ప్రతిపక్షాలు లేకుండా చేయాలనే కుట్ర: రమణ

1 Oct, 2018 02:39 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ప్రతిపక్షాలు లేకుండా చేయాలనే కుట్ర జరుగుతోందని టీడీపీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్‌.రమణ ఆరోపించారు. ఆది వారం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డితో కలిసి కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెం ట్‌ రేవంత్‌రెడ్డిని పరామర్శించేందుకు ఆయన ఇంటికి వెళ్లారు. అనంతరం రమణ మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర నిఘా సంస్థలపై నమ్మకం పోతోందని, ముగి సిన కేసులను తిరగదోడుతున్నారన్నారు. ప్రజల్లో ఆదరణ ఉన్న ప్రతిపక్ష నాయకులను కావాలనే దెబ్బతీసే యత్నం చేస్తున్నారన్నారు. హైకోర్టు, ఎన్నికల కమిషన్‌ ఎన్నిసార్లు మొట్టికాయలు వేసినా సీఎం కేసీఆర్‌లో మార్పు రావట్లేదని, ప్రజలే కేసీఆర్, మోదీని శిక్షిస్తారని పేర్కొన్నారు.

చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ, కంటి వెలుగుతో ప్రజలను గుడ్డివాళ్లను చేస్తున్నారని విమర్శించారు. వంద సీట్లు గెలుస్తామనే భ్రమలో కేసీఆర్‌ ఈ విధంగా వ్యవహరిస్తున్నారన్నారు. అంతకుముందు రాష్ట్రీయ లోక్‌దళ్‌ అధినేత అజిత్‌సింగ్‌ హైదరాబాద్‌ వచ్చిన సందర్భంగా రమణ, చాడ ఆయన్ను కలిశారు. ఈ సందర్భంగా వారు రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులను వివరించారు. కంటి వెలుగు ఆపరేషన్లు వికటించి ఎల్వీ ప్రసాద్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను రమణ, చాడ పరామర్శించారు. ఆయా కార్యక్రమాల్లో టీడీపీ నేతలు పెద్దిరెడ్డి, అరవింద్‌ కుమార్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు