నేడు హుజూర్‌నగర్‌ ఓట్ల లెక్కింపు

24 Oct, 2019 02:51 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ఉదయం 8 గంటలకు కౌంటింగ్‌ ప్రారంభం 

మధ్యాహ్నం 12 గంటల కల్లా తుది ఫలితం!  

సాక్షిప్రతినిధి, సూర్యాపేట: హుజూర్‌నగర్‌ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపునకు అంతా సిద్ధమైంది. సూర్యాపేటలోని కొత్త వ్యవసాయ మార్కెట్‌లో గురువారం ఉదయం 8 నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభంకానుంది. ఈ ఎన్నికలో మొత్తం 28 మంది పోటీ పడ్డారు. నియోజకవర్గ వ్యాప్తంగా 7 మండలాల్లో 302 పోలింగ్‌ కేంద్రాల్లో 2,00,754 ఓట్లు పోలయ్యాయి. మొత్తం 14 టేబుళ్లపై 22 రౌండ్లలో ఈ ఓట్ల లెక్కిపు పూర్తిచేస్తారు. ఒక్కో రౌండ్‌లో సుమారు 9 వేలపై చిలుకు ఓట్లను లెక్కిస్తారు. బుధవారం కౌంటింగ్‌కు సంబంధించిన ఏర్పాట్లను ఎన్నికల పరిశీలకుడు సచీంద్రప్రతాప్‌ సింగ్, కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి దుగ్యాల అమయ్‌కుమార్‌ పరిశీలించారు. 

నేరేడుచర్ల మండలం నుంచి ప్రారంభం.. 
నేరేడుచర్ల మండలం నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమై వరుసగా పాలకీడు, మఠంపల్లి, మేళ్లచెరువు, చింతలపాలెం, హుజూర్‌నగర్‌ మండలం, పట్టణం, గరిడేపల్లి మండలంలోని లెక్కింపుతో పూర్తవుతుంది. లెక్కింపు అంతా పూర్తయ్యాక వీవీప్యాట్‌ స్లిప్పులు లెక్కిస్తారు. 302 పోలింగ్‌ కేంద్రాలకు సంబంధించి వరుసగా 1వ నంబర్‌ నుంచి 302 వరకు అంకెలను ఒక్కో స్లిప్పుపై వేస్తారు. వీటిలో 5 స్లిప్పులు డ్రా తీస్తారు. ఈ డ్రాలో వచ్చిన పోలింగ్‌ కేంద్రం స్లిప్పు ఆధారంగా ఆ పోలింగ్‌ బూత్‌లోని వీవీప్యాట్‌ స్లిప్పులు ఏ పార్టీకి ఎన్ని పడ్డాయో లెక్కిస్తారు.

ఈ స్లిప్పులను.. ఇదే పోలింగ్‌ బూత్‌లోని ఈవీఎంలలో ఆయా పార్టీకి పడిన ఓట్లు సమానంగా ఉన్నాయో లేదో సరి చూస్తారు. ఇది పూర్తయ్యాక అభ్యర్థులు ఎవరూ అభ్యంతరం చెప్పకపోతే రిటర్నింగ్‌ అధికారి గెలిచిన అభ్యర్థిని అధికారికంగా ప్రకటిస్తారు. మధ్యా హ్నం 12 గంటల వరకు తుది ఫలితం వెలువడుతుందని అధికారులు వెల్లడించాయి. ఇక ఈ ఉపఎన్నికలో టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ అభ్యర్థుల్లో ఎవరు విజయం సాధిస్తారన్న దానిపై జోరుగా బెట్టింగులు సాగుతున్నాయి. ఎక్కువగా మెజార్టీపైనే బెట్టింగ్‌లు పెట్టినట్లు సమాచారం.  

మరిన్ని వార్తలు