ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియపై రాళ్లదాడి

4 May, 2019 12:44 IST|Sakshi

సాక్షి, ఖమ్మం : ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ నాయక్‌పై కాంగ్రెస్‌ కార్యకర్తలు రాళ్లదాడికి యత్నించారు. కాంగ్రెస్‌ తరుపున ఎమ్మెల్యేగా గెలిచి ఈ మధ్యనే టీఆర్‌ఎస్‌లో చేరిన హరిప్రియ శనివారం తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారానికి రావడంతో కాంగ్రెస్‌ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ..ఆమెను అడ్డుకున్నారు. ఈ సంఘటన ఇల్లెందు నియోజకవర్గం కామేపల్లి మండలం గోవింద్రాల గ్రామంలో చోటుచేసుందకుంది. ఎమ్మెల్యేను అడ్డుకున్ననేపథ్యంలో వారితో టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు ఘర్షణకు దిగారు. ఇరువర్గాలు రాళ్లతో దాడులు చేసుకోవడంతో పలువురు గాయపడ్డారు. దీంతో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఖమ్మం జిల్లాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, పరిస్థితి అదుపులోకి తీసుకున్నారు. ఇరువర్గాలకు చెందిన పలువురిని అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు గాయపడినవారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

నా వెనుక ప్రజాబలముంది: హరిప్రియ
దాడి ఘటనపై ఎమ్మెల్యే హరిప్రియ నాయక్‌ మాట్లాడుతూ..‘ నెల రోజులుగా నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో తిరుగుతున్నా. అలాంటిది ఎక్కడాలేని ఘటననలు కామేపల్లి మండలంలో జరుగుతున్నాయి. 11మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ నుంచి టీఆర్‌ఎస్‌లోకి వచ్చారు. మరి ఎక్కడా ఇటువంటి సంఘటనలు జరగలేదు. నాపై దాడి చేసినవారిపై ప్రజలు తిరగబడ్డారు. నా వెనుక ప్రజా బలముంది. ఈ రోజు జరిగిన దాడి గిరిజన మహిళల మీద జరిగిన దాడి. టీఆర్‌ఎస్‌ కార్యకర్తలపై జరిగిన దాడిని ఖండిస్తున్నా. ఈ ఘటన ఎవరున్నారో ప్రజలందరికీ తెలుసు’ అని అన్నారు.


 

మరిన్ని వార్తలు