పార్టీ ఇమేజీ.. పొత్తుతో డ్యామేజీ!

22 Dec, 2018 02:06 IST|Sakshi

కాంగ్రెస్‌ పార్టీతో పొత్తుపై సీపీఐలో అంతర్మథనం

సాక్షి, హైదరాబాద్‌: అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు కుదుర్చుకోవడంపై సీపీఐలో అంతర్మథనం సాగుతోంది. కాంగ్రెస్‌ ప్రజాఫ్రంట్‌ కూటమిలో చేరాక సీట్ల సర్దుబాటు, కేటాయించే సీట్ల ఖరారులో పార్టీ నాయకత్వం సమర్థంగా వ్యవహరించలేకపోయిందనే విమర్శలు సీపీఐలో వ్యక్తమవుతోన్నాయి. కూటమిలో చేరగానే కాంగ్రెస్‌కు దాసోహమన్నట్టుగా సీపీఐ వ్యవహరించిన తీరును అంతర్గత చర్చల్లో ఆ పార్టీ నేతలు తప్పుబడుతున్నారు. పార్టీకి గట్టి పట్టున్న సీట్లు, గెలిచే అవకాశం ఎక్కువ స్థానాల కోసం పట్టుబట్టకుండా కేటాయించిన 3 సీట్లకే సంతృప్తి చెందడం వల్ల పార్టీ ఇమేజీకి భంగం వాటిల్లిందని పలువురు వాదిస్తున్నారు. సొంతంగా ఎన్నికల బరిలో నిలిచినా, పరిమిత స్థానాల్లోనే పోటీచేసినా ఆ గౌరవమైనా పార్టీకి దక్కేదనే వాదనను వినిపిస్తున్నారు. 

5 సీట్లలో పోటీ చేయాల్సింది!
కూటమి పొత్తుల్లో భాగంగా కనీసం 5 స్థానాల కోసమైనా పట్టుబట్టాల్సి ఉండాల్సిందని.. సీపీఐ బలంగా ఉన్న కొత్తగూడెం, మునుగోడు సీట్లను కచ్చితంగా సాధిస్తే మంచి ఫలితాలుండేవని పార్టీ నేతలు అంటున్నారు. పార్టీ కోరుకున్న మేరకు కాంగ్రెస్‌ సీట్లు కేటాయించని పక్షంలో సొంతంగా 25 స్థానాల్లో పోటీ చేసే లా ప్లాన్‌–బీని అమలుచేసేందుకు సిద్ధమైతే పరిస్థితి మరోలా ఉండేదని వాదిస్తున్నారు. ఒక్క సీటైనా గెలవకపోయినా పార్టీ ఓటింగ్‌ పెరిగి, భవిష్యత్‌లో ఆయాస్థానాల్లో మళ్లీ పోటీకి, పార్టీ విస్తరణకు అవకాశం ఉండేదని చెబుతున్నారు. ఈ విషయంలో కనీసం కాంగ్రెస్‌కు హెచ్చరికలు చేసి ఒంటరిగా పోటీ చేసేం దుకు సైతం సిద్ధమనే సంకేతాలు ఇవ్వకపోవడంలో పార్టీ నాయకత్వం విఫలమైందని అంటున్నారు. 

కాంగ్రెస్‌కు అలుసై పోవడంతోనే.. 
సీపీఐ ఎక్కడికిపోదనే పరిస్థితిని కాంగ్రెస్‌ అలుసుగా తీసుకుందని సీపీఐ నేతలు వాదిస్తున్నారు. వైరాలో సీపీఐ గెలిచే అవకాశమున్న చోట రెబెల్‌ అభ్యర్థిని బరిలో కొనసాగించడంతో చివరికి ఆ తిరుగుబాటు అభ్యర్థే విజయం సాధించడం రుజువు చేస్తోందని వెల్లడిస్తున్నారు. పార్టీ కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి పోటీచేసిన హుస్నాబాద్‌లోనూ కాంగ్రెస్‌ పూర్తి స్థాయి లో సహకారం అందించకపోవడంతో పార్టీ ఓడిపోయిందని అంగీకరిస్తున్నారు. పార్టీ కార్యదర్శిగా ఉన్న వ్యక్తి తనకు కేటాయించే సీటు కోసం గట్టిగా కోరుకోవడం వల్ల ఇతర స్థానాల కోసం పట్టుబట్టే పరిస్థితి లేకుండా పోయిందని విమర్శిస్తున్నారు. ఇక బెల్లంపల్లిలో ఆరోగ్యం అంతగా సహకరించని సీనియర్‌ నేత గుండా మల్లేశ్‌ను పోటీ చేయించడం పార్టీ నాయకత్వం చేసిన తప్పుగా ఎత్తిచూపుతున్నారు. భవిష్యత్‌లోనైనా కాంగ్రెస్‌తో పొత్తులు కుదుర్చునే పక్షంలో పార్టీ గౌరవానికి భంగం కలగనీయకుండా, కోరుకునే సీట్లను గట్టిగా పట్టుబట్టాలని లేని పక్షంలో ఒంటరి పోరుకు సిద్ధం కావాలని సూచిస్తున్నారు. 

మరిన్ని వార్తలు