టీడీపీ పరువు పాయే..! 

20 Jul, 2019 10:28 IST|Sakshi
టీడీపీ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న త్రి సభ్య కమిటీ సభ్యులు 

జిల్లా సమన్వయ కమిటీ సమావేశాన్ని మమ అనిపించారు

సమావేశానికి రాకుండా మొహం చాటేసిన నియోజకవర్గ ఇన్‌చార్జిలు

ముఖ్య నేతల్లో సైతం భరోసా నింపలేకపోయిన త్రీమెన్‌ కమిటీ

కమిటీ మొట్టమొదటి సమావేశానికి బుద్దా డుమ్మా

పట్టుమని పది మంది కూడా హాజరుకాని పరిస్థితి

తీవ్ర నైరాశ్యంలో టీడీపీ జిల్లా శ్రేణులు

సాక్షి, ఒంగోలు ప్రతినిధి: పాయే.. ఉన్న పరువు కాస్తా పాయే..! ఏదో చేద్దామనుకుంటే మరేదో జరిగింది. టీడీపీ త్రీమెన్‌ కమిటీ పేరుతో హడావిడి చేయాలని చూసి బొక్కబోర్లా పడ్డారు. పార్టీ జిల్లా శ్రేణుల్లో భరోసా మాట అటుంచితే.. ముఖ్య నేతల్లోనే నమ్మకం కలిగించలేక పోయారు. త్రీమెన్‌ కమిటీ మొట్టమొదటి సమావేశానికే కమిటీలోని ఒక సభ్యుడు డుమ్మాకొట్టాడు. ఇక జిల్లా సమన్వయ కమిటీ సమావేశాన్ని సైతం మమః అనిపించేశారు. సమావేశానికి ఇద్దరు నియోజకవర్గ ఇన్‌చార్జిలు మినహా మిగతా వారంతా మొహం చాటేశారు. పట్టుమని పది మంది ముఖ్యనేతలు కూడా రాకపోవడంతో సమావేశాన్ని పది నిముషాల్లోనే ముగించేశారు.

ఇలా వచ్చి అలా వెళ్లారు.. అన్న చందంగా త్రిసభ్య కమిటీ పర్యటన సాగింది. నిన్నమొన్నటి వరకూ పార్టీ జిల్లా నేతలపై ఉన్న చిన్నపాటి నమ్మకం సైతం నేటితో పోయిందని టీడీపీ శ్రేణులు తీవ్ర నైరాశ్యంలోకి వెళ్లాయి. శుక్రవారం జిల్లాకు వచ్చిన త్రిసభ్య కమిటీ విలేకర్ల సమావేశం పెట్టి వైఎస్సార్‌ సీపీ నేతలను తిట్టడం మినహా కార్యకర్తలకు పార్టీ తరఫున ఎటువంటి భరోసా ఇవ్వకపోవడంపై టీడీపీ కార్యకర్తలు మండిపడుతున్నారు. పార్టీని బలోపేతం చేయడం మాట అటుంచితే త్రిసభ్య కమిటీ రాకతో జిల్లాలో పార్టీ మరింత దిగజారిందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే...    జిల్లాలో టీడీపీ శ్రేణులకు భరోసా కల్పిస్తామంటూ వచ్చిన

త్రీమెన్‌ కమిటీ నిర్వాకంతో పార్టీ పరువు బజారునపడిందని ఆ పార్టీ శ్రేణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలకు జిల్లాలోని పార్టీ నేతలు, కార్యకర్తలను సమాయత్తం చేసేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇద్దరు మాజీమంత్రులు, ఓ ఎమ్మెల్సీతో త్రిసభ్య కమిటీని నియమించిన విషయం తెలిసిందే. ఆ కమిటీ శుక్రవారం ఒంగోలులో పర్యటించింది. త్రిసభ్య కమిటీ మొట్టమొదటి సమావేశానికి కమిటీ సభ్యుడు, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న డుమ్మా కొట్టారు.

మిగతా ఇద్దరు సభ్యులైన దేవినేని ఉమామహేశ్వరరావు, కొత్తపల్లి జవహర్‌లు ఇలా వచ్చి అలా వెళ్లారే తప్ప పార్టీ కార్యకర్తలతో మాట్లాడటంగానీ, వారి సమస్యలను తెలుసుకోవడంగానీ చేయకపోవడంపై పార్టీ శ్రేణులు మండిపడుతున్నాయి. తొలుత ఒంగోలు రిమ్స్‌లో చికిత్స పొందుతున్న పార్టీ కార్యకర్తను పరామర్శించిన నేతలు అనంతరం టీడీపీ జిల్లా కార్యాలయంలో జిల్లా సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. 

మొహం చాటేసిన టీడీపీ ముఖ్య నేతలు...
జిల్లా టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం అంటే జిల్లాలోని ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జిలు, టీడీపీ రాష్ట్ర, జిల్లా కమిటీ సభ్యులు హాజరుకావాల్సి ఉంది. అయితే, శుక్రవారం పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన సమన్వయ కమిటీ సమావేశానికి పట్టుమని పదిమంది ముఖ్య నాయకులు కూడా హాజరుకాకపోవడం గమనార్హం. టీడీపీ జిల్లా అధ్యక్షుడు, ఒంగోలు నియోజకవర్గ ఇన్‌చార్జి దామచర్ల జనార్దన్, కనిగిరి ఇన్‌చార్జి డాక్టర్‌ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి, ఒంగోలు పార్లమెంట్‌ ఇన్‌చార్జి శిద్దా రాఘవరావు మినహా ఎవరూ హాజరుకాలేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. 


సమావేశానికి నలుగురు ఎమ్మెల్యేలు, ఆరుగురు నియోజకవర్గ ఇన్‌చార్జిలు డుమ్మా కొట్టడం చూస్తుంటే.. జిల్లాలో టీడీపీ పరిస్థితి ఎంత దయనీయంగా మారిందో అర్థమవుతోంది. జిల్లా సమన్వయ కమిటీ సమావేశానికి నేతల నుంచి స్పందన కరువవడంతో త్రిసభ్య కమిటీ సభ్యులు పది నిముషాల్లో ముగించి మమః అనిపించేశారు.

మరిన్ని వార్తలు