కాంగ్రెస్‌దే జయనగర

14 Jun, 2018 02:17 IST|Sakshi
బెంగళూరులో విజయసంకేతం చూపిస్తున్న సౌమ్యారెడ్డి

2,889 ఓట్ల మెజారిటీతో సౌమ్యారెడ్డి విజయం

పోరాడి ఓడిన బీజేపీ

సాక్షి, బెంగళూరు: బెంగళూరు నగరంలోని జయనగర అసెంబ్లీ నియోజకవర్గం ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయం సాధించింది. కాంగ్రెస్‌ అభ్యర్థి, మాజీ మంత్రి రామలింగారెడ్డి కుమార్తె సౌమ్యారెడ్డి 2,889 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. వరుసగా గత రెండు ఎన్నికల్లో బీజేపీ ఇక్కడినుంచి గెలిచింది. జూన్‌ 11న ఎన్నిక జరగగా బుధవారం నువ్వా–నేనా అన్నట్లుగా సాగిన లెక్కింపులో చివరకు సౌమ్యారెడ్డి పైచేయి సాధించారు. ఈమెకు 54,457 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థి బీఎన్‌ ప్రహ్లాద్‌కు 51,568 ఓట్లు వచ్చాయి.

దీంతో నియోజకవర్గంలో కాంగ్రెస్‌ మద్దతుదారులు సంబరాలు చేసుకున్నారు. సౌమ్యారెడ్డి యువ నాయకురాలిగా జయనగరలో సుపరిచితం. సేవా, పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ ఉంటారు. మే 12న అసెంబ్లీ ఎన్నికలతో పాటు పోలింగ్‌ జరగాల్సి ఉండగా.. అయితే బీజేపీ అభ్యర్థి, సిట్టింగ్‌ ఎమ్మెల్యే బీఎన్‌ విజయకుమార్‌ పోలింగ్‌కు రెండ్రోజుల ముందు గుండెపోటుతో మరణించారు. దీంతో ఇక్కడ ఎన్నికలు వాయిదా పడ్డాయి. విజయకుమార్‌ సోదరుడు ప్రహ్లాద బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయగా, ఈ నెల 11న పోలింగ్‌ జరిగింది. ఈ ఎన్నికలో కాంగ్రెస్‌ అభ్యర్థికి జేడీఎస్‌ మద్దతు తెలిపింది.

అసెంబ్లీలో తండ్రీ కూతుళ్లు
సౌమ్య తండ్రి రామలింగారెడ్డి గత ప్రభుత్వంలో హోంమంత్రిగా పనిచేశారు. ఈసారి కూడా ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. దీంతో తండ్రీకూతుళ్లు ఎమ్మెల్యేలుగా ఉండటం కన్నడ చరిత్రలో ఇదే తొలిసారి. గత నెల్లో అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 104 సీట్లు, కాంగ్రెస్‌ 78, జేడీఎస్‌ 37 సీట్లు స్థానాలు దక్కించుకోవడం తెలిసిందే. ఈ గెలుపుతో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల సంఖ్య 80కి పెరిగినా, ఇటీవల జమఖండి ఎమ్మెల్యే సిద్ధు న్యామగౌడ రోడ్డు ప్రమాదంలో మరణించడంతో 79కి తగ్గింది. జయనగరలో సానుభూతి గట్టెక్కిస్తుందని బీజేపీ ఎంతగానో ఆశలు పెట్టుకుంది. అయితే ముఖ్య నాయకుల సహాయ నిరాకరణ బీజేపీ ఓటమికి కారణమైంది.

మరిన్ని వార్తలు