కాంగ్రెస్‌కు కౌంట్‌డౌన్‌!

5 Feb, 2018 03:13 IST|Sakshi
తనకు బహూకరించిన జ్ఞాపికతో ప్రధాని మోదీ

కర్ణాటకలో ఆ పార్టీ ప్రభుత్వం ఇప్పుడు ఎగ్జిట్‌ గేట్‌ వద్ద ఉంది

ప్రభుత్వం హత్యా రాజకీయాలు చేస్తోంది

అవినీతిలో సిద్ధరామయ్య సర్కారు కొత్త రికార్డులు

టమోటా, ఆనియన్, పొటాటో(టాప్‌)లకు ప్రాధాన్యత

బీజేపీ ర్యాలీలో ప్రధాని మోదీ

సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో కాంగ్రెస్‌ ప్రభుత్వ పాలనకు కౌంట్‌డౌన్‌ దగ్గర పడిందని, సిద్ధరామయ్య ప్రభుత్వాన్ని సాగనంపేందుకు ప్రజలు సిద్ధమయ్యారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అవినీతిలో రాష్ట్ర ప్రభుత్వం కొత్త రికార్డులు సృష్టించిందని, కాంగ్రెస్‌ పాలనకు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు.

మరో మూడు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆదివారం బెంగళూరు ప్యాలెస్‌ మైదానంలో రాష్ట్ర బీజేపీ నిర్వహించిన పరివర్తన యాత్ర ముగింపు సభలో ప్రధాని మాట్లాడారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని.. సులభతర వ్యాపార నిర్వహణ గురించి కాకుండా సులభంగా హత్యలు ఎలా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తోందని ఆరోపించారు. కర్ణాటక అసెంబ్లీలో మొత్తం 224 స్థానాలు ఉండగా.. 150 సీట్లు సాధించాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది.  

రాష్ట్రంలో స్టీల్, ఇసుక మాఫియా రాజ్యం
అవినీతి, కుల రాజకీయాలతో రాష్ట్రాన్ని కాంగ్రెస్‌ భ్రష్టు పట్టించిందని మోదీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘కాంగ్రెస్‌ ముక్త రాష్ట్రంగా చేయాలని కర్ణాటక ప్రజలు నిర్ణయించుకున్నారు. కార్యకర్తల ఉత్సాహం చూస్తుంటే ఆ పార్టీకి కాలం చెల్లినట్లు ఉంది. ప్రతి పనికి 10 శాతం కమీషన్‌ను తీసుకోవడం సిద్ధరామయ్య ప్రభుత్వానికి అలవాటుగా మారింది. రాష్ట్రంలో ఏ ప్రాజెక్టు చేపట్టినా కమిషన్‌ ఇచ్చి తీరాల్సిందే. కాంగ్రెస్‌ ముక్త ప్రభుత్వం అంటే వారసత్వ పాలన, బంధుప్రీతి, అవినీతి, దోపిడీ నుంచి విముక్తి అని అర్థం.

రాష్ట్రంలో ఇద్దరు మంత్రులు, ఒక సీనియరు కాంగ్రెస్‌ నేత ఇళ్లలో ఐటీ దాడులు జరిగాయి. రాష్ట్రంలో స్టీల్‌ మాఫియా, ఇసుక మాఫియా, బదిలీ మాఫియా రాజ్యమేలుతోంది. స్టీల్‌ బ్రిడ్జ్‌ పేరిట కొందరు కోట్లాది రూపాయలు కొల్లగొట్టేందుకు కుట్ర చేశారు. ప్రజల నిరసన, బీజేపీ ఆందోళనలతో ప్రాజెక్టును విరమించుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కాషాయ పవనాలు వీస్తున్నాయి. స్టార్టప్‌ల కోసం ఇప్పటికే రూ. 10 వేల కోట్ల నిధిని ఏర్పాటు చేశాం. దీనివల్ల మధ్యతరగతి యువతకు ఎంతో మేలు జరుగుతుంది’ అని ప్రధాని పేర్కొన్నారు.  

రాష్ట్రంలో దారుణంగా శాంతి భద్రతల పరిస్థితి
రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితిని ప్రస్తావిస్తూ.. ‘ఒకవైపు కేంద్రంలోని బీజేపీ దేశ పురోగతి కోసం ప్రయత్నిస్తుంటే.. మరోవైపు కర్ణాటక ప్రభుత్వం వ్యతిరేక దిశలో పోతోంది. బెంగళూరు మొత్తం నేరగాళ్ల నియంత్రణలో ఉంది. హింసాత్మక శక్తులు చెలరేగిపోతున్నాయి. వీటితో సామాన్య ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు’ అని విమర్శించారు. కాంగ్రెస్‌ హయాంలో అనేక మంది బీజేపీ, దాని అనుబంధ సంస్థల కార్యకర్తల్ని హత్య చేశారని మోదీ ఆరోపించారు. ‘సమాజాన్ని, సంస్కృతిని, రాజకీయాల్ని కాంగ్రెస్‌ నాశనం చేసింది. కాంగ్రెస్‌ నుంచి రాష్ట్రాన్ని విముక్తి చేయాలని ప్రజలు నిర్ణయించుకోవడం నేను చూస్తున్నాను. కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వ పాలన ఎంతో దూరంలో లేదు’ అని మోదీ అన్నారు.  

‘టాప్‌’ ప్రయారిటీ
దేశంలో కూరగాయలు, పళ్లను పండించే వారికి ‘టాప్‌’ ప్రయారిటీ(ప్రాధాన్యం) ఇస్తామని మోదీ పేర్కొన్నారు. ‘టాప్‌(టీవోపీ) అంటే టమోటా, ఆనియన్‌(ఉల్లి), పొటాటో(బంగాళదుంప) అని అర్థం. అందుకే ‘టాప్‌’ అని పిలుస్తున్నాను’ అని మోదీ చెప్పారు.   

ప్రతి వ్యక్తి విమానంలో తిరగాలన్నదే నా కల
ట్రిపుల్‌ తలాక్‌ బిల్లును అడ్డుకోవాలని కాంగ్రెస్‌ యత్నిస్తోందని, ఓబీసీ కమిషన్‌కు రాజ్యాంగ హోదా కల్పించేందుకు కూడా ఆ పార్టీ వ్యతిరేకంగా ఉందని మోదీ ఆరోపించారు. ‘ఈ ఏడాది దేశవ్యాప్తంగా 9 వేల కి.మీ. మేర జాతీయ రహదారుల్ని నిర్మించాలని, భారత్‌మాలాలో 35 వేల కి.మీ. రోడ్లను అభివృద్ధి చేయాలని  లక్ష్యంగా పెట్టుకున్నాం. హవాయి చెప్పులు వేసుకునే వారు కూడా విమానంలో తిరగాలనేదే నా కల. కర్ణాటకకు చెందిన రాహుల్‌ ద్రవిడ్‌ శిక్షణలోని అండర్‌ 19 క్రికెట్‌ భారత జట్టు ప్రపంచకప్‌ గెలుచుకుంది. ఈ విజయంలో ద్రవిడ్‌ పాత్ర ఎంతో ఉంది’ అన్నారు. బెంగళూరులో ట్రాఫిక్‌ రద్దీని తగ్గించేందుకు బడ్జెట్‌లో బెంగళూరు సబర్బన్‌ రైల్వే ప్రాజెక్టు కోసం రూ.17 వేల కోట్లు కేటాయించామన్నారు.

మరిన్ని వార్తలు