‘బీజేపీ హోల్‌సేల్‌.. కాంగ్రెస్‌ రిటైల్‌’

19 Dec, 2018 19:14 IST|Sakshi
సీపీఐ జాతీయ నేత కె.నారాయణ

విశాఖపట్నం: బీజేపీది హోల్‌సేల్‌ అవినీతి అయితే.. కాంగ్రెస్‌ది రిటైల్‌ అవినీతి అని సీపీఐ జాతీయ నేత నారాయణ తీవ్రంగా విమర్శించారు. విశాఖపట్నంలో నారాయణ విలేకరులతో మాట్లాడుతూ..ఈ దేశానికి విదేశీ స్వదేశీ ఉగ్రవాదం ప్రమాదం కాదు.. ప్రధాని మోదీ నుంచే ప్రమాదం పొంచి ఉందని వ్యాఖ్యానించారు. ఎన్నికల కమిషన్‌ను ఒక చప్రాసీలా మార్చేశారని మండిపడ్డారు. ఆర్‌బీఐ గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌ను పొమ్మన లేక పొగబెట్టారని ఆరోపించారు. పెద్ద నోట్ల రద్దు వల్ల ఆర్ధిక వ్యవస్థ దెబ్బతిన్నదని అన్నారు. సీబీఐని ఉస్కో అంటే ఉస్కో పద్ధతిలో మార్చేశారని తెలిపారు.

బీజేపీకి ప్రతి నియోజకవర్గంలో ఒక డెకాయిటీ ఉన్నారని, ఆర్‌ఎస్‌ఎస్‌ ఒక డెకాయిటీ అని వ్యాఖ్యానించారు. తెలంగాణాలో మోదీ ఆశీస్సులతోనే కేసీఆర్‌ గెలిచారని ఆరోపించారు. గవర్నర్‌లను పనిమనిషులుగా చూస్తున్నారని చెప్పారు. అందుకే గవర్నర్ల వ్యవస్థ పోవాలని అంటున్నామని తెలిపారు. దేశంలో ప్రజాస్వామ్యం, పార్లమెంటు బతకాలంటే మోదీ ప్రభుత్వం పోవాలన్నారు. రఫేల్‌ కుంభకోణమే ప్రధాన ఎజెండాగా పార్లమెంటు సమావేశాలుంటాయని వెల్లడించారు. 2019 ఎన్నికల్లో మోదీ పొరపాటున గెలిస్తే ఇవే తనకు చివరి ఎన్నికలని వ్యాక్యానించారు.

మరిన్ని వార్తలు