కాంగ్రెస్‌తో దోస్తీకి సై?

30 Jun, 2018 11:36 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కునేందుకు కాంగ్రెస్‌ పార్టీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. బీజేపీని ఢీకొట్టాలంటే విభేదాలు పక్కన పెట్టి ప్రాంతీయ పార్టీలతో జట్టుకట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తృణమూల్‌ కాంగ్రెస్‌తో కలిసి కూటమిగా ముందుకెళ్లేందుకు కాంగ్రెస్‌ నాయకత్వం ప్రయత్నాలు ప్రారంభించింది.  కాంగ్రెస్‌, తృణమూల్‌ పొత్తుపై కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు అధీర్‌ రాజన్‌ చౌదరి ఇప్పటికే కాంగ్రెస్‌ హైకమాండ్‌తో సంప్రదింపులు మొదలుపెట్టినట్లు ఓ ప్రముఖ జాతీయ దినపత్రిక కథనం ప్రచురించింది.

తృణమూల్‌తో పొత్తుకు రాష్ట్ర ఎమ్మెల్యేలు, ఎంపీలు సానూకూలంగా ఉన్నట్లు, టీఎంసీతో కలిసి పోటీ చేస్తే పార్టీ ఓటింగ్‌ శాతంకూడా పెరిగే అవకాశం ఉందని రాజన్‌ చౌదరి అధిష్టానానికి తెలిపినట్టు సమాచారం. ఇదే అంశపై టీఎంసీతో చర్చించేందుకు కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు మొనీహుల్‌ హక్‌, అబూ హసిమ్‌ ఖాన్‌లు టీఎ‍ంసీ ప్రధాన కార్యదర్శి మంత్రి పార్థ ఛటర్జీతో గురువారం సమావేశం అయ్యారు. ఆ మరుసటి రోజే కాంగ్రెస్‌ నేతలు శుక్రవారం కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి సోనియా గాంధీతో భేటీ అయ్యారు. రాష్ట్ర నాయకత్వం సానుకూలంగా ఉన్న నేపథ్యంలో తృణమూల్‌తో పొత్తుకు అధిష్ఠానం అంగీకరించే అవకాశం ఉన్నట్లు సదరు వార్తాసంస్థ కథనంలో పేర్కొంది. 

కాగా 2009 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌-తృణమూల్‌ కలిసి పోటీ చేసిన విషయం తెలిసిందే. ఆ తరువాత కాంగ్రెస్‌తో విభేదించిన మమత 2012లో యూపీఏ ప్రభుత్వం నుంచి బయటకువచ్చారు. 2016లో జరిగిన బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో వామపక్షాలతో కలిసి పోటీ చేసిన కాంగ్రెస్‌ ఘోర పరాజయంపాలైన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు