లెఫ్ట్‌.. రైట్‌!

28 Sep, 2018 16:13 IST|Sakshi

కూటమి పొత్తుతో సీపీఐ సీట్లకు ఎసరు 

ప్రతిపాదిత స్థానాలపై అసంతృప్తి 

అవసరమైతే ఒంటరిగా బరిలోకి దిగే యోచన 

సీపీఎం, బీఎల్‌ఎఫ్‌ ఉమ్మడిగా పోటీ 

అన్ని స్థానాల్లో  అభ్యర్థులను నిలిపే అవకాశం 

కాంగ్రెస్, టీడీపీతో పొత్తు సీపీఐ సీట్లకు ఎసరు తెస్తుండగా.. బహుజన వామపక్ష కూటమి తరఫున బరిలో దిగడానికి సీపీఎం కసరత్తు చేస్తోంది. బీఎల్‌ఎఫ్‌ నుంచి  ఇప్పటికే రెండు నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేసిన ఆ పార్టీ.. మిగతా సెగ్మెంట్లకు గెలుపు గుర్రాలను అన్వేషిస్తోంది. సీపీఐకి మాత్రం పొత్తులు తేలేదాక ముందుకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది.
 

సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: టీడీపీ, కాంగ్రెస్, టీజేఎస్‌తో మహాకూటమిగా ఏర్పడి పోటీచేయాలని సీపీఐ నిర్ణయించింది. ఈ క్రమంలో ఇప్పటికే ఆయా పార్టీల పెద్దలతో సీట్ల సంఖ్యపై ప్రాథమికంగా చర్చించింది. అయితే, ప్రతిపాదిత సీట్లపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న భారత కమ్యూనిస్టు పార్టీ అవసరమైతే ఒంటరిగా బరిలో దిగాలనే ఆలోచన చేస్తోంది. ఈ నేపథ్యంలో పొత్తుపై స్పష్టత వచ్చే వరకు జిల్లాలో ఏయే నియోజకవర్గాల్లో పోటీ చేస్తుందనేది తేలేలా లేదు. పొత్తు కుదరకపోతే ఇబ్రహీంపట్నం, చేవెళ్ల, షాద్‌నగర్, రాజేంద్రనగర్‌ నియోజకవర్గాల్లో పోటీచేయాలని భావిస్తున్న ఆ పార్టీ నాయకత్వం.. పొత్తు పొడిస్తే ఇబ్రహీంపట్నం కోసం పట్టుబట్టాలని నిర్ణయించింది. అయితే, ఈ సీటు టీడీపీ సిట్టింగ్‌ది కావడం.. కాంగ్రెస్‌ కూడా బలంగా ఉన్న నేపథ్యంలో మహాకూటమి విశాల ప్రయోజనాలకు అనుగుణంగా సర్దుకోవాలని భావిస్తోంది. 

కూటమా.. ఒంటరిగానా? 
ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నుంచి పలుమార్లు ప్రాతినిథ్యం వహించిన సీపీఎం ప్రాబవం గణనీయంగా తగ్గింది. నియోజకవర్గాల పునర్విభజనకు తోడు పార్టీలో అంతర్గత కుమ్ములాటలు కూడా సీపీఎంకు నష్టం చేకూర్చాయి. ముఖ్యంగా కామ్రేడ్ల మధ్య అభిప్రాయ భేదాలు పొడచూపడం.. జిల్లా నాయకత్వ బాధ్యతలు కూడా స్థానికేతరులకు అప్పగించడం కూడా పార్టీని దెబ్బతీసింది. ఇబ్రహీంపట్నం నుంచి కొండిగారి రాములు, మస్కు నర్సింహ ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. ఇందులో కొండిగారి రాములు కొన్నేళ్ల క్రితం సీపీఐ కండువా కప్పుకున్నారు. ఆయన బాటనే నర్సింహ కూడా అనుసరించినప్పటికీ ఇటీవల మళ్లీ సొంత గూటికి చేరుకున్నారు. పార్టీలో నెలకొన్న గ్రూపు రాజకీయాల కారణంగా కేడర్‌లో కూడా చీలికలు వచ్చాయి. ఈ పరిణామ క్రమంలో సీపీఐ మినహా వామపక్ష భావజాలం కలిగిన పార్టీలన్నీ బీఎల్‌ఎఫ్‌గా ఏర్పడ్డాయి. దీనికి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రమే సారథ్యం వహిస్తుండడం.. ఆయన ఇబ్రహీంపట్నంపై గురిపెట్టడంతో ఆ పార్టీ ఇక్కడ్నుంచి పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే, బీఎల్‌ఎఫ్‌ అభ్యర్థిగా రంగంలోకి దిగుతారా? సీపీఎం తరఫున పోటీ చేస్తారా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఒంటరిగా చేసినా బీఎల్‌ఎఫ్‌ సంపూర్ణ మద్దతు ఉండనుంది. పోటీపై స్పష్టత వచ్చిన తర్వాతే అభ్యర్థుల ఖరారుపై నిర్ణయం వెలువడే అవకాశం కనిపిస్తోంది. ఇదిలావుండగా, రాజేంద్రనగర్‌కు రాఘవేంద్రస్వామి, మేడ్చల్‌కు గుజ్జా రమేశ్, కొడంగల్‌లో డాక్టర్‌ వెంకటేశ్వర్లును బీఎల్‌ఎఫ్‌ అభ్యర్థులుగా గురువారం పార్టీ రాష్ట్ర నాయకత్వం ప్రకటించింది. మిగతా సెగ్మెంట్లకు ఒకట్రెండు రోజుల్లో అభ్యర్థులను ఖరారు చేయనుంది.   

మరిన్ని వార్తలు