‘అందుకే కాంగ్రెస్‌లో 20 మంది డమ్మీ అభ్యర్థులు’

14 Nov, 2018 16:49 IST|Sakshi

సొంత పార్టీ నేతలపై నిప్పులు చెరిగిన గజ్జెల కాంతం

కాంగ్రెస్‌లో కోవర్టులుగా ముగ్గురు బడా నేతలు

టీపీసీసీ అధికార ప్రతినిధి ఆరోపణలు

సాక్షి, కరీంనగర్‌ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఓటమే లక్ష్యంగా ముగ్గురు బడా నేతలు కోవర్టులుగా పనిచేస్తున్నారని టీపీసీసీ అధికార ప్రతినిధి గజ్జెల కాంతం ఆరోపించారు. మంచి వారిగా నటిస్తూ.. పార్టీలోని అంతర్గత విషయాల్ని టీఆర్‌ఎస్‌కు చేరవేస్తున్నారని మండిపడ్డారు. అందుకే, 20 మంది డమ్మీలను కాంగ్రెస్‌ అభ్యర్థులుగా ప్రకటించిందని వ్యాఖ్యానించారు. టీఆర్‌ఎస్‌ ముఖ్యనేతలతో సమావేశమై.. ఎక్కడ డమ్మీ అభ్యర్థులను పెట్టాలో ఈ కోవర్టులు ఒప్పందం చేసుకున్నారని ఆయన మీడియాకు బుధవారం వెల్లడించారు. తమ వ్యాపార లావాదేవీల కోసం పార్టీ భవితవ్యాన్ని తాకట్టు పెట్టారని  తీవ్ర విమర్శలు చేశారు.

అలాగే, కరీంనగర్‌లోనూ మరో ఇద్దరు కాంగ్రెస్‌ కోవర్టులున్నారని కాంతం అన్నారు. కేటీఆర్‌ చెప్పిన వారికే టికెట్లు వచ్చేలా చేశారని విమర్శలు గుప్పించారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో పనిచేసిన వారికి టికెట్లు రాకుండా.. ఈ కోవర్టులంతా కలిసి హైకమాండ్‌ను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్‌లో మాత్రం ఉద్యమ నాయకులకు టికెట్లు కేటాయించారని అన్నారు. ‘రేపు (గురువారం) విద్యార్థి నాయకులం, ఉద్యమకారులం భేటీ అవుతాం. టికెట్ల కేటాయింపులో కాంగ్రెస్‌లో జరిగిన అవకతవకలను బయటపెడతాం’ అని ఆయన హెచ్చరించారు. వాస్తవాలను రాహుల్‌ గాంధీ దృష్టికి తీసుకెళ్తానని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్‌ను వీడేది లేదని స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు