'కేసీఆర్‌కు థర్డ్‌ ఫ్రంట్‌ అర్హత లేదు'

9 Mar, 2018 16:24 IST|Sakshi

సాక్షి, పెద్దపల్లి: దేశంలో భారతీయ జనతా పార్టీ అప్రజాస్వామిక పాలన కొనసాగిస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి ఆరోపించారు. ఆయన శుక్రవారం పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో జరిగిన సీపీఐ 2వ మహాసభలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విగ్రహాల విధ్వంస చర్యలను బీజేపీ, సంఘ్‌ పరివార్‌ శక్తులు మానుకోవాలన్నారు. ప్రజాస్వామ్య విలువలను మోదీ సర్కార్‌ పాతరేస్తోందని మండిపడ్డారు. నల్లధనాన్ని వెలికితీయడంలో మోదీ ప్రభుత్వం విఫలమైందన్నారు. బొగ్గు బావుల ప్రైవేటీకరణను కేంద్రం రద్దు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. 

మరో వైపు రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కూల్చి వేస్తున్న కేసీఆర్‌కు థర్డ్‌ ఫ్రంట్‌ పెట్టె అర్హత లేదన్నారు. మార్చి 11 న జరగబోయే మిలియన్‌ మార్చ్‌ స్పూర్తి యాత్రను అడ్డుకోవడానికి సీపీఐ కార్యకర్తలను నిర్భంధించడం సరైనది కాదన్నారు. ప్రజాస్వామ్య , లౌకిక, వామపక్ష విశాల వేదికకు సీపీఐ కృషి చేస్తుందని ఆయన వెల్లడించారు.

మరిన్ని వార్తలు