‘టీఆర్‌ఎస్‌ నేతల కాళ్ల కింద భూకంపం’

21 Aug, 2018 13:22 IST|Sakshi

హైదరాబాద్‌: టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి వాగ్దానం చేసిన పెన్షన్‌ స్కీం చూసి టీఆర్‌ఎస్‌ నేతల కాళ్ల కింద భూమి కంపించడం మొదలైందని పీసీసీ అధికార ప్రతినిధి ఇందిరా శోభన్‌ ఎద్దేవా చేశారు. గాంధీ భవన్‌లో మాట్లాడుతూ.. 2011లో కాంగ్రెస్‌ సర్కార్‌ పెన్షన్‌ వయసును 65 నుంచి 60 ఏండ్లకు తగ్గిస్తే.. తెలంగాణ వచ్చినాక టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 65 ఏళ్లకు పెంచిందని విమర్శించారు. పెన్షన్‌ వయసు 60 నుంచి 65కు పెంచడం వల్ల కేంద్ర నుంచి వస్తోన్న నిధులు కూడా తెలంగాణ సర్కారే తింటోందని ఆరోపించారు. టీఆర్‌ఎస్‌ సర్కార్‌ ఇచ్చే పెన్షన్‌ వల్ల కుటుంబాల్లో గొడవలు పడుతున్నారని మండిపడ్డారు.

ఈ విషయాలపై బీజేపీ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ఇది బీజేపీ, టీఆర్‌ఎస్‌ కుమ్మక్కు కాదా.. హామీ ఇచ్చిన బోధకాలు పెన్షన్‌ ఏమైందని ప్రశ్నించారు.  తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ను టీఆర్‌ఎస్‌ వాళ్లు ఏమైనా అనవచ్చు..కానీ కాంగ్రెస్‌ కేవలం ఒక బచ్చా అంటే లేసి పడుతున్నారు..మీ టాలెంట్‌ అంతా తెలంగాణ సంక్షేమం కోసం చూపెడితే బాగుంటుందని హితవు పలికారు. ఇంటింటి సర్వే రూ.50 కోట్లు ఖర్చు పెట్టారు..దాని ఫలం ఏంటని ప్రశ్నించారు. తెలంగాణ బిడ్డలకు ఎక్కడా ఫలితాలు రావడం లేదు..కానీ కేసీఆర్‌ ఫ్యామిలీకి మాత్రం అందుతోన్నాయని విమర్శించారు.

పోలీసుల మీద అనుమానం వస్తోంది : వీహెచ్‌
తెలంగాణ పోలీసుల మీద ఒక విషయంలో అనుమానం వస్తోందని కాంగ్రెస్‌ నేత, మాజీ ఎంపీ వి.హనుమంతరావు అన్నారు. గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. నయీమ్‌ కేసులో బాధితులను పట్టించుకునే నాధుడే లేడని వ్యాఖ్యానించారు. నయీమ్‌ అనుచరుడు శేషన్నను ఎందుకు పట్టుకోలేదని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో ఆయనను వాడుకునే ప్రయత్నం చేస్తారేమోనని అనుమానం వ్యక్తం చేశారు. శేషన్నను ఎందుకు అరెస్ట్‌ చేయడం లేదని తెలంగాణ డీజీపీని ప్రశ్నించారు. నయీమ్‌ గ్యాంగ్‌ను శేషన్న ఇంకా రక్షిస్తున్నాడని ఆరోపించారు. శేషన్నకు టికెట్‌ ఇచ్చి కేటీఆర్‌ వచ్చి ఎన్నికల్లో పోటీ చేయిస్తాడేమోనని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. 

మరిన్ని వార్తలు