బోటింగ్‌ రంగంలోనూ మాఫియా: నారాయణ

16 May, 2018 13:23 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఆంధ్రప్రదేశ్‌లో వరుసగా జరుగుతున్న బోటు ప్రమాదాలు విచారకరం...వీటిని అరికట్టడంలో ప్రభుత్వం వైపల్యం చెందిందని...బోటింగ్‌ రంగంలో కూడా మాఫియా ఉందని సీపీఐ కేం‍ద్ర కమిటీ కార్యదర్శి నారాయణ విమర్శించారు. ఈ ఘటనపై సీనియర్‌ ఐఏఎస్‌ అధికారితో కమిటీ వేసి విచారణ జరిపించాలని, అంతేకాక బాధిత కుంటుంబాలకు రూ.10 లక్షల చొప్పున నష్ట పరిహారం ఇవ్వాలని ఆయన డిమాండు చేశారు.

ఈ సందర్భంగా నారాయణ బుధవారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న బోటు ప్రమదాలు, అత్యాచార సంఘటనలపై ఆందోళన వ్యక్తం చేశారు. అత్యాచారాల పోటీ పెడితే ఆంధ్రప్రదేశ్‌ ప్రధమ స్థానంలో నిలుస్తుందన్నారు. అత్యాచారాల నిరోధానికి కేంద్ర ప్రభుత్వం జీవోలు జారీ చేస్తుంది...కానీ జమ్ము కాశ్మీర్‌లో జరిగిన ‘కథువా అత్యాచార’ ఘటనలో స్వయంగా ఆ పార్టీకి చెందిన ఉప ముఖ్యమంత్రే నిందితుడుగా ఉన్నాడని తెలిపారు. బీజేపీ కర్ణాటకలో గెలిచిన తర్వాత ఇక తమకు దక్షిణాదిలో కూడా తిరుగులేదని భావిస్తుందని, కానీ కర్ణాటకలో బీజేపీ నైతికంగా ఓడిపోయిందని విమర్శించారు.

అంతేకాక కర్ణాటక గవర్నర్‌ ముఖ్యమంత్రి అభ్యర్థిని నిర్ణయించకుండా వాయిదా వేయడం విచారకరమని, గవర్నర్‌లు పాలకపక్షానికి మేలు చేసే విధంగా ప్రవర్తిస్తున్నరని అన్నారు. వెంటనే గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. తమ వద్ద ఉన్న నల్ల ధనాన్ని తెల్లగా మార్చుకోవడం కోసమే బీజేపీ నోట్ల రద్దును తీసుకువచ్చిందని, కేంద్రం ప్రభుత్వం తీసుకునే ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై పోరాడ్డానికి సీపీఐ పార్టీ సిద్దమవుతుందని తెలిపారు.

ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కేంద్రం 75 శాతం విభజన హమీలను నెరవేర్చిందన్న కన్నా లక్ష్మీనారాయణ వాఖ్యలను ఖండిస్తూ, అధ్యక్షుడు కాకముందే ఇన్ని అసత్యాలు ప్రచారం చేస్తున్నారు, ఇక ఇప్పుడు అధ్యక్షడు అయ్యారు...ఇంకా ఎన్ని అబద్దాలు ప్రచారం చేస్తారో అని విమర్శించారు. కన్నా ప్రచారం చేసే అసత్యాలు చూసే బీజేపీ పార్టీ ఆయనకు అధ్యక్ష పదవి ఇచ్చి ఉంటుందన్నారు.

కాగా ప్రముఖ సీపీఐ నాయకుడు చండ్ర రాజేశ్వర్రావు భవన నిర్మాణానికి గాను అమరావతిలో 3 ఎకరాల భూమిని కేటాయించినందుకు గాను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడుకు నారాయణ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.

మరిన్ని వార్తలు