అప్పుడే రాష్ట్రానికి పండుగ

29 Oct, 2018 02:44 IST|Sakshi
మానకొండూరు నియోజకవర్గానికి చెందిన నేతలను పార్టీలోకి ఆహ్వానిస్తున్న ఉత్తమ్‌. చిత్రంలో పొన్నం

టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

డిసెంబర్‌ 12తో కేసీఆర్‌ పీడ విరగడ..

అసెంబ్లీ ఎన్నికల్లో ఎగిరేది కాంగ్రెస్‌ జెండానే

దళితులను దగా చేసిన కేసీఆర్‌ను తరిమేయాలి

సాక్షి, హైదరాబాద్‌: అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుపు జెండా ఎగరేయబోతోందని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. డిసెంబర్‌ 12న కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాబోతోందని, ఆనాడే తెలంగాణకు పట్టిన కేసీఆర్‌ పీడ విరగడ కానుందని చెప్పారు. అప్పుడే రాష్ట్రానికి పండుగ వచ్చినట్టన్నారు. ఆదివారం గాంధీభవన్‌లో మానకొండూరు నియోజకవర్గంలోని బెజ్జంకి మండల ఎంపీపీ దామోదర్‌తో పాటు పలువురు ఎంపీటీసీలు, సర్పంచులు ఆ నియోజకవర్గ ఇన్‌చార్జి ఆరేపల్లి మోహన్‌ నేతృత్వంలో కాంగ్రెస్‌లో చేరారు.

ఈ సందర్భంగా వారికి కండువాలు కప్పి ఉత్తమ్‌ పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దళితులను దగా చేసి నిండా ముంచిన కేసీఆర్‌ను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. నాలుగున్నరేళ్ళ పాటు రాష్ట్రాన్ని దోచుకున్న రూ.వేల కోట్ల డబ్బుతో ఓటర్లను కొనేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఎన్నో దారుణాలు, అక్రమాలు..
కేసీఆర్‌ పాలనలో రాష్ట్రంలో ఎన్నో దారుణాలు, అక్రమాలు జరిగాయని ఉత్తమ్‌ ఆరోపించారు. మంత్రి కేటీఆర్‌ నియోజకవర్గంలో ఇసుక మాఫియా దళితులపై దాడులు చేసి చిత్రహింసలకు గురి చేసిందని, ఇసుక లారీలను అడ్డుకున్నందుకు విచక్షణారహితంగా కొట్టించారని చెప్పారు.

మానకొండూరు నియోజకవర్గంలో దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తామని చెప్పి అక్కడి ఎమ్మెల్యే డబ్బులు వసూలు చేశారని దుయ్యబట్టారు. ఖమ్మంలో రైతులు మద్దతు ధరలు కావాలని అడిగిన పాపానికి వారికి చేతులు, కాళ్లకు బేడీలు వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భద్రాచలంలో ఆదివాసీ మహిళలను చెట్లకు కట్టేసి కొట్టారని దేశంలో ఇంతటి దారుణాలు ఎక్కడా జరుగలేదన్నారు. కొండగట్టులో 63 మంది చనిపోతే సీఎం కేసీఆర్‌ కనీసం బాధితులను పరామర్శించలేదని విమర్శించారు.

నెరవేరని ఒక్క హామీ..
దళిత, గిరిజనులకు మూడెకరాల భూమి, గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు, అర్హులందరికీ డబుల్‌ బెడ్రూం ఇళ్ళు, కేజీ టు పీజీ ఉచిత విద్య.. ఇలా అనేక హామీలిచ్చి కేసీఆర్‌ ఏ ఒక్క దాన్ని నెరవేర్చలేకపోయారని ఉత్తమ్‌ దుయ్యబట్టారు. కేసీఆర్‌ మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి నియంతలా పాలిస్తూ పొగరు నెత్తికెక్కి ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. కేటీఆర్‌ తనకు పొగరు బరాబర్‌ ఉంటుందని అంటున్నారని, ఈ అహంకారంతోనే దళిత, గిరిజనులను అణచివేస్తున్నారని ఆరోపించారు. కేటీఆర్‌ పొగరు దించే రోజులు ఎంతో దూరంలో లేవని చెప్పారు.

ఆయన ఫాంహౌస్‌కు, ఈయన అమెరికాకు..
కారణం లేకుండా ముందస్తు ఎన్నికలకు వెళ్లి కేసీఆర్‌ తన గోతి తానే తవ్వుకున్నారని ఉత్తమ్‌ చెప్పారు. ఎన్నికల అనంతరం కేసీఆర్‌ ఫాంహౌస్‌కు, కేటీఆర్‌ అమెరికాకు పరిమితం కావాల్సిందేనంటూ జోస్యం చెప్పారు. ఆంధ్రా పార్టీలతో పొత్తు అంటూ విమర్శిస్తున్న వాళ్లు ఆ పార్టీల నేతలు రమణ, కోదండరాం, చాడ వెంకట్‌రెడ్డి తెలంగాణ వారు కాదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ అధికారంలోకి రావాలంటే ప్రతీ కార్యకర్త వంద ఓట్లు వేయించాలని సూచించారు.

ఈ 45 రోజుల పాటు అప్రమత్తంగా ఉండి పనిచేస్తే అధికారం కాంగ్రెస్‌దేనని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు కోరితే కరీంనగర్‌లో మళ్లీ బెజ్జంకిని కలుపుతామన్నారు. కార్యక్రమంలో టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పొన్నం ప్రభాకర్, డీసీసీ అధ్యక్షుడు మృత్యుంజయం, అధికార ప్రతినిధి రమ్యారావు, కవ్వంపల్లి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు