కార్పొరేట్‌ శక్తులకు బీజేపీ ఊడిగం

23 Feb, 2020 04:32 IST|Sakshi

సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా ధ్వజం

మంచిర్యాలలో సీపీఐ రాష్ట్ర నిర్మాణ సభలు ప్రారంభం 

పాతమంచిర్యాల: బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్‌ సంస్థలకు ఊడిగం చేస్తూ ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తోందని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా విమర్శించారు. శనివారం మంచిర్యాలలో సీపీఐ రాష్ట్ర నిర్మాణ మహాసభలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బీజేపీ రెండోసారి అధికారంలోకి వచ్చాక దేశం క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటోందని చెప్పారు. సబ్‌కాసాత్‌ సబ్‌కా వికాస్, బేటీ పడావో నినాదాలు ప్రచారానికి పరిమితమయ్యాయని విమర్శించారు. దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందన్నారు. ప్రభుత్వరంగ సంస్థలన్నీ ప్రైవేట్‌ పరం కాబోతున్నాయని జోస్యం చెప్పారు.

దేశంలో మతాల మధ్య చిచ్చుపెట్టి విడదీయడానికి సీఏఏ, ఎన్నార్సీ, ఎన్‌పీఆర్‌లను తీసుకొచ్చిందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్‌ షా ఆర్‌ఎస్‌ఎస్‌ ఎజెండాను అమలు చేస్తున్నారని మండిపడ్డారు. అంబేద్కర్‌ రాసిన రాజ్యాంగాన్ని పక్కన పెట్టి మనువాదం అమలు చేసేలా ప్రణాళికలు చేస్తున్నారని విమర్శించారు. బీజేపీ అనుసరిస్తున్న విధానాలను నిరసిస్తూ ఫిబ్రవరి 22 నుంచి మార్చి 22 వరకు నెల రోజుల పాటు దేశ వ్యాప్తంగా నిరసన ర్యాలీలు నిర్వహిస్తామని ఆయన వివరించారు. ట్రంప్‌ పర్యటనను సీపీఐ వ్యతిరేకిస్తుందని చెప్పారు. సభలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, సహాయ కార్యదర్శి పల్లా వెంకట్‌ రెడ్డి, జిల్లా కార్యదర్శి కలవేన శంకర్‌ పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు