‘పెట్రో మంటలతో మోదీ మెట్రో బాట’

21 Sep, 2018 11:44 IST|Sakshi
ఢిల్లీ మెట్రోలో ప్రయాణిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ

సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ ఔటర్‌పై వీవీఐపీల తాకిడితో ప్రజలకు ట్రాఫిక్‌ కష్టాలు తొలగించాలనే ఉద్దేశంతో ప్రధాని నరేంద్ర మోదీ మెట్రో రైలులో ప్రయాణించారని భావిస్తుంటే కాంగ్రెస్‌ మాత్రం పెట్రో ధరల పెంపుతో ఈ అంశాన్ని ముడిపెట్టి బీజేపీని ఇరుకునపెట్టింది. మోదీ మెట్రో యాత్రతో ఎవరికీ ఎలాంటి ప్రయోజనం లేదని కాంగ్రెస్‌ పెదవివిరిచింది. ఢిల్లీ మెట్రో ఎయిర్‌పోర్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ లైన్‌లో ప్రధాని మోదీ 14 నిమిషాల పాటు ప్రయాణించడాన్ని ఆ పార్టీ ఆక్షేపించింది.

ఢిల్లీలో ఇంధన ధరలు ఆకాశాన్ని అంటుతుండటంతోనే ప్రధాని విధిలేని పరిస్థితుల్లో మెట్రోలో ప్రయాణించారా లేక ఇది మరో ఎన్నికల ఎత్తుగడా అంటూ కాంగ్రెస్‌ పార్టీ కర్ణాటక యూనిట్‌ ట్వీట్‌ చేసింది.

ఇంధన ధరలు విపరీతంగా పెరుగుతుండటాన్ని నిరసిస్తూ రాహుల్‌ నేతృత్వంలోని కాంగ్రెస్‌ మోదీ సర్కార్‌ను టార్గెట్‌ చేస్తోంది. పెట్రో భారాలకు నిరసనగా ఆ పార్టీ గతవారం దేశవ్యాప్తంగా భారత్‌ బంద్‌ను పాటించింది. మరోవైపు ఇంధన ధరలకు చెక్‌ పెట్టేందుకు పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తేవడమే పరిష్కారమని పెట్రోలియం సహజవాయు మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు