రాజస్థాన్‌ ఉప ఎన్నికల్లో బీజేపీకి షాక్‌

1 Feb, 2018 15:30 IST|Sakshi
కాంగ్రెస్‌, బీజేపీ

ఒక అసెంబ్లీ, రెండు లోక్‌సభ స్థానాల్లోనూ కాంగ్రెస్‌ ముందంజ

అసెంబ్లీ ఎన్నికల ముందు గట్టి ఎదురుదెబ్బ

జైపూర్‌: ఈ ఏడాది ద్వితీయార్థంలో అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న రాజస్థాన్‌లో అధికార బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్రంలో జరిగిన కీలకమైన ఉప ఎన్నికల్లో కమలదళానికి చుక్కెదురైంది. ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీ అనూహ్యంగా పుంజుకొని మండల్‌గఢ్‌ అసెంబ్లీ స్థానంలో విజయకేతనం ఎగరవేసింది. అలాగే అజ్మీర్‌, అల్వార్‌ లోక్‌సభ స్థానాల ఉప ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించింది. ఈ మూడు స్థానాల్లో విజయం.. కాంగ్రెస్‌ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపుతోంది. ఈ విజయంతో జైపూర్‌లోని కాంగ్రెస్‌ రాష్ట్ర ప్రధాన కార్యాలయం సంబరాలతో కోలాహలంగా మారగా.. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయం జనంలేక వెలవెలపోయింది.

2014 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఒక్క స్థానం కూడా గెలుచుకోలేక.. తుడిచిపెట్టుకుపోయింది. ఈ నేపథ్యంలో రెండు లోక్‌సభ స్థానాలు ఆ పార్టీ కైవసం చేసుకోబోతుండటం గమనార్హం. ఉప ఎన్నికలు జరిగిన ఈ మూడు స్థానాలు అధికార బీజేపీవే.. ఇద్దరు సిట్టింగ్‌ ఎంపీలు సన్వర్‌ లాల్‌ జాట్‌ (అజ్మీర్‌), మహంత్‌ చంద్‌ నాథ్‌ యోగి (అల్వార్‌), సిట్టింగ్‌ ఎమ్మెల్యే కీర్తి కుమారీ (మండల్‌గఢ్‌) చనిపోవడంతో ఉప ఎన్నికలు జరిగాయి.

రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలకు కేవలం ఏడు నెలల ముందు జరిగిన ఈ ఉప ఎన్నికలను అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్‌ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అసెంబ్లీ పోరుకు సెమీఫైనల్‌గా భావించి.. సీఎం వసంధరారాజే, రాజస్థాన్‌ కాంగ్రెస్‌ చీఫ్‌ సచిన్‌ పైలట్‌ హోరాహోరీగా ప్రచారం చేశారు.

గత లోక్‌సభ ఎన్నికల్లో అజ్మీర్‌ సీటు నుంచి కాంగ్రెస్‌ చీఫ్‌ సచిన్‌ పైలట్‌ పరాజయం పాలవ్వగా.. ఈసారి ఇక్కడ బీజేపీ అభ్యర్థి రాంస్వరూప్‌ లంబాపై కాంగ్రెస్‌ అభ్యర్థి రఘు శర్మ భారీ మెజారిటీతో గెలుపొందగా.. అల్వార్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి కరణ్‌సింగ్‌ యాదవ్‌.. బీజేపీ అభ్యర్థి జస్వంత్‌సింగ్‌ యాదవ్‌పై విజయం సాధించారు. రాహుల్‌ గాంధీ కీలక అనుచరులుగా భావించే సచిన్‌ పైలట్‌, సీపీ జోషీ, జితేంద్రసింగ్‌ భన్వర్‌ ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇక్కడ పార్టీ విజయానికి కృషి చేశారు.

మరిన్ని వార్తలు