కేంద్రంపై మరోసారి విరుచుకుపడిన దీదీ

28 May, 2020 10:29 IST|Sakshi

కోల్‌కతా: కరోనా విషయంలో బీజేపీ, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి మధ్య విమర్శలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వలస కార్మికుల తరలింపు, లాక్‌డౌన్‌ అమలు విషయంలో పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం కేంద్రానికి సహకరించడం లేదన్న అమిత్‌ షా విమర్శలపై మమతా బెనర్జీ ఘాటుగా స్పందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ‘లాక్‌డౌన్‌ అమలును పర్యవేక్షించేందుకు అమిత్‌ షా కేంద్రం బృందాలను కేవలం బెంగాల్‌కు మాత్రమే పంపించారు. సరే మంచిదే. మా ప్రభుత్వం సరిగా పని చేయడం లేదని మీరు భావిస్తున్నారు కదా.. అలాంటపప్పుడు మీరే స్వయంగా రంగంలోకి దిగి పరిస్థితిని పర్యవేక్షిస్తే బాగుంటుంది కదా. ఎందుకు ఆ ప్రయత్నం చేయడం లేదు’ అని అమిత్‌ షాను ప్రశ్నించారు దీదీ. అంతేకాక లాక్‌డౌన్‌ సమయంలో రైళ్లు, విమనాలు తిరిగేందుకు అనుమతివ్వడం ఏంటని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి వలస కూలీలు బెంగాల్‌కు రావడం పట్ల కూడా మమత ఆందోళన వ్యక్తం చేశారు. (రైల్వేల తీరుపై దీదీ ఫైర్‌)

రాబోయే 24 గంటల్లో, మహారాష్ట్ర మీదుగా బెంగాల్‌కు 36 శ్రామిక్‌ రైళ్లు వచ్చే అవకాశం ఉంది. దీనిపై మమతా బెనర్జీ స్పందిస్తూ.. ‘ఇప్పటికే దేశంలో లక్షకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఇలాంటి సమయంలో కరోనా తీవ్రత అధికంగా ఉన్న రాజస్తాన్‌, మహారాష్ట్రాల నుంచి వలస కార్మికులు బెంగాల్‌ వస్తున్నారు. ఫలితంగా ఇక్కడ కరోనా కేసులు పెరుగుతాయి. ఇలాంటి విపత్కర పరిస్థితిలో నేనేం చేయాలి? అందుకే ప్రధాని మోదీనే స్వయంగా ఇక్కడ పర్యవేక్షించాల్సిందిగా కోరుతున్నాను’ అన్నారు దీదీ. అయితే ఇంత అకస్మాత్తుగా బెంగాల్‌కు వలస కూలీల రైళ్లను పంపడం.. తనను కలవరపరిచేందుకు కేంద్రం చేస్తున్న రాజకీయ కుట్రగా ఆమె పేర్కొన్నారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో తన‌ను ఇబ్బంది పెట్టెందుకే బీజేపీ ఇలా చేస్తుందని మమత ఆరోపించారు. కేంద్ర తనను ఇబ్బంది పెట్టడానికి చేసే ప్రయత్నం వల్ల.. బెంగాల్‌ ప్రజలు నష్టపోతారని తెలిపారు. బీజేపీ తనను రాజకీయంగా ఇబ్బంది పెట్టడం గురించి కాక వలస రైళ్ల గురించి ప్రణాళికలు చేస్తే బాగుంటుందని మమత సూచించారు.(మమత సర్కారు కీలక నిర్ణయం)

మరిన్ని వార్తలు