అసెంబ్లీ సమావేశాలు.. ఎమ్మెల్యేలకు కరోనా పరీక్షలు

16 Mar, 2020 08:22 IST|Sakshi

భోపాల్‌ : ప్రపంచ వ్యాప్తంగా ప్రమాదకర కరోనా వైరస్‌ తీవ్ర భయాందోళనలు సృష్టిస్తోంది. వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రపంచ దేశాలన్నీ తగిన చర్యలను చేపడుతున్నాయి. భారత్‌లోనూ కరోనా ప్రభావం రోజురోజుకూ పోరుగుతోంది. దేశ వ్యాప్తంగా ఇప్పటికే 107 కేసులు నమోదైనట్లు వైద్యఆరోగ్యశాఖ అధికారులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో వైరస్‌ వ్యాప్తి కట్టడికి భారత ప్రభుత్వం కీలక చర్యలను చేపడుతోంది. వైరస్‌ లక్షణాలు కనిపించిన ప్రతి ఒక్కరికి పరీక్షలు నిర్వహించి.. వైద్యుల పర్యవేక్షలో ఉంచుతోంది. ఈ నేపథ్యంలోనే మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు నిర్వహిస్తుడటంతో.. కరోనా భయం అసెంబ్లీనీ తాకింది. దీంతో ఎమ్మెల్యేలకు కరోనా పరీక్షలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. (నేడు ‘బల నిరూపణ’ ఉంటుందా?)

రాష్ట్రంలో నెలకొన్న ప్రత్యేక రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు జైపూర్‌లో, బీజేపీ ఎమ్మెల్యేలు హర్యానాలో, తిరుగుబాటు సభ్యులు బెంగళూరు గత పదిరోజుల పాటు క్యాంపు పెట్టిన విషయం తెలిసిందే. దీంతో వివిధ ప్రాంతాలకు ప్రయాణం చేసిన ఎమ్మెల్యేలకు ముందస్తు జాగ్రత్తగా కరోనా పరీక్షలు చేయాలని నిర్ణయించినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి తరుణ్‌ భానోత్‌ ఆదివారం రాత్రి తెలిపారు. సమావేశాలకు ముందు ప్రత్యేక వైద్యం బృందం శాసనసభ్యులందరికీ కోవిడ్‌ పరీక్షలు నిర్వహించింది. మరోవైపు సోమవారం అసెంబ్లీలో బలపరీక్ష ఉంటుందా లేదా అనేది ఉత్కంఠగా మారింది. దీనిపై అసెంబ్లీ స్పీకర్‌ ప్రజాపతి తుది నిర్ణయం తీసుకోనున్నారు. (ఉత్కంఠగా బలపరీక్ష.. క్యాంపులకు ఎమ్మెల్యేలు)

మరిన్ని వార్తలు