19:39 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీహార్‌ రాష్ట్రం నుంచి ఉమ్మడిగా పోటీ చేసేందుకు కాంగ్రెస్, రాష్ట్రీయ జనతా దళ్‌ (ఆర్జేడీ) పార్టీల మధ్య పొత్తు పొసగడం లేదు. రాష్ట్రంలోని 40 లోక్‌సభ స్థానాలకుగాను కాంగ్రెస్‌ పార్టీ కనీసం 15 సీట్లను ఆశిస్తోంది. అయితే ఎనిమిది లేదా పది సీట్లను మాత్రమే కేటాయించేందుకు ఆర్జేడీ సుముఖంగా ఉంది. ఫిబ్రవరి మూడవ తేదీన బిహార్‌లోని పట్నాలో కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ తలపెట్టిన ‘జన్‌ ఆకాంక్ష ర్యాలీ’ అనంతరం సీట్ల పంపకాలపై ఇరు వర్గాలు ఓ అవగాహనకు వస్తాయని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

గాంధీ మైదాన్‌లో జరుగనున్న ర్యాలీపైనే అన్ని వర్గాల దృష్టి కేంద్రీకృతమై ఉంది. అశేష జనం వస్తే ఎక్కువ సీట్లను బేరం ఆడేందుకు ఆస్కారం ఉంటుందని కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర, కేంద్ర నాయకత్వాలు భావిస్తున్నాయి. అందుకని రాష్ట్రంలోని నలుమూలల నుంచి ప్రజలను సమీకరించేందుకు పార్టీ రాష్ట్ర నాయకత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. రెండు లక్షల మంది ప్రజలను సమీకరించాలని పార్టీ లక్ష్యంగా పెట్టుకొంది. ప్రతి జిల్లా నుంచి కనీసం నాలుగు వేల మందిని ర్యాలీకి తీసుకురావాల్సిన బాధ్యతను స్థానిక ఎమ్మెల్యేకు, జిల్లా పార్టీ అధ్యక్షులకు అప్పగించారు. మొత్తం ర్యాలీ వ్యవహారాలను రాష్ట్ర పార్టీ బాధ్యుడు శక్తిసింహ్‌ గోహిల్‌ పర్యవేక్షిస్తున్నారు.

ర్యాలీకి రెండు లక్షల మందికిపైగా ప్రజలు వచ్చినట్లయితే కచ్చితంగా తమకు ఇస్తామన్న సీట్లకన్నా ఎక్కువ కావాలని డిమాండ్‌ చేస్తామని, రాలేకపోతే బేరానికి ఎక్కువ ఆస్కారం ఉండదని బీహార్‌ పార్టీ సీనియర్‌ నాయకుడొకరు తెలిపారు. 60 ఎకరాల విస్తీర్ణం కలిగిన గాంధీ మైదాన్‌లో దాదాపు మూడు లక్షల మంది ప్రజలు పడతారు. 1942లో జరిగిన ‘క్విట్‌ ఇండియా’ లాంటి చరిత్రాత్మక ఉద్యమాలు ఈ మైదానం నుంచి ప్రారంభమైనవే. క్విట్‌ ఇండియా ఉద్యమం ప్రారంభోత్సవంలో జాతిపిత మహాత్మా గాంధీ, మొహమ్మద్‌ అలీ జిన్నాలు ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.

ఈ మైదాన్‌లో ఇంతకుముందు కాంగ్రెస్‌ పార్టీ 1989లో భారీ ర్యాలీ నిర్వహించింది. అప్పటి ప్రధాని రాజీవ్‌ గాంధీ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. 2015లో కాంగ్రెస్‌ పార్టీ మాజీ అధ్యక్షులు సోనియా గాంధీ ఈ మైదాన్‌లో ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. అయితే అప్పుడు ఆమె ఆర్జేడీ నిర్వహించిన ‘స్వాభీమాన్‌ ర్యాలీ’కి అతిథిగా హాజరయ్యారు. కాంగ్రెస్‌ ర్యాలీకి రెండు లక్షలకు పైగా ప్రజలు వచ్చినట్లయితే ఎక్కువ సీట్లను బేరం చేసే అవకాశం పార్టీకి రావడంతోపాటు రాష్ట్రంలో పార్టీ నైతిక స్థైర్యం బాగా పెరుగుతుందని ‘ఏఎన్‌ సిన్హా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ స్టడీస్‌’ ప్రొఫెసర్‌ డీఎం దివాకర్‌ కూడా అన్నారు. కాగా, 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీహార్‌ నుంచి 12 సీట్లకు పోటీచేసి కాంగ్రెస్‌ పార్టీ రెండు సీట్లను గెలుచుకోగా ఆర్జేడీ 27 సీట్లకు పోటిచేసి నాలుగు సీట్లను గెలుచుకుంది.

మరిన్ని వార్తలు