‘సెమీఫైనల్స్‌’ హీరో ఎవరు?

8 Dec, 2018 03:22 IST|Sakshi

న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సెమీఫైనల్స్‌ ముగిశాయి. అసలు ఫలితాలు 11వ తేదీన వెల్లడి కానున్నాయి. అయితే, శుక్రవారం తెలంగాణ, రాజస్తాన్‌ల్లో పోలింగ్‌ ముగియగానే.. అన్ని వార్తాచానెళ్లలో ఐదు రాష్ట్రాలకు సంబంధించి ఎగ్జిట్‌ పోల్స్‌ సందడి మొదలైంది. తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్తాన్, చత్తీస్‌గఢ్, మిజోరంలలో అధికార పీఠాన్ని అధిరోహించేదెవరో అంచనా వేస్తూ ఫలితాలను పలు చానెళ్లు ప్రకటించేశాయి. ఇప్పటివరకు ఆ 5 రాష్ట్రాల్లో మూడు రాష్ట్రాల్లో (రాజస్తాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్‌) బీజేపీ అధికారంలో ఉండగా, తెలంగాణలో ప్రాంతీయ పార్టీ టీఆర్‌ఎస్, మిజోరంలో కాంగ్రెస్‌ పవర్‌లో ఉన్నాయి. తాజా ఎన్నికల్లో బీజేపీ నుంచి రాజస్తాన్‌ కాంగ్రెస్‌ చేతికి రానుందని, అలాగే, మిజోరం కాంగ్రెస్‌ చేజారనుందని ఎగ్జిట్‌ పోల్స్‌ తేల్చి చెప్పాయి. తెలంగాణలో మళ్లీ టీఆర్‌ఎస్‌కే తెలంగాణ ప్రజలు పట్టం కట్టనున్నారని పేర్కొన్నాయి. మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్‌ల్లో మాత్రం పోటా పోటీ పోరు నెలకొందని, బీజేపీ, కాంగ్రెస్‌లు అటూ ఇటుగా దాదాపు సమ స్థానాలు గెలుచుకోవచ్చని మెజారిటీ సర్వేలు తేల్చాయి. కొన్ని మాత్రం మళ్లీ అధికారం బీజేపీదేనన్నాయి.  

మధ్యప్రదేశ్‌లో శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ నేతృత్వంలోని బీజేపీకి మెజారిటీ స్థానాలు వస్తాయని టైమ్స్‌నౌ– సీఎన్‌ఎక్స్‌ పేర్కొంది. మొత్తం 230 స్థానాల్లో బీజేపీకి 126 సీట్లు, కాంగ్రెస్‌కు 89 సీట్లు వస్తాయని అంచనా వేసింది. మిగతావి ఇతరుల ఖాతాల్లోకి వెళ్తాయంది. ఏబీపీ న్యూస్‌ ఎగ్జిట్‌ పోల్‌ మాత్రం మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు 126, బీజేపీకి 94 సీట్లు వస్తాయంది. 90 సీట్లున్న ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీలో రమణ్‌ సింగ్‌ నేతృత్వంలోని బీజేపీకి 46 స్థానాల సింపుల్‌ మెజారిటీ వస్తుందని టైమ్స్‌ నౌ– సీఎన్‌ఎక్స్‌ తేల్చగా, కాంగ్రెస్‌ 55–65 సీట్లు గెలుస్తుందని ఇండియాటుడే– యాక్సిస్‌ అంచనా వేసింది. బీజేపీ 35–43 సీట్లు వస్తాయని మరో సంస్థ రిపబ్లిక్‌ – సీఓటర్‌ తేల్చింది. ఈ రాష్ట్రంలో ప్రధాన పక్షాలైన కాంగ్రెస్, బీజేపీలు దాదాపు సమ సంఖ్యలో సీట్లు గెలుచుకోవచ్చని, ఏ పార్టీకీ మెజారిటీ రాని పక్షంలో అజిత్‌జోగి నేతృత్వంలోని జనతా కాంగ్రెస్‌ ఛత్తీస్‌ గఢ్‌(జోగి)– మాయావతి పార్టీ బీఎస్పీల కూటమి ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించే అవకాశముందని మెజారిటీ సర్వేలు పేర్కొన్నాయి. రాజస్తాన్‌లో కాంగ్రెస్‌దే సునాయాస విజయమని మెజారిటీ సర్వేలు తేల్చాయి. 199 స్థానాల్లో కాంగ్రెస్‌కు 119–141 వస్తా యని ఇండియాటుడే– యా క్సిస్‌ అంచనా.

ఎడారి రాష్ట్రం ‘హస్త’గతం
దాదాపు అందరూ అనుకున్నట్లుగానే రాజస్తాన్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటు ఖాయమని ఎగ్జిట్‌పోల్స్‌ స్పష్టం చేస్తున్నాయి. అసెంబ్లీలో 200 స్థానాలుండగా ప్రభుత్వం ఏర్పాటుకు 100 మంది బలం అవసరం. ఎన్నికలు జరిగిన 199 స్థానాల్లో కాంగ్రెస్‌కు 100 సీట్లకుపైగానే వస్తాయని ఎగ్జిట్‌ పోల్స్‌ చెబుతున్నాయి. బీజేపీ ప్రభుత్వంపై వ్యతిరేకత కాంగ్రెస్‌కు లాభదాయకమవుతుందని సర్వేలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యమంత్రి వసుంధర ప్రజా యాత్రలు, ప్రధాని మోదీ, బీజేపీ చీఫ్‌ అమిత్‌షాల పర్యటనలు ఓటర్లపై అంతగా ప్రభావం చూపలేదని విశ్లేషకులు అంటున్నారు. అభ్యర్థుల ఎంపికలో అమిత్‌షా, వసుంధరల మధ్య విభేదాలు, ఎన్నికల తరుణంలో బీజేపీ నేతలు పలువురు ఆ పార్టీని వదిలి రావడం వంటికి కాంగ్రెస్‌కు లాభించే అంశాలని చెబుతున్నారు. ముఖ్యంగా ‘రాజమాత’ వసుంధర, ఆమె మంత్రులు తమకు అందుబాటులో లేరన్న భావం ఓటర్లలో బలంగా నాటుకుందని, అందుకే ఇష్టం లేకున్నా కాంగ్రెస్‌కు పట్టం కట్టడానికి సిద్ధపడ్డారని ఎన్నికల విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇండియా టుడే– యాక్సిస్‌ మై ఇండియా, టైమ్స్‌ నౌ– సీఎన్‌ఎక్స్, సీ ఓటర్‌–రిపబ్లిక్‌ టీవీ, ఇండియా టీవీ, న్యూస్‌ నేషన్, న్యూస్‌24–పేస్‌ మీడియా, న్యూస్‌ ఎక్స్‌ నేత ఎగ్జిట్‌ పోల్స్‌ కాంగ్రెస్‌దే అధికారమని తేల్చి చెప్పగా... రిపబ్లిక్‌ టీవీ–జన్‌ కీ బాత్‌ సర్వే మాత్రం బీజేపీ, కాంగ్రెస్‌ దాదాపు సమానంగా సీట్లు సాధిస్తాయని తెలిపింది.  


వసుంధర రాజే, సచిన్‌ పైలట్‌

‘మధ్యప్రదేశ్‌’ హోరాహోరీ
రైతు సమస్యలే ప్రధాన అజెండాగా ఎన్నికలు జరిగిన మధ్యప్రదేశ్‌లో అధికార మార్పిడి జరిగేనా? 15 ఏళ్లుగా అధికారంలో కొనసాగుతున్న బీజేపీ తన హవాను కొనసాగించేనా? ముగ్గురు రథసారథుల నేతృత్వంలోని కాంగ్రెస్‌ ఎట్టకేలకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేనా? లాంటి ప్రశ్నలకు ఎగ్జిట్‌ పోల్స్‌ కూడా స్పష్టమైన సమాధానం ఇవ్వలేకపోయాయి. ఉత్తరాదిలోని పెద్ద రాష్ట్రాల్లో ఒకటైన మధ్యప్రదేశ్‌లో బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య హోరాహోరీ తప్పదని చెప్పాయి. కౌంటింగ్‌ పూర్తయ్యే వరకు తుది ఫలితం ఊహించడం కష్టమని మెజారిటీ సర్వేలు పేర్కొనగా, కొన్ని మాత్రం మొగ్గు బీజేపీ వైపే ఉందని తెలిపాయి. ఇప్పటికే మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌పై ప్రజల్లో అంతగా వ్యతిరేకత పెరగలేదని, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై కూడా ప్రజలు సంతృప్తిగానే ఉన్నట్లు వెల్లడించాయి. కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ దేవాలయాల సందర్శన పెద్దగా ఓట్లు రాల్చకపోవచ్చని తెలిపాయి.


పంట దిగుబడుల ధరలు గతంలో లేనంతగా దారుణంగా పడిపోవడం శివరాజ్‌ సర్కారుకు మరణశాసనం అవుతుందని వేసిన అంచనాలు వంద శాతం నిజం కాకపోవచ్చని తేల్చిచెప్పాయి. కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి అభ్యర్థులుగా భావిస్తున్న కమల్‌నాథ్, జ్యోతిరాదిత్య సింధియా, దిగ్విజయ్‌ సింగ్‌ల మధ్య అంతర్గత పోరు ఆ పార్టీని దెబ్బతీసే అవకాశాలున్నట్లు తెలిపాయి. రాష్ట్రంలోని మొత్తం అసెంబ్లీ సీట్లు 230 కాగా, అధికారం చేపట్టాలంటే కావల్సిన మెజారిటీ 116 సీట్లు. ఏ పార్టీకి సాధారణ మెజారిటీ రాని పక్షంలో ప్రభుత్వ ఏర్పాటులో ఇతరులు, స్వతంత్రులు కీలక పాత్ర పోషించే అవకాశాలున్నాయి. రిపబ్లిక్‌ టీవీ–జన్‌ కీ బాత్‌ సర్వేలో బీజేపీకి 108–128, కాంగ్రెస్‌కు 95–115 సీట్లు వచ్చే అవకాశాలున్నట్లు తేలింది. 126 సీట్లతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తుందని, కాంగ్రెస్‌ 89 సీట్లకు పరిమితమవుతుందని టైమ్స్‌ నౌ–సీఎన్‌ఎక్స్‌ ఎగ్జిట్‌ పోల్స్‌ తెలిపాయి. మరోవైపు, కాంగ్రెస్‌ 104–122 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించడం లేదా ప్రభుత్వ ఏర్పాటుకు కావల్సిన మెజారిటీని సాధిస్తుందని ఇండియా టుడే–యాక్సిస్‌ అంచనా వేసింది. బీజేపీ 102–120 సీట్లు గెలుచుకుంటుందని తెలిపింది. ఎన్నికలు జరిగిన ఐదు రాష్ట్రాల్లో అత్యంత ఆసక్తి రేకెత్తిస్తున్న మధ్యప్రదేశ్‌లో ప్రజా తీర్పును తెలుసుకో వాలంటే ఈ నెల 11 వరకు ఎదురుచూడక తప్పదు!


‘పీపుల్స్‌ పల్స్‌’ కాంగ్రెస్‌కే..
హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న ప్రముఖ ఎన్నికల సర్వే సంస్థ పీపుల్స్‌ పల్స్‌..15 ఏళ్ల తరువాత కాంగ్రెస్‌ మధ్యప్రదేశ్‌లో అధికారంలోకి రాబోతోం దని జోస్యం చెప్పింది. కాంగ్రెస్‌కు 116–120, బీజేపీకి 98–102 సీట్లు రావచ్చని సర్వేలో తెలిపింది.

ప్రాంతాల వారీగా అంచనా..
► గ్వాలియర్‌: కాంగ్రెస్‌ పాపులారిటీ పెరిగింది
► బుందేల్‌ఖండ్‌: కాంగ్రెస్‌దే ఆధిపత్యం
► బాగేల్‌ఖండ్‌: కాంగ్రెస్‌దే ఆధిపత్యం
► మహాకోశల్‌: బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య హోరాహోరీ
► మాల్వా: కాంగ్రెస్‌కు మొగ్గు
► భోపాల్‌: బీజేపీకి స్వల్ప మొగ్గు


శివరాజ్‌ సింగ్‌ చౌహాన్, జ్యోతిరాదిత్య


మిజోరం ‘చే’జారుతుందా?  
ఈశాన్య భారత్‌లో అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రం మిజోరంలో కాంగ్రెస్‌కు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని ఎగ్జిట్‌ పోల్స్‌ తేల్చాయి. పదేళ్లుగా ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న లాల్‌ తాన్హావ్లా పాలనపై విసుగు చెందిన ప్రజలు ప్రాంతీయ పార్టీ మిజో నేషనల్‌ ఫ్రంట్‌(ఎమ్‌ఎన్‌ఎఫ్‌) వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలిపాయి. అసెంబ్లీలోని మొత్తం 40 సీట్లకు గాను అధికారం చేపట్టాలంటే 21 స్థానాల్లో గెలుపొందాల్సి ఉంది. 18 సీట్లతో ఎమ్‌ఎన్‌ఎఫ్‌ అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని, 16 సీట్లతో కాంగ్రెస్‌ రెండో స్థానంలో నిలుస్తుందని, ఫలితంగా హంగ్‌ అసెంబ్లీ ఏర్పడటానికి ఎక్కువ అవకాశాలున్నట్లు టైమ్స్‌ నౌ–సీఎన్‌ఎక్స్‌ అంచనా వేసింది. త్రిపుర తరువాత మరో ఈశాన్య రాష్ట్రంలో పాగా వేయాలని ఎదురుచూస్తున్న బీజేపీకి నిరాశ తప్పేలా లేదు. 39 స్థానాల్లో పోటీచేసిన ఆ పార్టీకి ఒక్క సీటు కూడా దక్కే అవకాశం లేదని సర్వేలు వెల్లడించాయి.

మిజోరంలో పదేళ్లకోసారి అధికార మార్పిడి జరగడం సంప్రదాయంగా వస్తోంది. అయితే ఆ రాష్ట్రంలో ఎప్పుడూ హంగ్‌ అసెంబ్లీ ఏర్పడలేదు. ఎంఎన్‌ఎఫ్, కాంగ్రెస్‌ల మాదిరిగా సంపూర్ణ మద్య నిషేధంపై స్పష్టమైన వైఖరి ప్రకటించకపోవడం బీజేపీని దెబ్బ తీస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. హిందూత్వ పార్టీ అన్న ముద్రను తొలగించుకోవడంలోనూ ఆ పార్టీ విఫలమైందని అభిప్రాయపడుతున్నారు. పదేళ్లుగా అధికారంలో ఉండటమే కాంగ్రెస్‌పై వ్యతిరేకత పెరగడానికి ప్రధాన కారణమని భావిస్తున్నారు. దొడ్డిదారిన అధికారంలోకి రావడానికి ఎంఎన్‌ఎఫ్‌తో బీజేపీతో అంటకాగుతోందని కాంగ్రెస్‌ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఒకవేళ కాషాయ పార్టీకి ఒకటీ అర సీట్లొచ్చి, ఎంఎన్‌ఎఫ్‌ సాధారణ మెజారిటీకి కొద్ది దూరంలో నిలిస్తే ఆ రెండు పార్టీలు చేతులు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.   మిజోరంలో ఏ పార్టీకి కూడా స్పష్టమైన మెజారిటీ రాదని, హంగ్‌ తప్పదని పీపుల్స్‌ పల్స్‌ అంచనా వేసింది. ఎంఎన్‌ఎఫ్‌కు 15–19 సీట్లు, కాంగ్రెస్‌కు 14–19 స్థానాలు రావొచ్చని తెలిపింది. జోరమ్‌ పీపుల్స్‌ మూవ్‌మెంట్‌ 2–4, బీజేపీ 0–2 సీట్లుకు పరిమితం కావొచ్చని వెల్లడించింది.   

ఛత్తీస్‌గఢ్‌లో హంగేనా?
బీజేపీ అధికారంలో ఉన్న ఛత్తీస్‌గఢ్‌లో ఈసారి ఏ పార్టీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత స్పష్టమైన మెజారిటీ రాదని ఎగ్జిట్‌ పోల్స్‌ స్పష్టం చేశాయి. అసెంబ్లీలో ఉన్న 90 సీట్లలో బీజేపీ 40, కాంగ్రెస్‌ 43 సీట్లు దక్కించుకోవచ్చని, ఐదు సీట్లు బీఎస్పీ కూటమికి రావచ్చని చెబుతున్నాయి. ప్రభుత్వం ఏర్పాటుకు కనీసం 45 మంది బలం అవసరమవుతుంది. ఏ ఎగ్జిట్‌పోల్‌లోనూ కూడా ఏ పార్టీకీ పూర్తి మెజారిటీ వస్తుందని స్పష్టం కాలేదు. అయితే, అజిత్‌జోగి నాయకత్వంలో బరిలో దిగిన బీఎస్పీ కూటమి ఐదారు స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని, అదే జరిగితే ప్రభుత్వం ఏర్పాటులో ఆ కూటమి కీలక పాత్ర పోషిస్తుందని పరిశీలకులు భావిస్తున్నారు.

బీజేపీ, కాంగ్రెస్‌తోపాటు బీఎస్‌పీ, అజిత్‌ జోగికి చెందిన కాంగ్రెస్‌ ఛత్తీస్‌గఢ్‌(జే), ఆమ్‌ఆద్మీ పార్టీ తమ అభ్యర్థులను కొన్ని చోట్ల పోటీలో ఉంచాయి. ఈ ఎన్నికల్లో మావోయిస్టు సమస్యను బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు ప్రచారాంశంగా చేసుకున్నాయి. బీజేపీ తరఫున ప్రధానమంత్రి మోదీ, సీఎం రమణ్‌సింగ్‌తోపాటు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ కూడా ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కాంగ్రెస్‌ తరఫున ప్రచారం చేసిన పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ సీఎం రమణ్‌సింగ్‌ అవినీతిని వివిధ సందర్భాల్లో ఎండగట్టారు. ఎన్నికల బహిష్కరణకు మావోయిస్టులు పిలుపు ఇచ్చారు కూడా. అయినప్పటికీ, పటిష్ట బందోబస్తు మధ్య మొదటి విడతలో నవంబర్‌ 12వ తేదీన మావోయిస్టు ప్రభావిత జిల్లాల్లో, నవంబర్‌ 20వ తేదీన రెండో విడత ఇక్కడ ఎన్నికలు జరిగాయి. ఈ పోలింగ్‌లో 76.35 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 2013లో రాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో 77.40 శాతం పోలింగ్‌ నమోదైంది.

ఛత్తీస్‌లో నువ్వా–నేనా
ఛత్తీస్‌గఢ్‌లో గత 15 ఏళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీతో కాంగ్రెస్‌ పార్టీ నువ్వానేనా అన్న రీతిలో తలపడుతోంది. హైదరాబాద్‌కు చెందిన ‘పీపుల్స్‌ పల్స్‌’ సంస్థ ఇక్కడ నిర్వహించిన సర్వేలో ప్రజలు కాంగ్రెస్‌ వైపు మొగ్గు చూపారు. ముఖ్యమంత్రి రమణ్‌సింగ్‌కు ప్రజాదరణ ఉన్నప్పటికీ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చలేకపోయారన్న అపప్రథ ఉంది. అజిత్‌ జోగి, మాయావతి కూటమి కారణంగా కాంగ్రెస్‌కు నష్టం ఉంటుందని చాలా మంది భావించినప్పటికీ, వాస్తవాలు అందుకు విరుద్ధంగా ఉన్నట్లు తేలింది. బీజేపీ విజయావకాశాలను అంతర్గత విభేదాలు కొంతమేర దెబ్బతీయనున్నాయి.  అజిత్‌ జోగి నిష్క్రమణ అనంతరం కాంగ్రెస్‌ పార్టీలో మిగిలిన నేతలు భూపేశ్‌ బాఘెల్, తామ్రధ్వజ్‌ సాహు వంటి వారు ఎన్నికల్లో తమ గత విభేదాలను పక్కనబెట్టి, పార్టీకి నష్టం కలుగని రీతిలో వ్యవహరించారు.

తెలంగాణలో  115 కోట్లు..
రాజస్తాన్‌లో 12 కోట్లు..

సాక్షి, న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తెలంగాణలో పారిన నగదు ప్రవాహానికి సంబంధించి ఒక ఆసక్తికర చర్చ దేశ రాజధానిలో నడుస్తోంది. రాజస్తాన్, తెలంగాణల్లో ఒకేరోజు ఎన్నికలు జరిగాయి. రాజస్తాన్‌లోని మొత్తం నియోజకవర్గాలు 200. ఇప్పుడు ఎన్నికలు జరిగింది 199 స్థానాలకు. తెలంగాణలో ఉన్నవి 119. కానీ ఎన్నికల సందర్భంగా తెలంగాణలో స్వాధీనం చేసుకున్న నగదు రాజస్తాన్‌లో స్వాధీనం చేసుకున్న దానికన్నా దాదాపు పదింతలు ఎక్కువ. తెలంగాణలో రూ. 115.19 కోట్ల నగదు, రూ. 12.26 కోట్ల విలువైన 5.45 లక్షల లీటర్ల మద్యం పట్టుకున్నారు.  4,451.59 కిలోల మాదక ద్రవ్యాలు, రూ. 6.79 కోట్ల విలువైన నగలు, రూ. 1.83 కోట్ల విలువైన ఇతర కానుకలను స్వాధీనం చేసుకున్నారు.

మొత్తం స్వాధీనం చేసుకున్న నగదు, వస్తువుల విలువ రూ. 136.89 కోట్లు. కానీ రాజస్తాన్‌లో దొరికిన నగదు కేవలం రూ. 12.85 కోట్లు మాత్రమే. అయితే మద్యం విలువ చాలా ఎక్కువ. 6.04 లక్షల లీటర్ల మద్యం పట్టుకోగా దాని విలువ రూ. 39.49 కోట్లుగా చూపారు. అంటే తెలంగాణతో పోల్చితే ఇది ఖరీదైన మద్యమై ఉండాలి. మాదక ద్రవ్యాలు భారీగా దొరికాయి.రూ. 14.58 కోట్ల విలువైన 38,572 కిలోల మాదకద్రవ్యాలు దొరికాయి. రాజస్తాన్‌లో స్వాధీనం చేసుకున్న నగల విలువ రూ. 26.89 కోట్లు. ఇందులో రూ. 16.84 కోట్ల విలువైన బంగారం. 601 కిలోల వెండి ఉంది. ఇతర కానుకల విలువ రూ. 12.65 కోట్లు. మొత్తంగా స్వాధీనం చేసుకున్న వాటి విలువ రూ. 86.42 కోట్లు. 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు