కన్నడ ‘స్థానికం’లో కాంగ్రెస్‌ జోరు

4 Sep, 2018 02:46 IST|Sakshi
ఫలితాలు వెలువడ్డాక మైసూరులో సంబరాలు చేసుకుంటున్న కాంగ్రెస్‌ కార్యకర్తలు

982 స్థానాల్లో కాంగ్రెస్‌ గెలుపు

929 చోట్ల బీజేపీ విజయం

కాంగ్రెస్‌–జేడీఎస్‌ కూటమికే మెజార్టీ మున్సిపాలిటీలు

సాక్షి, బెంగళూరు: కర్ణాటక పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్‌ ముందంజలో ఉంది. మొత్తం 2,662 స్థానాల్లో ఫలితాలు వెల్లడవగా.. కాంగ్రెస్‌ 982 స్థానాలను, బీజేపీ 929 స్థానాలను సాధించాయి. జేడీఎస్‌ 375 సీట్లలో గెలవగా.. ఇండిపెండెంట్లు ఇతర చిన్న పార్టీలు కలిసి 376 స్థానాల్లో ఇతరులు పాగా వేశారు. కాంగ్రెస్, బీజేపీ మధ్య సీట్ల తేడా స్వల్పంగానే ఉంది. అయితే సంకీర్ణ కూటమిలో భాగస్వామిగా ఉన్న జేడీఎస్‌తో కలిసి మెజారిటీ పట్టణ స్థానిక సంస్థల (యూఎల్‌బీ)పై కాంగ్రెస్‌ పట్టుదక్కించుకోనుంది.

3 సిటీ కార్పొరేషన్లు, 29 సిటీ మునిసిపల్‌ కార్పొరేషన్లు, 52 పట్టణ మునిసిపాలిటీలు, 20 పట్టణ పంచాయతీల్లోని 2,709 స్థానాలకు శనివారం ఎన్నికలు జరిగాయి. సోమవారం కౌంటింగ్‌ అనంతరం రాష్ట్ర ఎన్నికల సంఘం 2,662 స్థానాల్లో ఫలితాలను వెల్లడించింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీఎస్‌ యడ్యూరప్ప సొంత జిల్లా షిమోగాలో బీజేపీ పూర్తి ఆధిపత్యం కనబరచగా.. మిగిలిన చోట్ల నువ్వా, నేనా అన్నట్లుగానే పోటీ నెలకొంది. మొత్తం 29 నగర సభల్లో బీజేపీ 10 కార్పొరేషన్లను గెల్చుకోగా, కాంగ్రెస్‌కు 5, జేడీఎస్‌కు 3 దక్కాయి.

మెజార్టీ ‘జేడీఎస్‌+కాంగ్రెస్‌’దే
సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వాములైన జేడీఎస్, కాంగ్రెస్‌లు ఈ ఎన్నికల్లో వేర్వేరుగా పోటీ చేశాయి. ఎన్నికల తర్వాత పొత్తు కొనసాగుతుందని ముందుగానే ప్రకటించాయి. ఈ లెక్క ప్రకారం జేడీఎస్, కాంగ్రెస్‌ల కూటమి ఖాతాలో మొత్తం 1,357 స్థానాలు చేరాయి. దీంతో మెజారిటీ మునిసిపాలిటీల్లో బీజేపీ కన్నా ఈ కూటమిదే ఆధిపత్యం కానుంది. ‘బీజేపీకి అధికారం దక్కకుండా ఉండేందుకు అవసరమైన చోట సంకీర్ణంలో చేరేందుకు మేం సిద్ధమే’ అని మాజీ ప్రధాని, జేడీఎస్‌ చీఫ్‌ హెచ్‌డీ దేవెగౌడ పేర్కొన్నారు.

ఇవి లోక్‌సభ ఎన్నికలకు దిక్సూచి కాదన్నారు. ఈ ఎన్నికలను కన్నడ ప్రభుత్వం పనితీరుపై రెఫరెండంగా, 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు రాష్ట్రంలో ఓటరు నాడిని తెలుసుకునే ప్రయత్నంగా భావించారు. అయితే దాదాపుగా అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే రిపీట్‌ అయ్యాయి. 2013 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలను బట్టి చూస్తే బీజేపీ చాలా పుంజుకుంది. కర్ణాటకలో మొత్తం 4,976 యూఎల్‌బీ స్థానాలుండగా.. మిగిలిన 2,267 చోట్ల వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. ఇటీవల వరదలతో అతలాకుతలమైన కొడగులో ఎన్నికలను వాయిదా వేశారు.

విమర్శలకు చెంపపెట్టు: సీఎం
‘సంకీర్ణ ప్రభుత్వంలో లుకలుకలున్నాయని, ప్రభుత్వం బలహీనంగా ఉందని, సర్కారు త్వరలోనే కూలిపోతుందని దుష్ప్రచారం చేస్తున్న వారికి ఈ ఫలితాలు చెంపపెట్టు’ అని సీఎం కుమారస్వామి పేర్కొన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్‌ బలహీనపడిందని వస్తున్న విమర్శలకు ఈ ఫలితాలు సరైన సమాధానమని కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు దినేశ్‌ గుండూరావ్‌ వ్యాఖ్యానించారు. అయితే ఫలితాలు తమ పార్టీ ఊహించిన రీతిలో లేవని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బీఎస్‌ యడ్యూరప్ప పేర్కొన్నారు. అయితే ఓవరాల్‌గా చూస్తే ఫలితాలు సంతృప్తికరంగానే ఉన్నాయన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలోని మొత్తం 28 లోక్‌సభ ఎన్నికల్లో 22, 23 స్థానాల్లో విజయఢంకా మోగిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. స్థానిక ఎన్నికల్లో స్థానిక అంశాలే ప్రభావితం చేస్తాయ ని రాష్ట్ర ప్రభుత్వం ప్రభావం ఉండదన్నారు.

విజయోత్సవ ర్యాలీపై యాసిడ్‌ దాడి
స్థానిక సంస్థల ఫలితాల నేపథ్యంలో తుమకూరులో విజయం సాధించిన అభ్యర్థిపై యాసిడ్‌ దాడి జరిగింది. ఈ ఘటనలో 9 మంది ఆయన మద్దతుదారులతోపాటు దాడికి పాల్పడిన ఓ వ్యక్తికి గాయాలయ్యాయి. తుమకూరు వార్డు నంబర్‌ 16లో కాంగ్రెస్‌ అభ్యర్థి ఇనాయతుల్లా ఖాన్‌ గెలిచారు. దీంతో పార్టీ కార్యకర్తలతో కలిసి ఆయన విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జనంలో నుంచి ఒక్కసారిగా ముందుకు దూసుకొచ్చిన ఓ గుర్తుతెలియని వ్యక్తి ర్యాలీ వాహనంపై యాసిడ్‌ చల్లాడు. దీంతో ఇనాయతుల్లా ఖాన్‌ ముఖంపై గాయాలయ్యాయి. గాయపడిన ఆయన అనుచరులకూ వెంటనే స్థానిక ప్రభుత్వాసుపత్రిలో చికిత్సనందించారు. ఎన్నికల్లో ఖాన్‌ ప్రత్యర్థులే ఈ దుశ్చర్యకు పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఈ దిశగా విచారణ కొనసాగిస్తున్నారు.
 

మరిన్ని వార్తలు