రాహుల్‌ గాంధీకి చుక్కెదురు

4 May, 2018 08:30 IST|Sakshi
కాంగ్రెస్‌ పార్టీ జాతీయాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ

సాక్షి, ముంబై: కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీకి చుక్కెదురైంది. రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌(ఆరెస్సెస్‌) వేసిన పరువు నష్టం దావా కేసులో తమ ఎదుట హాజరుకావాలని భివండి(మహారాష్ట్ర) కోర్టు కోరింది. 2014 ఎన్నికల ప్రచారంలో భివండిలో నిర్వహించిన బహిరంగ సభలో రాహుల్‌ ప్రసంగిస్తూ... మహాత్మా గాంధీ మృతి వెనుక ఆరెస్సెస్‌ హస్తం ఉందంటూ ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై ఆరెస్సెస్‌ కార్యకర్త రాజేశ్‌ కుంటే పరువు నష్టం దావా వేశారు. విచారణ చేపట్టిన కోర్టు.. జూన్‌ 12న రాహుల్‌ను విచారణకు హాజరు కావాలని ఆదేశించింది.

రాహుల్‌ గాంధీ వ్యాఖ్యలు ఆరెస్సెస్‌ ప్రతిష్టకు భంగం కలిగించేవిగా ఉన్నాయని రాజేశ్‌ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. అయితే రాహుల్‌ లిఖితపూర్వక స్టేట్‌మెంట్‌ పట్ల అసంతృప్తి వ్యక్తం చేసిన కోర్టు.. స్వయంగా విచారణకు రావాల్సిందిగా ఆదేశించింది.ఈ విషయాన్ని రాహుల్‌ గాంధీ తరపు న్యాయవాది నారాయణ అయ్యర్‌ ధృవీకరించారు. కాగా, ఈ కేసును కొట్టేయాలంటూ గతంలోనే రాహుల్‌ సుప్రీం కోర్టును అభ్యర్థించగా.. కోర్టు తిరస్కరించింది. ‘ఆరోపణలు నిజం కాని పక్షంలో పిటిషనర్‌కు క్షమాపణలు చెప్పాలని.. అలాకానీ పక్షంలో విచారణను ఎదుర్కోవాల్సిందే’అని అత్యున్నత న్యాయస్థానం రాహుల్‌కు స్పష్టం చేసింది. అయితే రాహుల్‌ మాత్రం విచారణకే మొగ్గు చూపారు.

మరిన్ని వార్తలు