జార్ఖండ్‌ ఫలితాలు నేడే

23 Dec, 2019 02:53 IST|Sakshi
రఘుబర్‌దాస్‌, హేమంత్‌ సోరెన్‌

రాంచి: జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు సర్వం సిద్ధమైంది. మొత్తం 81 శాసనసభ స్థానాలకు నవంబర్‌ 30 నుంచి డిసెంబర్‌ 20 వరకు అయిదు దశల్లో పోలింగ్‌ జరిగింది. రాష్ట్రంలోని 24 జిల్లా కేంద్రాల్లో ఎన్నికల సంఘం కౌంటింగ్‌కు ఏర్పాట్లు చేసింది. సోమవారం మధ్యాహ్నం ఒంటి గంటకు తొలి ఫలితం వెలువడే అవకాశాలున్నాయి. అధికార బీజేపీ, ప్రతిపక్ష జేఎంఎం–కాంగ్రెస్‌ కూటమి మధ్య ప్రధాన పోటీ ఉంది. రెండు పార్టీలు ఓటర్లను ఆకర్షించడానికి హోరాహోరీగా తలపడ్డాయి.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్‌ షా ఒక్కొక్కరు తొమ్మిదేసి ర్యాలీల్లో పాల్గొంటే, కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ అయిదు, ప్రియాంక గాంధీ ఒక్క ర్యాలీలో పాల్గొన్నారు. జేఎంఎం నేత ప్రతిపక్ష కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి హేమంత్‌ సోరెన్‌ కీలకంగా మారారు. ముఖ్యమంత్రి రఘుబర్‌ దాస్‌ పోటీ చేసిన జంషెడ్‌పూర్‌ తూర్పు నియోజకవర్గంపైనే అందరి దృష్టీ ఉంది. 1995 నుంచి ఆయన ఈ స్థానం నుంచి గెలుపొందుతూ వస్తున్నారు. అయితే రఘుబర్‌ దాస్‌ సహచరుడు, మాజీ మంత్రి సరయూ రాయ్‌ బీజేపీ రెబెల్‌ అభ్యర్థిగా ఈ స్థానంలో నిలబడడంతో పోటీ రసవత్తరంగా మారింది. మెజార్టీ సంస్థల ఎగ్జిట్‌ పోల్స్‌ హంగ్‌ అసెంబ్లీ వస్తుందని అంచనా వేస్తుంటే, బీజేపీ తామే తిరిగి అధికారాన్ని దక్కించుకోవడం ఖాయమని ధీమాతో ఉంది. ఎవరి అంచనాలు నిజం కానున్నాయో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది.   
 

మరిన్ని వార్తలు