‘సిరిసిల్ల’ను రాజేద్దాం!

19 Mar, 2018 01:12 IST|Sakshi

పర్సంటేజీల వ్యవహారంపై మంత్రి కేటీఆర్‌ లక్ష్యంగా కాంగ్రెస్‌ వ్యూహం

ఆయన బర్తరఫ్‌కు డిమాండ్‌...సిట్టింగ్‌ జడ్జి చేత విచారణకు కూడా..

ఏసీబీకి ఫిర్యాదు చేయాలని నిర్ణయం  

సాక్షి, హైదరాబాద్‌ :  రాష్ట్రంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని ఆరోపిస్తున్న ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీ సిరిసిల్లలో ‘పర్సంటేజీ’ల వ్యవహారాన్ని రాజకీయ అస్త్రంగా మార్చుకునేందుకు సిద్ధమవుతోంది. సీఎం తనయుడు, రాష్ట్ర మం త్రి కె. తారకరామారావు (కేటీఆర్‌) ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గం కేంద్రంగా అవినీతి వ్యవహారం వెలుగులోకి రావడంతో దాన్ని ఆసరాగా చేసు కుని అధికార పక్షంపై దాడికి వ్యూహం రచిస్తోంది. ముఖ్యంగా మంత్రి కేటీఆర్‌ను టార్గెట్‌ చేయడం ద్వారా కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యుల అవినీతిపై తాము చేస్తున్న ఆరోపణలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావిస్తోంది.

ఏసీబీకి ఫిర్యాదు...
కాంట్రాక్టర్ల నుంచి పర్సంటేజీలు తీసుకో వాలని తమ మంత్రే చెప్పారంటూ సిరిసిల్ల మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సామల పావని(రాజీనామా చేశారు) మీడియా సమక్షంలోనే పేర్కొనడాన్ని ప్రజల్లో చర్చనీయాంశం చేయాలని, ఇందుకోసం కార్యక్రమాలు రూపొందించాలని టీపీసీసీ పెద్దలు యోచిస్తున్నారు. సీఎం కుమారుడు, రాష్ట్రమంత్రి నేరుగా పర్సంటేజీలు తీసుకుని పనులు చేయాలని చెప్పడమంటే సీఎం కుటుంబమే రాష్ట్రంలో నేరుగా అవినీతిని ప్రోత్సహిస్తోం దని చెప్పడమేనని వారంటున్నారు.

ఈ అంశంపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)కి ఫిర్యాదు చేయాలని కాంగ్రెస్‌ పార్టీ నిర్ణ యించింది. సిరిసిల్ల వ్యవహారాన్ని ప్రస్తావి స్తూనే రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న అవినీతిపై తాము చేస్తున్న ఆరోపణలతో ఫిర్యాదు ఇవ్వాలని నిర్ణయించామని టీపీసీసీ సీనియర్‌ నేత ఒకరు వెల్లడించారు. అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలపై దళితుడైన ఉప ముఖ్యమంత్రి రాజయ్యను ఏకంగా కేబినెట్‌ నుంచి బయటకు పంపారని, ఇప్పుడు కేటీఆర్‌ విషయంలో ద్వంద్వ నీతి ఎందుకు అవలంబిస్తున్నారని ఆయన ప్రశ్నించారు.

సిరిసిల్లలో ఏం జరిగిందనే దానిపై సిట్టింగ్‌ జడ్జి చేత విచారణకు కూడా కాంగ్రెస్‌ పార్టీ డిమాండ్‌ చేస్తోంది. పావని చెప్పిన విషయాలపై సమగ్ర విచారణ జరిపితేనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని, ఈ పర్సంటేజీల్లో స్థానిక ప్రజాప్రతినిధులు ఎంత తీసుకున్నారు.. మంత్రికి ఎంత ముట్టిందో తేలుతుందని వారంటున్నారు.

‘కేటీఆర్‌పై చర్యలు తీసుకోరేం?’
సీఎం కావాలనుకుంటున్న మంత్రి కేటీఆర్‌ అవినీతిని ప్రోత్సహిస్తున్నారని సాక్ష్యాధారాలతో దొరికినా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో సీఎం కేసీఆర్‌ సమాధానం చెప్పాలని టీపీసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌ డిమాండ్‌ చేశారు. కేటీఆర్‌ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేయాలన్నారు. అవినీతి విషయంలో మాజీ మంత్రి రాజయ్యకో నీతి, కేటీఆర్‌కు మరోనీతి వర్తిస్తుందా.. అని   ప్రశ్నించారు.

ఈ మేరకు శ్రవణ్‌ ఆది వారం ఒక ప్రకటన విడుదల చేశారు. కేటీఆర్‌ నియోజకవర్గమైన సిరిసిల్లలో వెలుగుచూసిన అవినీతి రాష్ట్రంలో పెద్దఎత్తున జరుగుతున్న అవినీతికి మచ్చుతునక అని పేర్కొన్నారు.  కేటీఆర్‌ ప్రమేయం ఉన్నప్పుడే అధికారులు అక్రమాలు చేయడానికి సాహసిస్తారని, ఈ విషయంలో సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని, తాము ఏసీబీకి కూడా ఫిర్యాదు చేస్తామని ఆ ప్రకటనలో శ్రవణ్‌ వెల్లడించారు.

మరిన్ని వార్తలు