గతమెంతో ఘనం...నేడు ఉనికే ప్రశ్నార్థకం

9 Dec, 2018 01:52 IST|Sakshi

ఉనికి కోసం పాట్లు పడుతున్న సీపీఐ

సాక్షి, హైదరాబాద్‌: ప్రస్తుత ఎన్నికల్లో కనీసం ఒక్క సీటైనా గెలిచి అసెంబ్లీలో కనీస ప్రాతినిధ్యం సాధించేందుకు సీపీఐ ప్రయత్నిస్తోంది. కాంగ్రెస్‌ ప్రజా ఫ్రంట్‌ కూటమిలో భాగంగా మూడు స్థానాల్లో పోటీచేస్తున్న సీపీఐ ఉనికి చాటుకునే ప్రయత్నాల్లో నిమగ్నమైంది. కాంగ్రెస్‌ ప్రజాఫ్రంట్‌ కూటమిలోకి టీడీపీ, టీజేఎస్, సీపీఐ చేరినా సీట్ల సర్దుబాటు సజావుగా జరగలేదు. దాదాపు 10 నుంచి 12 స్థానాలు కోరుకుని వాటిలో కనీసం ఐదైనా లభిస్తాయనుకుంటే, కూటమి సమీకరణల్లో సీపీఐకు మూడుసీట్లే లభించాయి. దీంతో గతమెంతో ఘనంగా ఉన్న సీపీఐ ఇప్పుడు ఉనికికోసం పాట్లు పడుతోంది.  

హుస్నాబాద్‌: సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ఇక్కడి నుంచి పోటీచేశారు. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్‌తో సీపీఐ సీట్ల సర్దుబాటులో గెలిచి ఎమ్మెల్యే అయ్యారు. 2009లో టీడీపీ, టీఆర్‌ఎస్, లెఫ్ట్‌ పొత్తులో పోటీ చేసినా ఓటమి పాలయ్యారు. 2014 ఎన్నికల్లో పోటీ చేయలేదు. ప్రస్తుతం ఇక్కడ టీఆర్‌ఎస్‌–సీపీఐ–బీజేపీల ముక్కోణపు పోటీ జరిగింది.  

బెల్లంపల్లి (ఎస్సీ): ఇక్కడ ప్రధానపార్టీల మధ్య చతుర్ముఖæ పోటీ నెలకొంది. టీఆర్‌ఎస్‌ నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, కాంగ్రెస్‌ కూటమిలోని సీపీఐ అభ్యర్థి గుండామల్లేశ్, బీజేపీ నుంచి కొయ్యల ఏమాజీ, ఎంసీపీఐ నుంచి సబ్బని కృష్ణ పోటీ చేశారు. మాజీమంత్రి జి. వినోద్‌ ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ టికెట్‌ ఆశించి దక్కకపోవడంతో బీఎస్‌పీ టికెట్‌పై బరిలో ఉన్నారు.  

వైరా(ఎస్టీ): ఇక్కడి నుంచి గతంలో సీపీఐ గెలుపొందింది. అంతకుముందు పార్టీలో సభ్యత్వం కూడా లేని విజయాబాయికి ఈసారి ఇక్కడినుంచి సీపీఐ టికెట్‌ లభించింది. టీఆర్‌ఎస్‌ నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్యే బానోతు మదన్‌లాల్‌ (గత ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ టికెట్‌పై గెలిచారు), బీజేపీ నుంచి రేష్మా రాథోడ్, సీపీఎం నుంచి భుక్యా వీరభద్రరావు పోటీచేస్తున్నారు. కాంగ్రెస్‌ టికెట్‌ను ఆశించి భంగపడ్డ రాములునాయక్‌ తిరుగుబాటు అభ్యర్థిగా ఇక్కడ బరిలో ఉన్నారు. సీపీఎం అభ్యర్థి కూడా పోటీలో ఉండటం వల్ల ఓట్లు చీలిపోయే అవకాశాలతో పాటు కాంగ్రెస్‌–సీపీఐల మధ్య ఓట్ల బదిలీ ప్రశ్నార్థకంగా మారింది.

1983 నుంచి ఎత్తుపల్లాలు
టీడీపీ ఆవిర్భావం తర్వాత 1983 ఎన్నికల్లో ఉభయ కమ్యూనిస్టుపార్టీల్లో ఒకటైన సీపీఐ ఎన్నో ఎత్తుపల్లాలు ఎదుర్కొంది. 1983 ఎన్నికల్లో 48 స్థానాల్లో పోటీచేసిన సీపీఐ 4 స్థానాల్లోనే గెలిచింది. 1985లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో సీపీఐ, సీపీఎంలు చెరో 11 స్థానాలు దక్కించుకోగా 1989లో జరిగిన ఎన్నికల్లో సీపీఐ 5 సీట్లలో గెలుపొందింది. 1994 ఎన్నికల్లో టీడీపీ పొత్తుతో సీపీఐ 19 సీట్లు గెలుచుకుంది. 1999 ఎన్నికల్లో సీపీఐ ఒక్కసీటుకూడా గెలుచుకోలేక పోయింది. మళ్లీ 2004లో కాంగ్రెస్‌తో సీట్ల సర్దుబాటు చేసుకుని పోటీచేసినపుడు సీపీఐ 6 స్థానాల్లో గెలుపొందింది. 2009 ఎన్నికల్లో సీపీఐ 4 స్థానాలు, తెలంగాణ ఏర్పడ్డాక 2014లో జరిగిన ఎన్నికల్లో ఒక్క స్థానానికే పరిమితమైంది.

మరిన్ని వార్తలు