అర్బన్‌ నక్సల్స్‌కు కాంగ్రెస్‌ వత్తాసు

10 Nov, 2018 03:15 IST|Sakshi

ఆ పార్టీ ఆదివాసీల సంప్రదాయాల్ని హేళన చేసింది

ఛత్తీస్‌గఢ్‌ ఎన్నికల ప్రచార ర్యాలీలో ప్రధాని మోదీ

జగ్దల్‌పూర్‌: ఆదివాసీ యువత జీవితాల్ని నాశనం చేసిన అర్బన్‌ నక్సలైట్లకు కాంగ్రెస్‌ అండగా నిలుస్తోందని ప్రధాని మోదీ ఆరోపించారు. ఆ పార్టీ గిరిజన తెగల సంస్కృతిని హేళనచేసిందని మండిపడ్డారు. ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బస్తర్‌లోని జగ్దల్‌పూర్‌లో ప్రచార కార్యక్రమంలో మోదీ ప్రసంగించారు. మావోల సమస్యను సాకుగా చూపి గత ప్రభుత్వాలు బస్తర్‌ అభివృద్ధికి  చొరవ చూపలేదన్నారు. నక్సల్స్‌ను దుష్ట మనసు కలిగిన రాక్షసులుగా అభివర్ణించిన మోదీ...బస్తర్‌లో బీజేపీ కాకుండా ఎవరు గెలిచినా ఆ ప్రాంత అభివృద్ధి కలలకు విఘాతం కలుగుతుందన్నారు. ఇటీవల ఛత్తీసగఢ్‌లో మావోల దాడిలో మరణించిన దూరదర్శన్‌ కెమెరామెన్‌ అచ్యుతానంద్‌ సాహూకు నివాళులర్పించారు.

వాళ్ల దృష్టిలో ఓటుబ్యాంకే..
దళితులు, బలహీన వర్గాలు, గిరిజనుల గురించి మాట్లాడే కాంగ్రెస్‌ వారిని మనుషులుగా కాకుండా ఓటుబ్యాంకుగానే చూస్తోందని మోదీ విమర్శించారు. ‘ఆదివాసీల సంప్రదాయాల్ని కాంగ్రెస్‌ ఎందుకు హేళన చేసిందో నాకు అర్థం కాలేదు. ఓసారి ఈశాన్య భారత్‌లో జరిగిన కార్యక్రమంలో ఆదివాసీల సంప్రదాయ తలపాగా ధరించినప్పుడు కాంగ్రెస్‌ నాయకులు నా వేషధారణను చూసి నవ్వుకున్నారు. ఇది ఆదివాసీల సంప్రదాయాలను అవమానించడమే. ఏసీ గదుల్లో ఉంటూ తమ పిల్లల్ని విదేశాల్లో చదివించుకుంటున్న అర్బన్‌ నక్సలైట్లు స్థానిక యువతను రిమోట్‌ కంట్రోల్‌గా వాడుకుంటున్నారు. ప్రభుత్వం వారిపై చర్యలు తీసుకుంటుంటే, కాంగ్రెస్‌ మద్దతిస్తోంది’ అని అన్నారు. మరోవైపు, సోదరసోదరీమణుల బంధానికి ప్రతీక అయిన ‘భాయ్‌ దూజ్‌’ సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

మేమే నక్సల్స్‌ బాధితులం: కాంగ్రెస్‌
అర్బన్‌ నక్సలైట్లకు కాంగ్రెస్‌ మద్దతిస్తోందన్న మోదీ వ్యాఖ్యలను ఆ పార్టీ తిప్పికొట్టింది. 2013లో నక్సల్స్‌ హింసలో కాంగ్రెస్‌ 25 మందికి పైగా నాయకుల్ని కోల్పోయిందని తెలిపింది. నక్సలిజం సమస్యను పరిష్కరించడంలో వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి మోదీ తనకే సొంతమైన ఇలాంటి చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నారని వ్యాఖ్యానించింది. మోదీ అసమ్మతిని సహించలేరని, ఆయన విధానాల్ని ప్రశ్నించినవారిని జాతి వ్యతిరేకులు, అర్బన్‌ మావోయిస్టులని ముద్ర వేస్తున్నారని సీపీఎం నాయకురాలు బృందా కారత్‌ అన్నారు. 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా