ఆ ఆస్తులు పంచాలని చట్టంలో లేదు

29 Jul, 2018 02:49 IST|Sakshi

పదో షెడ్యూలులోని సంస్థల ఆస్తులపై కేంద్ర హోం శాఖ స్పష్టం  

 సెక్షన్‌ 75 ఆ సంస్థల సేవల కొనసాగింపును సూచిస్తోంది.. 

 పొంగులేటి రిట్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో కౌంటర్‌ అఫిడవిట్‌  

 తెలంగాణలో రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు సాధ్యం కాదని వెల్లడి

సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని పదో షెడ్యూలులో పొందుపరిచిన సంస్థల ఆస్తులు పంచాలని ఆ చట్టంలో ఎక్కడా లేదని, కేవలం ఆయా సంస్థల సేవలను కొద్దిరోజులపాటు రెండు రాష్ట్రాలకు పొడిగించడం కోసమే సెక్షన్‌ 75ను పొందుపరిచారని కేంద్ర హోం శాఖ తెలిపింది. పదో షెడ్యూలులోని సంస్థల యాజమాన్య హక్కులు పంచేందుకు ఎలాంటి నిబంధనను చట్టంలో పొందుపరచలేదని స్పష్టం చేసింది. విభజన చట్టంలోని అంశాలను అమలు చేయాలని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలంటూ కాంగ్రెస్‌ నేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి దాఖలు చేసిన రిట్‌ పిటిషన్‌పై కేంద్ర హోం శాఖ శుక్రవారం సుప్రీంకోర్టులో కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేసింది. చట్టంలో పొందుపరిచిన నిబంధనల అమలుకు కేంద్ర హోం శాఖ ఇరు రాష్ట్రాలతో పలుమార్లు సమావేశమైందని, ఇటీవల మూడుసార్లు సమావేశమైందని వివరిస్తూ ఆయా సమావేశాల్లో చర్చించిన అంశాల పురోగతిని అఫిడవిట్‌కు జోడించింది. పునర్వ్యవస్థీకరణ చట్టంలోని నిబంధనల అమలుపై పలు మంత్రిత్వ శాఖలు సుప్రీంకోర్టులో అఫిడవిట్లు దాఖలు చేశాయని, కేసులో ఇంప్లీడ్‌ కాని మంత్రిత్వ శాఖల నుంచి సేకరించిన సమాచారాన్ని తామే అఫిడవిట్‌లో పొందుపరుస్తున్నట్టు హోం శాఖ తెలిపింది. 

అఫిడవిట్‌లోని ముఖ్యాంశాలు ఇవీ.. 
షెడ్యూలు పదిలోని సంస్థల ఆస్తులు పంచాలన్న నిబంధన ఎక్కడా ఈ చట్టంలో లేదు. ఆయా సంస్థల ద్వారా సేవలను పక్క రాష్ట్రానికి కొనసాగించడానికి మాత్రమే సెక్షన్‌ 75ను నిర్దేశించారు. సంబంధిత సెక్షన్‌ అమలుకు నిబంధనల ఖరారు కోరుతూ రెండు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులను కోరాం. ఇంకా ఖరారు చేయలేదని ఏపీ సమాధానం ఇచ్చింది. తెలంగాణ సమాచారం ఇవ్వలేదు. 

షెడ్యూలు 9లోని సంస్థల ఆస్తులు, హక్కులు, అప్పులు పంచేందుకు 2014 మే 30న షీలా భిడే కమిటీని ఏర్పాటు చేశారు. 2018 మే 11న ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఇచ్చిన సమాచారం మేరకు ఆయా సంస్థల ఉద్యోగుల విభజన, ఆస్తులు, అప్పుల విభజన ముగింపు దశలో ఉంది. షీలా భిడే కమిటీ గడువును 2018 ఆగస్టు 31 వరకు పొడిగించారు. 

అఖిల భారత సర్వీసు ఉద్యోగులను రెండు రాష్ట్రాలకు కేటాయించారు. ఇందులో కొందరు ఐఏఎస్‌ అధికారులు ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. 

రాష్ట్ర కేడర్‌ ఉద్యోగుల విభజనకు కమలనాథన్‌ కమిటీ సిఫారసుల మేరకు 2015 నవంబర్‌ నుంచి 2017 డిసెంబర్‌ మధ్య విడతల వారీగా 56,400 మంది ఉద్యోగులను విభజించారు. మరో 753 మంది ఉద్యోగుల విభజన పెండింగ్‌లో ఉంది. 

షెడ్యూలు 13లోని అంశాలపై.. 

  • షెడ్యూలు 13లోని అంశాలపై 22–01–2018, 12–03–18, 29–05–2018 తేదీల్లో హోం శాఖ ఆయా రాష్ట్రాల అధికారులతో సమీక్షించిందని చెబుతూ ఆయా సమావేశాల్లో వచ్చిన పురోగతిని అఫిడవిట్‌లో వివరించింది.  
  • హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఏపీ రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపిన అనంతరం స్థల నిర్ణయం, మౌలిక వసతుల ఏర్పాటు తర్వాతే హైకోర్టు ఏర్పాటుకు తమ నుంచి ప్రక్రియ మొదలవుతుంది. 
  • కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ పరిధిలో ని విద్యాసంస్థల ఏర్పాటులో పురోగతి వివిధ దశల్లో ఉంది. కేంద్రీయ విశ్వవిద్యాలయం, గిరి జన విశ్వవిద్యాలయం మినహా మిగిలినవన్నీ తాత్కాలిక భవనాల్లో ప్రారంభమయ్యాయి. కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని ఈ విద్యా సంవత్సరంలోనే ప్రారంభిస్తాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో గిరిజన విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు కేబినెట్‌ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.  
  • స్టీలు ప్లాంట్ల విషయంలో పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని అనుసరించి కేవలం ఫీజిబులిటీ నివేదికను మాత్రమే సమర్పించాల్సి ఉంది. గడువు లోపే నివేదిక వచ్చింది. అయితే వాణిజ్యపరమైన యోగ్యత లేదని నివేదిక తేల్చింది. అయినప్పటికీ టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేసి కొత్తగా మరో ఫీజిబులిటీ నివేదిక ఇవ్వాలని మెకాన్‌ను కోరాం. అవసరమైన సమాచారం ఏపీ నుంచి వచ్చింది. తెలంగాణ నుంచి రావాల్సి ఉంది. రెండు రాష్ట్రాల నుంచి సమాచారం వచ్చాక మెకాన్‌ నివేదిక సమర్పిస్తుంది. 
  • విజయవాడ మెట్రో రైలుకు ప్రతిపాదన వచ్చింది. అయితే కేంద్రం కొత్త మెట్రో రైలు విధానం తెచ్చినందున ఏపీ ప్రతిపాదనలే కాకుండా ఇతర రాష్ట్రాల ప్రతిపాదనలు కూడా తిరస్కరించాం. నూతన విధానం ప్రకారం ప్రతిపాదనలు పంపాల్సి ఉంది. 
  • ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పెట్రోలియం అండ్‌ ఎనర్జీ (ఐఐపీఈ)కి ఆంధ్రప్రదేశ్‌ 200 ఎకరాలు ఇచ్చినప్పటికీ అది వివాదంలో చిక్కుకుంది. వివాదాలు పరిష్కరించి స్థలాన్ని అప్పగించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సూచించాం. 
  • సమీపంలో ఉన్న పోర్టుల ద్వారా ఎదురవుతున్న పోటీతత్వం కారణంగా దుగరాజపట్నం పోర్టుకు వాణిజ్య యోగ్యత లేదని నీతి ఆయోగ్‌ నివేదిక ఇచ్చింది. ప్రత్యామ్నాయ ప్రాంతాలు సూచించాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాన్ని కోరగా జవాబు రాలేదు. అయినప్పటికీ నౌకాయాన శాఖ ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేసి ఏపీలో ఒక మేజర్‌ పోర్టు స్థాపనకు గల అవకాశాలపై అధ్యయనం చేస్తోంది.  
  • కాకినాడలో పెట్రో కెమికల్‌ కాంప్లెక్స్‌ ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం, గెయిల్, హెచ్‌పీసీఎల్‌ మధ్య ఒప్పందం కుదిరింది. ఇంజినీర్‌ ఇండియా లిమిటెడ్‌ ఈ విషయమై ఫీజిబులిటీ నివేదిక ఇచ్చింది. అయితే ఈ ప్రాజెక్టు స్థాపనకు వయబులిటీ గ్యాప్‌ ఫండ్‌ అవసరమని, దానిని సమకూర్చాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి సమాచారం ఇచ్చాం. 
  • ఏపీ నూతన రాజధాని నుంచి హైదరాబాద్‌కు, ఇతర తెలంగాణ నగరాలకు ర్యాపిడ్‌ రైల్‌ అండ్‌ రోడ్‌ కనెక్టివిటీ స్థాపనకు సిద్ధంగా ఉన్నాం. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను పరిగణనలోకి తీసుకుంటాం. 
  • విశాఖ– చెన్నై పారిశ్రామిక కారిడార్‌ విషయంలో పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని అనుసరించి ఏషియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ ఫీజిబులిటీ అధ్యయనం చేసి తన తుది నివేదికను సమర్పించింది.  
  • ఏపీలో కొత్త రైల్వే జోన్‌ స్థాపనకు విభజన చట్టం అమలులోకి వచ్చిన రోజు నుంచి ఆరు నెలల్లోగా ఫీజిబులిటీ నివేదిక ఇవ్వాలని మాత్రమే ఉంది. రైల్వే జోన్‌ స్థాపనకు యోగ్యత లేదని ఇదివరకే కమిటీ నివేదిక ఇచ్చింది. అయితే ఈ అంశంపై మరింత లోతుగా అధ్యయనం చేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ఇదివరకే 16 రైల్వే జోన్లు ఉన్నందున కొత్త రైల్వే జోన్‌ నిర్వహణకు వాణిజ్య యోగ్యత ఉండదని మార్చి 12, 2018 నాడు జరిగిన సమావేశంలో రైల్వే శాఖ అభిప్రాయపడింది. అయినప్పటికీ తుది నిర్ణయం ఇంకా తీసుకోలేదు. 
  • తెలంగాణలో రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు సాధ్యం కాదు. దేశంలో ఇప్పటికే 5 కోచ్‌ ఫ్యాక్టరీలు ఉన్నాయి. వాటి సామర్థ్యం కూడా పూర్తిగా వినియోగంలో లేదు. కొత్త ఫ్యాక్టరీకి వాణిజ్య యోగ్యత ఉండదని రైల్వే శాఖ అభిప్రాయపడింది.  
మరిన్ని వార్తలు