కూటమి కోదండం!

1 Oct, 2018 01:33 IST|Sakshi

కాంగ్రెస్, టీజేఎస్‌ మధ్య సీట్ల సర్దుబాటు సమస్య...

కోదండరాం కావాలంటున్న స్థానాలు (సుమారు) 30

కాంగ్రెస్‌ ఇచ్చేందుకు సుముఖంగా ఉన్న స్థానాలు.. 4-5 

సాక్షి, హైదరాబాద్‌ : రానున్న ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ఓటమే లక్ష్యంగా రూపుదిద్దుకుంటున్న కాంగ్రెస్‌ నేతృత్వంలోని మహాకూటమిలో తెలంగాణ జనసమితి (టీజేఎస్‌) ఇముడుతుందా? సీట్ల పంపకాల విషయంలో కాంగ్రెస్, టీజేఎస్‌ల మధ్య పడిన పీటముడి విడిపోతుందా? ఇప్పుడు మహాకూటమి వర్గాల్లో ఈ ప్రశ్నలు హాట్‌టాపిక్‌ అవుతున్నాయి. తమకు 30కి పైగా స్థానాల్లో పోటీ చేసే అవకాశమివ్వాలని ప్రొఫెసర్‌ కోదండరాం కోరుతుండగా నాలుగైదు స్థానాలకు మించి ఇవ్వలేమని కాంగ్రెస్‌ అంటుండటంతో ఇరు పార్టీల మధ్య మడతపేచీ పడినట్లయింది. టీఆర్‌ఎస్‌ ఓటమే లక్ష్యంగా ఉమ్మడి ఎజెండాతో కలసి పనిచేసేందుకు ఇరు పార్టీల మధ్య అవగాహన ఉన్నా సీట్ల సర్దుబాటే సమస్యగా మారుతుండటం కూటమి రాజకీయాలను వేడెక్కిస్తోంది. శనివారం రాత్రి సమావేశమైన కాంగ్రెస్‌ కోర్‌ కమిటీ ఈ వ్యవహారంపై తీవ్రంగా చర్చించినట్లు తెలుస్తోంది. టీజేఎస్‌ అడిగినన్ని సీట్లు ఇచ్చేందుకు అవకాశం లేదని కోర్‌ కమిటీలో కాంగ్రెస్‌ ముఖ్యులు తేల్చేసిన నేపథ్యంలో కూటమిలో టీజేఎస్‌ సర్దుబాటు ఎలా ఉంటుందన్నది ఇప్పుడు ఆసక్తి కలిగిస్తోంది. 

టీడీపీ, సీపీఐ ఓకే... 
కూటమిలోని పార్టీల మధ్య సీట్ల పంపకాల విషయంలో కాంగ్రెస్‌ పార్టీకి టీడీపీ, సీపీఐలతో పెద్దగా ఇబ్బందులు లేవని తెలుస్తోంది. 25 స్థానాలు కావాలని టీడీపీ, 12 సీట్లు కావాలని సీపీఐ కోరుతున్నా ఆ రెండు పార్టీలను ఏకతాటిపైకి తీసుకురావడంలో కాంగ్రెస్‌ నేతలు సఫలీకృతులయ్యారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం టీడీపీకి 10–14 స్థానాలు, సీపీఐకి 3 స్థానాలు ఇచ్చేందుకు కాంగ్రెస్‌ వర్గాలు కూడా సిద్ధమయ్యాయి. అయితే టీడీపీ, సీపీఐలకు ఎక్కడెక్కడ సీట్లు కేటాయించాలన్న దానిపై కొంత సమస్య ఉన్నా సీట్ల సంఖ్య తేలినందున అది కూడా సమసిపోతుందని కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నారు. శనివారం రాత్రి హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో జరిగిన కాంగ్రెస్‌ కోర్‌ కమిటీ భేటీలోనూ ఇదే అంశంపై చర్చ జరిగింది. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌తోపాటు కోర్‌ కమిటీ సభ్యులు జానారెడ్డి, భట్టి విక్రమార్క, షబ్బీర్‌ అలీ, మధు యాష్కీ, పొన్నాల లక్ష్మయ్య, వీహెచ్‌ ఈ సమావేశంలో పాల్గొన్నారు.

టీడీపీ, సీపీఐలతో సమస్య లేనప్పటికీ టీజేఎస్‌ అడుగుతున్నన్ని స్థానాలు సర్దుబాటు చేయలేమనే అంచనాకు కాంగ్రెస్‌ ముఖ్య నేతలు వచ్చినట్లు తెలిసింది. టీజేఎస్‌ అధినేత కోదండరాం 33 స్థానాలు అడుగుతున్నారని, ఇరు వర్గాల మధ్య సయోధ్య రావాలన్నా కనీసం 20 స్థానాల వరకు టీజేఎస్‌కు ఇవ్వాల్సి ఉంటుందని, అలా సర్దుబాటు చేసుకోవడం సాధ్యం కాదనే అంచనాకు నేతలు వచ్చారు. నాలుగైదు స్థానాలు ఇవ్వడానికి అభ్యంతరం ఉండకపోవచ్చని, కానీ ఈ ప్రతిపాదనకు టీజేఎస్‌ అంగీకరిస్తుందా అన్నది అనుమామేననే అభిప్రాయం కూడా భేటీలో వ్యక్తమైంది. దీనిపై టీజేఎస్‌ ముఖ్యులతో మరోసారి మాట్లాడంతోపాటు పార్టీ క్షేత్రస్థాయి నాయకులతోనూ చర్చించి సోమవారం తుది నిర్ణయం తీసుకోవాలనే నిర్ణయానికి కాంగ్రెస్‌ కోర్‌ కమిటీ వచ్చినట్లు సమాచారం. అయితే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకుండా ఉండేందుకు ఒకవేళ కాంగ్రెస్‌ పార్టీ 8–10 స్థానాలు టీజేఎస్‌కు ఇచ్చేందుకు ముందుకొచ్చినా కోదండరాం అందుకు సమ్మతిస్తారా లేదా అన్నది కూడా ఇప్పుడు ఆసక్తి కలిగిస్తోంది. 

ఆ ప్రతిపాదన కూడా... 
సీట్ల సర్దుబాటు మడత పేచీ అలా ఉంటే కాంగ్రెస్, టీజేఎస్‌ల మధ్య మరో ప్రతిపాదన విషయంలోనూ ఏకాభిప్రాయం కుదిరే అవకాశం కనిపించడం లేదు. కూటమి అధికారంలోకి వస్తే ఉద్యమ ఆకాంక్షలు, అమరుల ఎజెండాతో రూపొందించే కనీస ఉమ్మడి ప్రణాళిక (సీఎంపీ) అమలు కమిటీ చైర్మన్‌గా కోదండరాంను నియమించాలని టీజేఎస్‌ ప్రతిపాదిస్తోంది. ఈ కమిటీ ప్రభుత్వ పనితీరును సమీక్షించే రీతిలో పనిచేయాలనే ప్రతిపాదనల నేపథ్యంలో కూటమిలో పెద్ద పార్టీగా ఉంటూ మరో పార్టీకి ఆ బాధ్యతలు అప్పగించడం సరైనది కాదనే అభిప్రాయం కాంగ్రెస్‌ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ రెండు సమస్యలను అధిగమించి కాంగ్రెస్, టీజేఎస్‌లు ఏకతాటిపైకి వస్తాయా లేక టీడీపీ, సీపీఐలే కాంగ్రెస్‌తో కలసి వెళ్తాయా అన్నది రెండు, మూడు రోజుల్లో అధికారికంగా తేలే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

కోదండ కోసం బీజేపీ యత్నం 
ఎట్టిపరిస్థితుల్లోనూ టీజేఎస్‌ను తమ వైపు తిప్పుకోవాలని భారతీయ జనతా పార్టీ పావులు కదుపుతోంది. కోదండరాంపై ప్రజల్లో ఉన్న అభిప్రాయాన్ని తమకు అనుకూలంగా మలచుకోవాలనే ఆలోచనతో ఉన్న బీజేపీ నేతలు తమతో కలసి రావాలని టీజేఎస్‌ను ఇప్పటికే కోరారు. అయితే బీజేపీతో జట్టు కట్టేందుకు ప్రొఫెసర్‌ ఇష్టపడటం లేదని, రాజకీయంగా ఆ మైత్రి మంచిది కాదనే ఆలోచనలో ఆయన ఉన్నట్లు తెలుస్తోంది. అయితే కాంగ్రెస్‌తో కలిసే ప్రక్రియలో కూడా తమ గౌరవానికి ఎక్కడా భంగం వాటిల్ల కూడదనే ప్రాథమిక సూత్రాన్ని పరిగణనలోకి తీసుకుంటామని, అవసరమైతే స్వతంత్రంగా ఎన్నికల బరిలో దిగేందుకు కూడా సిద్ధమవుతున్నామని టీజేఎస్‌ నేతలు చెబుతుండటం గమనార్హం.  

మరిన్ని వార్తలు