హస్తమే ఆ గుడిలో దేవత!

26 Apr, 2019 01:23 IST|Sakshi

ఇందిర సందర్శనతో వచ్చిన గుర్తింపు

బారులు తీరుతున్న కాంగ్రెస్‌ నేతలు

కేరళలోని పలక్కాడ్‌లో ‘కల్లెకులంగర ఎమూర్‌ భగవతి’ ఆలయం ఉంది.‘ కైపతి అంబలం’ అని కూడా పిలిచే ఈ ఆలయం నిజానికి దుర్గాదేవి గుడి. అయితే, గర్భగుడిలో దుర్గాదేవి విగ్రహం ఉండదు. దాని స్థానంలో ఆశీర్వదిస్తున్నట్టుండే రెండు అరచేతులు ఉంటాయి. ఆ చేతుల్నే దుర్గాదేవిగా ప్రజలు ఆరాధిస్తుంటారు. కాంగ్రెస్‌ పార్టీ చిహ్నం కూడా హస్తమే కావడంతో దానికీ దీనికీ ముడిపెట్టేశారు. గుడి కట్టి వందల ఏళ్లు అయింది. అయితే, 1982 నుంచి ఈ ఆలయం గురించి ప్రపంచానికి తెలియడం, భక్తుల సంఖ్య పెరగడం మొదలయింది. దానికి కారణం...ఆ సంవత్సరంలో ఇందిరాగాంధీ స్వయంగా ఈ ఆలయాన్ని దర్శించడం.1982, డిసెంబర్‌ 13న ఇందిరా గాంధీ ఈ గుడికి వచ్చి హస్తం రూపంలో ఉన్న దేవతను పూజించి వెళ్లారని అచ్యుతన్‌ కుట్టి చెప్పారు. విచిత్రమేమిటంటే ఇందిరా గాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్‌ పార్టీ ఆ సంవత్సరమే హస్తం గుర్తును ఎన్నికల చిహ్నంగా ఎంపిక చేసుకుంది.

‘ఇక్కడి దుర్గాదేవి చాలా మహిమ గల దేవత. చుట్టుపక్కల వాళ్లందరికీ ఈ విషయం తెలుసు. అయితే, ఇందిరా గాంధీ వచ్చి వెళ్ళిన తర్వాత ఈ  ఆలయం గురించి దేశానికి తెలిసింది’అన్నారు అచ్యుతన్‌ కుట్టి. కేరళ మాజీ సీఎం కరుణాకరన్‌ ఇందిరాగాంధీని ఈ ఆలయానికి తీసుకొచ్చారని,  ఆమె తన పార్టీ గుర్తుగా హస్తాన్ని పెట్టుకున్నారని అప్పట్లో చెప్పుకునేవారని ఆయన అన్నారు. మామూలు రోజుల్లో ఎలా ఉన్నా ఎన్నికల సమయంలో రాజకీయ నాయకులు, ముఖ్యంగా కాంగ్రెస్‌ వాళ్లు ఈ ఆలయానికి పోటెత్తుతారని, వాళ్లు భారీగా కానుకలు కూడా సమర్పిస్తుంటారని ఆలయ మేనేజర్‌ మోహన్‌ సుందరన్‌ చెప్పారు. ఇలా అభయ హస్తాలే దేవతగా ఉన్న ఆలయం మన దేశంలో ఇంకెక్కడా లేదని కూడా ఆయన తెలిపారు. 

 

మరిన్ని వార్తలు