మేఘాలయ నెక్ట్స్‌ సీఎం ఈయనే!

4 Mar, 2018 20:23 IST|Sakshi

షిల్లాంగ్‌ : మేఘాలయ ముఖ్యమంత్రిగా నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ అధ్యక్షుడు కోన్రాడ్‌ సంగ్మా బాధ్యతలు చేపట్టనున్నారు. ఆయన ఈ నెల 6న ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణస్వీకారం చేస్తారని ఈశాన్య ప్రజాస్వామిక కూటమి (ఎన్‌ఈడీఏ) కన్వీనర్‌, బీజేపీ నేత హిమంత బిస్వా శర్మ తెలిపారు. కూటమిలో భాగంగా డిప్యూటీ సీఎం పదవి ఉండబోదని వెల్లడించారు. ఈ మేరకు కోన్రాడ్‌ సంగ్మా నేతృత్వంలో సంకీర్ణ కూటమి నేతలు గవర్నర్‌ కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా కోరారు. 60 మంది సభ్యులున్న మేఘాలయ అసెంబ్లీలో 34 మంది సభ్యులు కోనార్డ్‌ సంగ్మాకు మద్దతుగా నిలువడంతో ఆయన మెజారిటీ సాధించినట్టు అయింది. ఇంతకుముందు కాంగ్రెస్‌ పార్టీ నేతలు కూడా గవర్నర్‌ను కలిసి తమను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా కోరినప్పటికీ.. వారికి మెజారిటీ లేకపోవడంతో గవర్నర్‌ తిరస్కరించారు.

60 స్థానాలు ఉన్న మేఘాలయా అసెంబ్లీకి తాజాగా జరిగిన ఎన్నికల్లో హంగ్‌ ఫలితాలు వెలువడిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ 21 స్థానాలు గెలిచి.. అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ... మెజారిటీ సంఖ్యాబలానికి (31) 10 సభ్యుల దూరంలో నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో బీజేపీ చక్రం తిప్పి.. 19 స్థానాలు గెలుపొందిన ఎన్‌పీపీ నేతృత్వంలో ప్రాంతీయ సంకీర్ణ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే దిశగా అడుగులు వేసింది.

ప్రస్తుతం ఎన్పీపీ నేతృత్వంలో ఏర్పడిన సంకీర్ణ అధికార కూటమికి 34మంది సభ్యుల మద్దతు ఉంది. ఎన్పీపీ నుంచి 19మంది, బీజేపీ నుంచి ఇద్దరు, యూడీపీ నుంచి ఆరుగురు, హెచ్‌స్‌పీడీపీ నుంచి ఇద్దరు, పీడీఎఫ్‌ నుంచి నలుగురు, ఒక స్వతంత్ర సభ్యుడు ఈ కూటమిలో ఉన్నారు. అతిపెద్ద పార్టీగా నిలిచినప్పటికీ మేఘాలయలో అధికారాన్ని నిలబెట్టుకోకపోవడం కాంగ్రెస్‌ పార్టీని షాక్‌కు గురిచేస్తోంది. సరైన సంఖ్యాబలం లేకపోయినా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ తన పార్టీ పరిశీలకులను ప్రభుత్వ ఏర్పాటుకోసం మేఘాలయకు పంపించారని, ఇది ఆయనలో రాజకీయ పరిణతి లేకపోవడాన్ని చాటుతోందని హేమంత బిస్వా శర్మ విమర్శించారు.

మరిన్ని వార్తలు