రఫేల్‌పై తీర్పును రీకాల్‌ చేయాలి

17 Dec, 2018 04:35 IST|Sakshi
అరుణ్‌జైట్లీ, ఆనంద్‌శర్మ

ప్రాయశ్చిత్తం కోసం మోదీ గంగానదిలో మునగాలి: కాంగ్రెస్‌

జేపీసీని ఏర్పాటు చేసే సమస్యే లేదు: జైట్లీ

సాక్షి, న్యూఢిల్లీ: రఫేల్‌ యుద్ధ్ద విమానాల కొనుగోలు వ్యవహారంలో ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు వెనక్కు తీసుకోవాలని (రీకాల్‌) కాంగ్రెస్‌ పార్టీ ఆదివారం కోరింది. ఈ విషయంలో అత్యున్నత న్యాయస్థానాన్ని తప్పుదోవపట్టించేలా వ్యవహరించడంతోపాటు పార్లమెంటు సమగ్రతను దెబ్బతీసిన కేంద్ర ప్రభుత్వానికి కోర్టు ధిక్కార నోటీసులు ఇవ్వాలంది. రఫేల్‌ విమానాల కొనుగోలుకు సంబంధించి కాగ్‌ తన నివేదికను ప్రజా పద్దుల కమిటీ (పీఏసీ)కి సమర్పించిందని కేంద్రం సుప్రీంకోర్టుకు తప్పుగా చెప్పడం తెలిసిందే.

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అనంద్‌ శర్మ ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ‘అసలు విమానాల కొనుగోలుపై కాగ్‌ ఇంకా నివేదికే తయారు చేయకపోతే పీఏసీకి ఎప్పుడు అందజేసింది? పార్లమెంటుకు ఎప్పుడు సమర్పించింది’ అని ప్రశ్నించారు. రఫేల్‌ విషయంలో తప్పుడు సమాచారం ఇచ్చి తీర్పునే ప్రభావితం చేసిన కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ధిక్కార నోటీసులు జారీ చేసి తీర్పును వెనక్కు తీసుకుని కేసును పునర్విచారించాలని ఆయన కోరారు. ఉత్తరప్రదేశ్‌ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ తమ తప్పును అంగీకరించి, ప్రాయశ్చిత్తంగా గంగా నదిలో మునిగితేలాలని ఆనంద్‌ శర్మ అన్నారు. అసలు రఫేల్‌ విషయంలో జరిగిన అవకతవకలపై విచారణ సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) ద్వారానే సాధ్యపడుతుందని ఆనంద్‌ శర్మ అభిప్రాయపడ్డారు.

సుప్రీంకోర్టు తీర్పే అంతిమం: జైట్లీ
రఫేల్‌పై జేపీసీని ఏర్పాటు చేసే ఉద్దేశం ప్రభుత్వానికి లేనే లేదని ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ స్పష్టం చేశారు. సుప్రీం తీర్పే ఈ విషయంలో అంతిమమనీ, ఆ కోర్టే తమ ప్రభుత్వానికి క్లీన్‌ చిట్‌ ఇచ్చాక జేపీసీ ఎందుకని జైట్లీ ఫేస్‌బుక్‌లో ప్రశ్నించారు. రఫేల్‌పై కాగ్‌ నివేదిక సిద్ధమయ్యాక అది ఎలాగూ పీఏసీ ముందుకు వెళ్లక తప్పదన్నారు.  రఫేల్‌పై పార్లమెంటులో చర్చకు ముందుకు రాకుండా సభా కార్యకలాపాలను అడ్డుకోవడమే కాంగ్రెస్‌కు తెలుసనీ, వారిది విధ్వంసకర పార్టీ అని విమర్శించారు. కాగా, సుప్రీంకోర్టుకు తప్పుడు సమాచారం చేరిన అంశంపై అటార్నీ జనరల్‌ (ఏజీ), కాగ్‌లకు నోటీసులిస్తామన్న పీఏసీ చైర్మన్‌ మల్లికార్జున ఖర్గే నిర్ణయాన్ని పీఏసీలోని మెజారిటీ సభ్యులు వ్యతిరేకిస్తున్నారని సమాచారం.

మరిన్ని వార్తలు