‘ముఖాముఖి’లో గల్లంతైన కాంగ్రెస్‌

26 May, 2019 05:39 IST|Sakshi

186 సీట్లలో కాంగ్రెస్, బీజేపీ హోరాహోరీ పోరు

170 చోట్ల బీజేపీ విజయం..హస్తానికి దక్కింది పదహారే

బెంగాల్, కేరళ, తమిళనాడుల్లో మాత్రమే కాంగ్రెస్‌కు ఊరట

కాంగ్రెస్‌తో ముఖాముఖి పోరులో బీజేపీదే పైచేయి అని ఇటీవలి సార్వత్రిక ఎన్నికలు మరోసారి నిరూపించాయి. యూపీలోని అమేథీలో స్వయంగా కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీయే బీజేపీ చేతిలో ఓడిపోవడం ఇందుకు నిదర్శనం. ఈ ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా 186 నియోజకవర్గాల్లో బీజేపీతో ముఖాముఖి తలపడిన వందేళ్ల చరిత్ర గల కాంగ్రెస్‌ కేవలం పదిహేను చోట్ల మాత్రమే గెలుపు సాధించింది. 2014 ఎన్నికల్లో ముఖాముఖి పోరులో 24 సీట్లు దక్కించుకున్న కాంగ్రెస్‌ స్కోరు ఈసారి పదిహేనుకు పడిపోయింది.  అలాగే, 20 రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ ఉనికిలో లేకుండా పోయింది.  

బీజేపీ 50శాతానికి పైగా ఓట్లు పొందిన రాష్ట్రాలు

అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనూ..
మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్‌లలో ఐదు నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని గద్దెదించి కాంగ్రెస్‌అధికార పగ్గాలు చేపట్టింది. అయితే, అదే ఊపును లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీ కొనసాగించలేకపోయింది. ఈ మూడు రాష్ట్రాల్లో కలిపి కాంగ్రెస్‌ కేవలం రెండు స్థానాలనే గెలుచుకుంది.  ముఖాముఖి పోరు జరిగిన రాజస్తాన్‌లో మొత్తం 25 సీట్లనూ కమలదళం గెలుచుకుంది. మధ్యప్రదేశ్‌లో మొత్తం 29 స్థానాల్లోనూ   ముఖాముఖి పోరు జరగ్గా కాంగ్రెస్‌ కేవలం ఒక్క సీటు(చింద్వారా)ను మాత్రమే కైవసం చేసుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్‌ లోక్‌సభ ఎన్నికల్లో ఇలా చతికిల పడుతుందని ఎవరూ ఊహించలేదు.

గుజరాత్‌లోని మొత్తం 26 నియోజకవర్గాల్లో, మహారాష్ట్రలో 16 చోట్ల హోరాహోరీ పోరులో కాంగ్రెస్‌కు ఒక్క సీటు కూడా దక్కలేదు. కర్ణాటకలోని 28 స్థానాల్లో 21 చోట్ల బీజేపీతో పోటీపడగా కాంగ్రెస్‌కు ఒక్క సీటు దక్కింది. కీలకమైన ఉత్తరప్రదేశ్‌లో రాయ్‌బరేలీ, అమేథీల్లో కాంగ్రెస్, కమలదళంతో ముఖాముఖి తలపడింది. రాయ్‌బరేలీలో సోనియా గాంధీ గెలిస్తే, అమేథీని కమలం తన ఖాతాలో వేసుకుంది. రాజధాని ఢిల్లీలో 5 చోట్ల ఈ రెండు పార్టీలు ఢీకొనగా అన్ని సీట్లూ బీజేపీకే వచ్చాయి. పశ్చిమ బెంగాల్‌లో మాత్రం ముఖాముఖిలో కాంగ్రెస్‌దే పైచేయి అయింది. ఇక్కడ రెండు సీట్లు గెలుచుకుంది. ముఖాముఖి పోరులో కాంగ్రెస్‌ విజయం సాధించింది. అలాగే, కేరళ, తమిళనాడుల్లో కూడా ముఖాముఖి పోరులో బీజేపీ నెగ్గుకు రాలేకపోయింది.
 

మరిన్ని వార్తలు