అతివృష్టి.. అనావృష్టి!

22 Jan, 2019 05:31 IST|Sakshi

డీసీసీ అధ్యక్షుల భర్తీలో విచిత్ర పరిస్థితి

కొన్నిచోట్ల భారీగా పోటీ.. మరికొన్ని చోట్ల ఒక్కరూ లేని వైనం

12 జిల్లాల్లో కుదరని ఏకాభిప్రాయం

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని 33 జిల్లాలకు కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్ష పదవులను భర్తీ చేసే విషయంలో విచిత్ర పరిస్థితి నెలకొంది. కొన్ని జిల్లాల్లో ఈ పదవి కోసం విపరీతమైన పోటీ ఉండగా.. మరికొన్ని చోట్ల ఒక్కరు కూడా ముందుకు రాని పరిస్థితి నెలకొంది. దీంతో ఈ పదవుల భర్తీ వ్యవహారం తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ(టీపీసీసీ) నాయకత్వానికి తలనొప్పిగా మారింది. వాస్తవానికి ఈ నెల 10 లోపే డీసీసీ అధ్యక్షుల నియామకం పూర్తిచేయాలని ఏఐసీసీ ఆదేశించినా, ప్రక్రియ పూర్తి కాలేదు. ఈ నేపథ్యంలో డీసీసీ అధ్యక్షుల జాబి తాను ఎట్టి పరిస్థితుల్లో సోమవారం రాత్రి కల్లా తమకు పంపాలని మరోమారు ఏఐసీసీ నుంచి ఆదేశాలు వచ్చాయి. దీంతో టీపీసీసీ నేతలు సోమవారం సుదీర్ఘంగా కసరత్తు చేసినప్పటికీ 12 జిల్లాల్లో ఏకాభిప్రాయం కుదరలేదని తెలి సింది. మరోమారు కసరత్తు చేసి మంగళవారం ఏఐసీసీకి జాబితా పంపిస్తామని, రెండు, మూడు రోజుల్లో జిల్లాలకు పార్టీ అధ్యక్షుల నియామకంపై ఏఐసీసీ నుంచి ప్రకటన వస్తుందని టీపీసీసీ నేత ఒకరు వెల్లడించారు.

మాకొద్దు బాబోయ్‌...!
పార్టీ అధికారంలో లేకపోవడంతో పాటు జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షులుగా ఉంటే ఖర్చును భరిం చాల్సి వస్తుందనే కారణంతో చాలా చోట్ల డీసీ సీ అధ్యక్షులుగా ఉండేందుకు కాంగ్రెస్‌ నేతలెవ రూ ఆసక్తి చూపడంలేదు. పార్టీ గుర్తించి పదవి ఇస్తే అంగీకరించాలో వద్దో అనే మీమాంసలోనూ కొంతమంది ఉన్నారు. సిద్ధిపేట, సిరి సిల్ల, జగిత్యాల వంటి చోట్ల ఈ పదవి కోసం ఒక్కరు కూడా ముందుకు రావడంలేదని టీపీసీసీ వర్గాలు చెబుతున్నాయి. కొన్నిచోట్ల మాత్రం ఇందుకు పెద్ద ఎత్తున పోటీ కనిపిస్తోంది. ఖమ్మం జిల్లా డీసీసీ కోసం ఏకంగా ఏడుగురు నేతలు పోటీ పడుతుండగా, ఆ పదవి కావాలని అడగకపోయినప్పటికీ మరో నేత పేరును టీపీసీసీ నాయకత్వమే పరిశీలి స్తోంది. ఇక ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కూడా వివిధ సమీకరణల నేపథ్యంలో ఆరుగురు పేర్లు తెరమీదకు వచ్చాయి.

ఆసిఫాబాద్, నల్లగొండ, సంగారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్ష పదవులను ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు, చిరుమర్తి లిం గయ్య, జగ్గారెడ్డి, ఆయన భార్య నిర్మలకు కేటాయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిర్మల్‌లో మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి, జగిత్యాలలో ఇటీవల పోటీ చేసి ఓడిపోయిన అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, యాదాద్రి జిల్లాకు భిక్షమయ్యగౌడ్‌ను నియమించనున్నట్టు సమాచారం. కొత్తగూడెం జిల్లాకు సీనియర్‌ ఎమ్మెల్యే వన మా వెంకటేశ్వరరావు కుమారుడు రాఘవేంద్ర పేరు దాదాపు ఖరారైనట్టు తెలుస్తోంది. ఇక్కడ మరో ఇద్దరు నేతలు కూడా పోటీలో ఉన్నారు. అయితే అతివృష్టి, లేకుంటే అనావృష్టి అన్న తరహాలో ఈ వ్యవహారం ఉండటంతో డీసీసీ అధ్యక్ష పదవుల భర్తీ ఎలా చేయాలో తెలియక టీపీసీసీ నాయకత్వం మల్లగుల్లాలు పడుతోం దని గాంధీభవన్‌ వర్గాలు చెబుతున్నాయి.

మరిన్ని వార్తలు