అమిత్‌ షా కోసం 12 మందిని చంపేశారు: నారాయణ

22 Dec, 2018 16:28 IST|Sakshi

హైదరాబాద్‌: సోహ్రాబుద్దీన్‌ ఎన్‌కౌంటర్‌లో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు, అప్పటి గుజరాత్‌ హోంమంత్రి అమిత్‌ షాను రక్షించడం కోసం 12 మంది అధికారులను చంపేశారని సీపీఐ జాతీయ నేత కంకణాల నారాయణ ఆరోపించారు. హైదరాబాద్‌లో నారాయణ విలేకరులతో మాట్లాడుతూ..న్యాయ వ్యవస్థను కూడా నరేంద్ర మోదీ ప్రభుత్వం బ్రష్టు పట్టించిందని విమర్శించారు. సీబీఐ జడ్జి కళ్లకు గంతలు కట్టుకుని కేసును మూసివేశారని దుయ్యబట్టారు. దేశంలో క్రిమినల్‌ గ్యాంగ్‌ అమిత్‌ షా నాయకత్వంలో పనిచేస్తున్నదని మండిపడ్డారు. అన్ని కేసుల్లోనూ మోదీ కనుసన్నల్లోనే సీబీఐ దర్యాప్తు నడుస్తోందని విమర్శించారు. అమిత్‌ షా కుటుంబాన్ని కాపాడటానికి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారని ధ్వజమెత్తారు. 

కేసీఆర్‌ డబ్బుల పంపిణీకి ఈసీ కాపలా

కేసీఆర్‌ డబ్బుల పంపిణీకి ఎన్నికల సంఘం(ఈసీ) కాపలాగా ఉందని ఆరోపించారు. మోదీకి వ్యక్తిగత కార్యదర్శిగా కేసీఆర్‌ పనిచేస్తున్నారని ఎద్దేవా చేశారు. అగ్రిగోల్డ్‌ ఆస్తులు స్వాధీనం చేసుకుని బాధితులకు న్యాయం చేయాలని సూచించారు. 32 లక్షల కుటుంబాల గోస చంద్రబాబుకు తప్పక తగులుతుందని శాపనార్ధాలు పెట్టారు.

ఈసీది పక్షపాత వైఖరి: చాడ

ఎన్నికల కమిషన్‌(ఈసీ) ఒక పార్టీకి పక్షపాతంగా వ్యవహరించిందని సీపీఐ  తెలంగాణ కార్యదర్శి చాడ వెంకట్‌ రెడ్డి ఆరోపించారు. ఈవీఎంలు టాంపరింగ్‌ అయ్యాయని, పోలైన ఓట్లకు, కౌంటింగ్‌లో వచ్చిన ఓట్లకు చాలా తేడా ఉందని తెలిపారు. ప్రజాస్వామ్యబద్దంగా పాలన కొనసాగించాలని కోరారు. జాతీయపార్టీ నిర్ణయం మేరకు ఆయా రాష్ట్రాల్లో పొత్తులపై నిర్ణయాలు ఉంటాయని చెప్పారు. అభ్యర్థులను ప్రకటించడంలో ఆలస్యం జరిగిందని, ఇది కూడా ఒక తప్పిదమని పేర్కొన్నారు. అసెంబ్లీలో ప్రతిపక్షం లేకుండా చేయవచ్చు కానీ ప్రజలు లేకుండా చెయ్యలేరని వ్యాఖ్యానించారు.


 

మరిన్ని వార్తలు