చత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్‌దే హవా!

22 Nov, 2018 14:27 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : చత్తీస్‌గఢ్‌లో వరి కోతల సీజన్‌ అయిపోయింది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు కూడా పూర్తయ్యాయి. అయినా దాదాపు యాభై శాతం రైతులు వరి కోతల జోలికి వెళ్లడం లేదు. ఎందుకని చంద్రకురి గ్రామంలోని మహేశ్‌ చంద్రేకర్‌ అనే రైతును ప్రశ్నించగా ఎన్నికల ఫలితాల కోసం నిరీక్షిస్తున్నామని అన్నారు. ఎన్నికల ఫలితాలకు, వరి కోతలకు సంబంధం ఏమిటని ప్రశ్నించగా, కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే సరైన గిట్టుబాటు ధర ఇస్తామని చెప్పిందని, అందుకని, తాను వరి కోతలు జరపక పోవడమే కాకుండా జరపకూడదని తోటి రైతులకు సలహా కూడా ఇచ్చానని ఆయన చెప్పారు. అప్పటి వరకు పంటను తరలించకపోతే నష్టం వాటిల్లా అది ప్రశ్నిస్తే, డిసెంబర్‌ 11న ఎన్నికల ఫలితాలు వెలువడుతాయని, అప్పటి వరకు భూమిలో తేమ ఉంటుంది కనుక నష్టం వాటిల్లదని ఆయన చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాకపోతే అప్పటికైనా పాత రేటుకు అమ్ముకోవాల్సిందేనని ఆయన తెలిపారు. 

ఈసారి కోతల సీజన్‌ ప్రారంభమైన నవంబర్‌ ఒకటవ తేదీ నుంచి నవంబర్‌ 19వ తేదీ వరకు రాష్ట్రంలో వడ్ల సేకరణ 4,67,438 మెట్రిక్‌ టన్నులకు చేరుకుంది. గతేడాది ఇదే కాలానికి సేకరించిన వడ్లతో పోలిస్తే ఇది సగానికిపైగా పడిపోయింది. గతేడాది ఇదే కాలానికి 10,47,454 మెట్రిక్‌ టన్నులు సేకరించినట్లు అధికారిక మార్కెట్‌ లెక్కలు తెలియజేస్తున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఎన్నికల ప్రచార సభతో రైతుల్లో ఈ మార్పు వచ్చిందని స్థానికులు చెబుతున్నారు. 

నవంబర్‌ 13న మహాసముంద్‌లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో రాహుల్‌ గాంధీ మాట్లాడుతూ, కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే పది రోజుల్లో రైతుల రుణాలను మాఫీ చేస్తామని, వరి పంట కనీస మద్దతు ధరను 2500 రూపాయలను చేస్తామని చెప్పారు. గత బీజేపీ ప్రభుత్వం వరి మద్దతు ధరను 2100 రూపాయలను ప్రకటించినప్పటికీ 1750 రూపాయలనే చెల్లించిందని ఆయన విమర్శించారు. దేశంలో కేవలం 15 మందికి చెందిన మూడున్నర లక్షల కోట్ల రూపాయలను మాఫీ చేసిన ప్రధాని నరేంద్ర మోదీ రైతుల రుణాలను మాఫీ చేయలేక పోతున్నారని విమర్శించారు. చత్తీస్‌గఢ్‌ జనాభాలో 70 శాతం మంది వ్యవసాయం మీదనే ఆధారపడి ఉన్నారు. వారిలో 46 శాతం మంది చిన్నకారు, సన్నకారు రైతులే. 2015 నుంచి 2017 మధ్య వ్యవసాయ సంక్షోభం వల్ల రాష్ట్రంలో 1,344 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. 

రాహుల్‌ మాటలను పూర్తిగా విశ్వసించిన రైతులు రాష్ట్రంలో ఈసారి కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని నమ్ముతున్నారు. 15 ఏళ్ల రమణ్‌ సింగ్‌ ప్రభుత్వం పట్ల తాము పూర్తిగా విశ్వాసం కోల్పోయామని రైతులు చెబుతున్నారు. 2022 సంవత్సరం నాటికల్లా దేశలోని రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తానన్న ప్రధాని మోదీ మాటలను గుర్తు చేయగా, ఈ నాలుగేళ్ల కాలంలో రైతుల ఆదాయం ఏమాత్రం పెరగక పోగా వ్యవసాయం సంక్షోభంలో పడిందని, అలాంటప్పుడు ఆయన మాటలు ఎలా నిజం అవుతాయని రైతులు అంటున్నారు. ప్రధాని పేదలు ఉచితంగా గ్యాస్‌ కనెక్షన్‌ ఇచ్చారని, గ్యాస్‌ ఫిల్లింగ్‌కు 900 రూపాయలు ఎక్కడి నుంచి తేవాలని, ఉచితంగా బ్యాంక్‌ ఖాతాలు ఇప్పించారని, అది మురిగిపోకుండా ఉండాలంటే వెయ్యి రూపాయలు డిపాజిట్‌ చేయాలంటా, ఎక్కడి నుంచి తేవాలని  రైతులు ఎదురు ప్రశ్నిస్తున్నారు. వారి విశ్వాసం చూస్తుంటే రాష్ట్రంలో కాంగ్రెస్‌దే హవా! అనిపిస్తోంది. 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు