కాంగ్రెస్‌ ముక్త ఈశాన్యం 

12 Dec, 2018 08:21 IST|Sakshi

మిజోరంను కోల్పోయిన హస్తం పార్టీ

విపక్షానికి కలిసొచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత

25 ఏళ్ల తర్వాత బీజేపీ బోణీ  

మిజోరం ఓటర్లు సంప్రదాయానికి కట్టుబడ్డారు. ప్రతి పదేళ్లకు అధికారపార్టీని మార్చే సంప్రదాయానికి అనుగుణంగా 2008 నుంచి అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ను తప్పించి మిజో నేషనల్‌ ఫ్రంట్‌(ఎంఎన్‌ఎఫ్‌)కు పట్టంకట్టారు. ఈ ఎన్నికల్లో ఎలాగైన గెలవాలనీ, తద్వారా ఈశాన్య భారతంలో కనీసం ఒక్క రాష్ట్రంలో అయినా అధికారంలో ఉండాలన్న కాంగ్రెస్‌ ప్రయత్నాలు విఫలమయ్యాయి. అదే సమయంలో స్థానిక పార్టీలతో కలిసి అధికారంలోకి రావాలన్న బీజేపీ కలలు సైతం కల్లలయ్యాయి. ఈ క్రమంలో కాంగ్రెస్‌ ప్రభుత్వంపై వ్యతిరేకత, అభివృద్ధి కుంటుపడటం, మంత్రుల అవినీతి.. వెరసి ఎంఎన్‌ఎఫ్‌కు ప్రజలు మొత్తం 40 సీట్లలో 26 స్థానాలను కట్టబెట్టారు. ఎంఎన్‌ఎఫ్‌ శాసససభా పక్షనేతగా మంగళవారం ఎన్నికైన ఆ పార్టీ అధ్యక్షుడు జోరంథంగ త్వరలోనే ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. 

కాంగ్రెస్‌ను నమ్మని మిజోలు.. 
2013 అసెంబ్లీ ఎన్నికల్లో మూడింట రెండొంతుల సీట్లను దక్కించుకున్న కాంగ్రెస్‌ పార్టీ ఈసారి కేవలం ఐదు సీట్లకే పరిమితం కావడానికి ప్రభుత్వ వ్యతిరేకతే కారణమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. దేశవ్యాప్తంగా మోదీ హవా నడుస్తున్న సమయంలో కూడా మిజోరంలో తన పట్టునిలుపుకున్న కాంగ్రెస్‌ ఈ సారి దారుణంగా దెబ్బతింది. 2008లో 32 సీట్లు, 2013 ఎన్నికల్లో 34 సీట్లు గెలుచుకుని బలాన్ని పెంచుకుంటూ వస్తుండటంతో ఈ సారి మరిన్ని సీట్లు గెలుచుకుంటామని కాంగ్రెస్‌ నేతలు ధీమాగా ఉన్నారు. మోదీ హవానే తట్టుకుని నిలబడ్డ ముఖ్యమంత్రి లాల్‌ తన్హావ్లా చరిష్మాతో ప్రభుత్వ వ్యతిరేకతను సులభంగా అధిగమించవచ్చన్న వారి ఆశలు అడియాసలయ్యాయి. కాంగ్రెస్‌ రెండు దఫాలుగా అధికారంలో కొనసాగుతున్నా రాష్ట్రంలో మౌలిక సదుపాయాల పరిస్థితి ఏ మాత్రం మెరుగుపడలేదు. దీనికితోడు పలువురు కాంగ్రెస్‌ మంత్రులు అవినీతి ఆరోపణల్లో చిక్కుకోవడం, ఎన్నికలకు ముందు ఐదుగురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు పార్టీకి రాజీనామా చేసి ఎంఎన్‌ఎఫ్‌లో చేరడం వంటివి పార్టీ పతనానికి దారి తీశాయని వ్యాఖ్యానిస్తున్నారు. గత పదిహేనేళ్లుగా రాష్ట్రంలో అమల్లో ఉన్న సంపూర్ణ మద్య నిషేధాన్ని కాంగ్రెస్‌ ప్రభుత్వం సడలించడం ఓటమికి మరో కారణమంటున్నారు. 

బీజేపీ భగీరథ ప్రయత్నం.. 
మిజోరంలో పాగా వేసేందుకు కమలనాథులు గత 25 ఏళ్లుగా చేస్తున్న ప్రయత్నాలు ఈసారి కూడా ఫలించలేదు. మిజోరంలోని 40 నియోజకవర్గాల్లో 39 స్థానాల్లో ఈసారి బీజేపీ అభ్యర్థులను నిలబెట్టగా ఒక్క బుద్ధాధన్‌ ఛక్మా మాత్రమే విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో భాగంగా తమపై ఉన్న హిందుత్వ పార్టీ ముద్రను తొలగించుకునేందుకు బీజేపీ సరికొత్త వ్యూహాలను అమలు చేసింది. మిజోరంలో 87 శాతం ప్రజలు క్రైస్తవులే. ఈ నేపథ్యంలో ఇద్దరు మతాధికారులకు బీజేపీ ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చింది. కాంగ్రెస్‌ హయాంలో క్రైస్తవులకు రక్షణ లేదనీ, బీజేప ప్రభుత్వం ఏర్పడితే మరింత మెరుగైన శాంతిభద్రతలు ఏర్పడుతాయని ప్రచారం చేసింది. మిజోరం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అమిత్‌ షా.. రాబోయే క్రిస్మస్‌ పండుగను మిజోలు బీజేపీ పాలనలో చేసుకుంటారని ధీమా వ్యక్తం చేశారు. అయితే మద్య నిషేధం సహా బీజేపీ తమ మెనిఫెస్టోలో పేర్కొన్న హామీలను మిజోరం ప్రజలు నమ్మలేదు.  

పదేళ్ల తర్వాత అధికారం.. 
కాంగ్రెస్‌ ప్రభుత్వంపై వ్యతిరేకత, అవినీతి, కుంటుపడిన అభివృద్ధి ఈ ఎన్నికల్లో మిజో నేషనల్‌ ఫ్రంట్‌కు కలిసివచ్చాయి. 2008 అసెంబ్లీ ఎన్నికల్లో 3 చోట్ల, 2013 ఎన్నికల్లో కేవలం 5 స్థానాల్లో గెలుపొందిన ఎంఎన్‌ఎఫ్‌ ఈ సారి ఏకంగా 26 సీట్లు దక్కించుకోవడం ఘనవిజయమని ఎన్నికల విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. సంపూర్ణ మద్య నిషేధం తెస్తామన్న ఎంఎన్‌ఎఫ్‌ హామీని ప్రజలు విశ్వసించారని అందుకే దానిక ఓటేశారని వారంటున్నారు. బీజేపీకి తమకు సంబంధం ఉందంటూ కాంగ్రెస్‌ చేసిన ప్రచారాన్ని సమర్థంగా తిప్పి కొట్టామని పార్టీ అధినేత జోరంథంగ చెప్పారు.పదేళ్ల కాంగ్రెస్‌ పాలనలో రాష్ట్రం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉందని, సరైన రోడ్లు కూడా లేక ప్రజలు అవస్థలు పడ్డారని ఆయన అన్నారు. సైద్ధాంతికంగా ఎంఎన్‌ఎఫ్‌–బీజేపీల మధ్య చాలా వైరుధ్యాలు ఉన్నప్పటికీ, యూపీఏ కంటే ఎన్‌డీఏ వల్లే ప్రజలకు మేలు కలుగుతుందన్న భావనతో ఎన్డీయే కూటమిలో చేరామన్నారు. పొత్తును మిజో ప్రజలు అర్థం చేసుకున్నారనడానికి ఈ ఫలితాలే నిదర్శనమన్నారు. 
 

మరిన్ని వార్తలు