రాజ్యసభకు పోటీ చేద్దామా.. వద్దా?

1 Dec, 2019 08:13 IST|Sakshi

సాక్షి, బెంగళూరు: రాష్ట్రంలో శాసనసభ సభ్యుల కోటాలో ఖాళీగా ఉన్న రాజ్యసభ సీటు ఉప ఎన్నికకు సంబంధించి నామినేషన్ల దాఖలుకు మరొక్క రోజు మాత్రమే గడువు ఉంది. అయితే ఇంతవరకు కాంగ్రెస్‌ – జేడీఎస్‌ అభ్యర్థులను ఖరారు కాలేదు. కాగా బీజేపీ తరఫున కేసీ రామ్మూర్తి ఇప్పటికే నామినేషన్‌ దాఖలు చేశారు. మొత్తం 224 మంది శాసనసభ్యులు ఉన్న కర్ణాటకలో రాజ్యసభ ఎన్నికలో గెలవాలంటే సగం కంటే ఎక్కువ సభ్యుల మద్దతు అవసరం. బీజేపీకి ఇప్పటికే 105 మంది ఎమ్మెల్యేలతో పాటు స్వతంత్ర ఎమ్మెల్యే మద్దతుంది. ఈ నెల 9న 15 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికలు ఫలితాలు విడుదల కానున్నాయి.

అనంతరం గెలిచిన ఎమ్మెల్యేలకు ఓటు హక్కు ఉంటుంది. అప్పటి సంఖ్యాబలం ప్రకారం రాజ్యసభ సభ్యునిగా ఎన్నిక కావాలంటే 112 మంది ఎమ్మెల్యేల బలం అవసరం. కేవలం 34 ఎమ్మెల్యేలు ఉన్న జేడీఎస్‌ అభ్యర్థిని బరిలో దించినా గెలవడం కష్టసాధ్యం. అదేవిధంగా 66 మంది సభ్యులు కాంగ్రెస్‌ పరిస్థితి కూడా అంతే. కాంగ్రెస్‌ – జేడీఎస్‌ మధ్య పొత్తు కుదిరితే ఏదైనా జరగవచ్చు. సోమవారంతో నామినేషన్ల దాఖలుకు గడువు ముగియనుంది. ఒకవేళ కాంగ్రెస్‌ – జేడీఎస్‌ నుంచి పోటీ నుంచి తప్పుకుంటే కేసీ రామ్మూర్తి ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశం ఉంది.  

నేడు కాంగ్రెస్‌ నేతల భేటీ 
రాజ్యసభ ఉప ఎన్నిక నేపథ్యంలో అభ్యర్థి ఎంపిక కోసం కాంగ్రెస్‌ నేతలు ఆదివారం నగరంలోని కేపీసీసీ కార్యాలయంలో కాంగ్రెస్‌ నేతలు సమావేశం కానున్నారు. కాగా కేంద్ర మాజీమంత్రి మల్లికార్జునఖర్గేకు ఇస్తారనే ప్రచారం సాగుతోంది. అయితే ఉప ఎన్నికల్లో ఎన్ని స్థానాల్లో గెలుస్తారో తెలియని పరిస్థితుల్లో కాంగ్రెస్‌ నేతలు ఉన్నారు. ప్రస్తుతం ఉన్న 66 మంది సభ్యుల మద్దతుతో పోటీ చేసినా ఓడిపోవడం ఖాయం. ఈ తరుణంలో పోటీ చేసి ఓడిపోవడమా?, పోటీ చేయకుండా ఉండడమా? అని మథనం జరుగుతోంది.  

మరిన్ని వార్తలు