రాహుల్‌ రాజీనామాను తిరస్కరించిన సీడబ్ల్యూసీ

25 May, 2019 16:09 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ(సీడబ్ల్యూసీ)సమావేశం ముగిసింది. లోక్‌సభ ఎన్నికల్లో ఘోర పరాజయంపై కారణాలను విశ్లేషించుకునేందుకు శనివారం సీడబ్ల్యూసీ సభ్యులు భేటీ అయ్యారు. ఢిల్లీలోని కాంగ్రెస్‌ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటైన ఈ సమావేశంలో యూపీఏ ఛైర్‌పర్సన్‌ సోనియాగాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌, కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, ఆ పార్టీ సీనియర్‌ నేతలు పాల్గొన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో కేవలం 52 సీట్లతో పార్టీ ఘోర పరాజయం చెందడంపై ఈ సమావేశంలో నాలుగు గంటలపాటు నేతలు చర్చించారు. పార్టీ ఓటమికి కారణాలపై సమీక్ష జరిపారు.

ఈ సందర్భంగా ఓటమికి బాధ్యత వహిస్తూ అధ్యక్ష పదవికి రాహుల్‌ రాజీనామా చేస్తానని ప్రదిపాదించారు. పార్టీ కోసం పనిచేస్తానని, అధ్యక్షుడిగా కొనసాగలేనని రాహుల్‌ వెల్లడించినట్లు సమాచారం. అయితే రాహుల్‌ రాజీనామాను సీడబ్ల్యూసీ తిరస్కరించింది. ఈ ఓటమి బాధ్యత అందరిది అని, రాజీనామా చేయాల్సిన అవసరం లేదని కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సభ్యులు రాహుల్‌ను బుజ్జగించారు. దీంతో కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడిగా కొనసాగడానికి రాహుల్‌ గాంధీ అంగీకరించినట్లు సమాచారం.

మరిన్ని వార్తలు