మా జీవితాలను తగ్గించొద్దు..

3 Apr, 2020 19:38 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రధాని నరేంద్ర మోదీ కొత్త డ్రామాలు కట్టిపెట్టి కరోనా కట్టడికి పటిష్ట చర్యలు చేపట్టాలని ఎంఐఎం అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ సూచించారు. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా విపత్కర పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో జనతా కర్ఫ్యూ స్ఫూర్తిని మరోసారి ప్రదర్శించాలని దేశ ప్రజలకు ప్రధాని మోదీ విజ్ఞప్తి చేయడంపై ఒవైసీ ఘాటుగా స్పందించారు. ‘ఈ దేశం ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీ కాదు. భారత ప్రజలకు కలలు, ఆశలూ ఉన్నాయి. మా జీవితాలను 9 నిమిషాల జిమ్మిక్కులకు తగ్గించొద్దు. రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఏమేరకు సహాయం చేసింది, పేదల ప్రజలకు ఎంత ఉపశమనం కలిగించారో తెలుసుకోవాలనుకుంటున్నాం. దీనికి బదులుగా మా ముందుకు కొత్త నాటకం వచ్చింది’ అంటూ అసదుద్దీన్‌ ట్వీట్‌ చేశారు. (ఆ వార్డులకు మహిళా సిబ్బంది దూరం..)

ఈ నెల 5న రాత్రి 9 గంటలకు విద్యుద్దీపాలను ఆర్పేసి కొవ్వొత్తులు లేదా దీపపు ప్రమిదలతో టార్చీలు లేదా మొబైల్‌ ఫ్లాష్‌ లైట్లను చేతబట్టి 9 నిమిషాలపాటు నిలబడాలని ప్రజలకు మోదీ పిలుపునివ్వడంపైనా ఒవైసీ స్పందించారు. ‘బ్యాంకింగ్ రంగాన్ని కమ్ముకుంటున్న చీకటి మాటేమిటి? పెరుగుతున్న ఎన్‌పిఎ సమస్య ఎందుకు పరిష్కారం కాలేదు? కరోనా రాకముందు నుంచి ఉన్న ఆర్థిక సంక్షోభం ఇప్పుడు పెను ఆర్థిక విపత్తుగా మారబోతోంది. మేము పొదుపు చేసిన డబ్బులు ఏమవుతాయి? బ్యాంకుల పరిస్థితి ఏంటి?’ అంటూ ఒవైసీ ట్విటర్‌లో ప్రశ్నలు సంధించారు. లాక్‌డౌన్‌తో తిండిలేక తిప్పలు పడుతున్న అసంఘటిత కార్మికులకు ప్రభుత్వం సాయం అందించి వారి జీవితాల్లో కాస్త వెలుగు నింపాలని మరో ట్వీట్‌లో పేర్కొన్నారు. (కరోనా: రెండు రాష్ట్రాల మధ్య చిచ్చు)

సమర్థవంతమైన చర్యలు ఆశించాం: జలీల్‌
లాక్‌డౌన్ నేపథ్యంలో ప్రధాని మోదీ నుంచి మరింత సమర్థవంతమైన చర్యలు ఆశించామని మహారాష్ట్ర ఎంఐఎం అధ్యక్షుడు, ఔరంగాబాద్‌ ఎంపీ ఇంతియాజ్‌ జలీల్‌ పేర్కొన్నారు. ‘ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రధాని పటిష్ట చర్యలు చేపడతారని అనుకున్నాం. మెడికల్‌, పోలీసు సిబ్బందికి చప్పట్లు కొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రధాని విజ్ఞప్తికి స్పందించి గుజరాత్‌లో గార్బా ఆడారు. పుణేలో నృత్యాలు చేశార’ని ఆయన వ్యాఖ్యానించారు. ఇంతియాజ్‌ మాటలపై బీజేపీ ఎంపీ భగవత్‌ కరాద్‌ స్పందిస్తూ.. రాజకీయాలు చేయడానికి ఇది సమయం కాదని అన్నారు. ప్రధాని విజ్ఞప్తికి స్పందించి కరోనాపై పోరుకు బాసటగా నిలవాలని కోరారు. (కరోనాపై పోరు: ప్రధాని మోదీ వీడియో సందేశం)

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు