ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం లేకుండా చేస్తోంది

18 Mar, 2019 14:37 IST|Sakshi

సాక్షి, సంగారెడ్డి : ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం ఉంటుందన్న విషయం మర్చిపోయి టీఆర్‌ఎస్‌ నిరంకుశంగా వ్యవహరిస్తోందని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే శ్రీధర్‌ బాబు అన్నారు. తమ పార్టీ ఎమ్మెల్యేలను టీఆర్‌ఎస్‌లో చేర్చుకోవడాన్ని ఖండిస్తున్నామని చెప్పారు. కరీంనగర్‌, ఆదిలాబాద్‌, నిజమాబాద్‌, మెదక్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి జీవన్‌ రెడ్డి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అన్ని వర్గాల ప్రజల హక్కుల కోసం పోరాటం చేస్తున్న జీవన్‌ రెడ్డిని విద్యావంతులు, ప్రజాస్వామ్య వాదులంతా కలిసి గెలిపించాలని కోరారు. జీవన్‌ రెడ్డి గెలుపు రాబోయే పార్లమెంట్‌, ఇతర ఎన్నికలల్లో ఉత్సాహాన్ని ఇస్తుందన్నారు. జీవన్‌ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన యువత, నిరుద్యోగుల ఆకాంక్షలు నేరవేరడం లేదన్నారు. కొత్త జిల్లాలు ఏర్పాటు వల్ల కొత్త ఉద్యోగాలు వస్తాయని భావిస్తే.. ఇప్పటి వరకు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని ఆరోపించారు. ఇప్పటి వరకు ఒక్క డీఎస్సీ కూడా వేయలేదన్నారు. పీఆర్సీ ఇవ్వకపోవడం వల్ల ప్రభుత్వ ఉద్యోగులు నిరత్సాహంగా ఉన్నారన్నారు. రాబోయే ఎన్నికల్లో పట్టాభద్రులు ప్రభుత్వాన్ని తట్టిలేపేలా తీర్పు ఇవ్వాలని కోరారు. 

మరిన్ని వార్తలు