గృహ రుణాలపై వడ్డీ తీసుకోకూడ‌దు: ప్రియాంక

13 May, 2020 16:40 IST|Sakshi

ల‌క్నో : కరోనా వైరస్ సంక్షోభాన్ని ఎదుర్కోవటానికి 11 సూచనలతో కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యానాథ్‌కు బుధవారం లేఖ రాశారు. ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం గృహ రుణాలపై వడ్డీని కోరకూడదని, రైతుల విద్యుత్ బిల్లులను నాలుగు నెలల పాటు మాఫీ చేయాలని ఈ సంద‌ర్భంగా లేఖ‌లో డిమాండ్ చేశారు. రాష్ట్ర రైతుల గురించి ప్ర‌స్తావిస్తూ.. రైతుల మొత్తం ఉత్పత్తులను కొనుగోలు చేస్తామని ప్ర‌భుత్వం హామీ ఇవ్వాల‌ని, పెండింగ్‌లో ఉన్న అన్ని బకాయిలను రైతులకు పూర్తిగా చెల్లించాలని  డిమాండ్ చేశారు. (మొద‌టి రైలు: నిబంధ‌న‌ల ఉల్లంఘ‌న )

రాష్ట్రంలోని చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ఉపశమనం అందించాల‌ని ప్రియాంక గాంధీ కోరారు. అనంత‌రం చేనేత కార్మికులు, కార్పెట్ త‌యారీదారులు గురించి లేఖ‌లో పేర్కొన్నారు. వీరికి ఆర్థిక ఉపశమనం, రుణ మాఫీ క‌ల్పించాల‌ని డిమాండ్ చేశారు. కాగా రైతుల నుంచి గోధుమల సేకరణలో రాష్ట్ర‌ ప్ర‌భుత్వం అల‌స‌త్వం ప్ర‌ద‌ర్శిస్తుంద‌ని ప్రియాంక గాంధీ ఇటీవ‌ల ఆరోపించారు, రైతులు తమ ఉత్పత్తులను మార్కెట్‌లో విక్రయించడానికి మూడు రోజులు వేచి ఉండాల్సి వస్తుంద‌ని విమ‌ర్శించారు. రైతుల మ‌నోవేద‌న‌ల‌ను వినేందుకు ఎవ‌రూ లేర‌ని ఆమె సోమ‌వారం ట్వీట్ చేశారు. (20 ఏళ్లలో 5 వైరస్‌లు అక్కడినుంచే..! )

మ‌రో వైపు రాష్ట్ర‌ ప్రజలను ఆదుకోవ‌డంతో  ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి జితిన్ ప్రసాద బుధవారం ఆరోపించారు. అధికారం పూర్తిగా ప్రభుత్వ చేతుల్లో కేంద్రీకృతమై ఉంద‌ని, దీని ద్వారా ప్ర‌జ‌లు అధికారులను చేరుకోలేక‌ ఎక్కడికి వెళ్ళాలో తెలియ‌క నిస్సహాయంగా ఉన్నార‌ని పేర్కొన్నారు. వలస కార్మికులు త‌మ స్వంత ప్ర‌దేశాలు చేరుకోవ‌డానికి అవ‌స‌ర‌మైన  రైలు టికెట్ ఖ‌ర్చుల‌ను కాంగ్రెస్ పార్టీ చెల్లిస్తుంద‌ని  కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ తీసుకున్న నిర్ణ‌యం చారిత్రాత్మ‌క‌మైన‌ద‌న్నారు. ప్ర‌తి ఒక్క‌రికి ఈ స‌హాయం అందేలా చూసుకునే బాధ్య‌త‌ కాంగ్రెస్ కార్యకర్తలందరిద‌ని జితిన్ ప్రసాద పేర్కొన్నారు.
(లాక్‌డౌన్‌: మహిళపై అఘాయిత్యం )

మరిన్ని వార్తలు