‘కరుణానిధికి భారతరత్న ఇవ్వాలి’

13 Aug, 2018 14:46 IST|Sakshi

సాక్షి, చెన్నై : డీఎంకే అధినేత దివంగత కరుణానిధికి సీపీఐ ఘన నివాళులర్పించింది. ఈ సందర్భంగా ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌ రెడ్డి, జాతీయ కార్యదర్శి నారాయణ సోమవారం చెన్నైలోని గోపాలపురం నివాసంలో కరుణానిధి చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని తెలిపారు. ఈ సందర్భంగా సురవరం సుధాకర్‌ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కరుణానిధి పెద్ద హేతువాది అయినా కూడా తమిళ ప్రజల సంక్షేమానికి శ్రమించిన మహానాయకుడని గుర్తు చేశారు.

ఆయన మృతి తమిళనాడుకు తీరనిలోటన్నారు. సీపీఐ ఎప్పుడూ డీఎంకేతోనే  కొనసాగుతుందని స్పష్టం చేశారు. కరుణానిధికి భారతరత్న ఇవ్వాలనే డీఎంకే డిమాండ్ న్యాయబద్దమైనదేనని తెలిపారు. ఈ డిమాండ్‌కు సీపీఐ పూర్తి మద్దతిస్తుందని సురవరం తెలిపారు. కరుణానిధి 80 ఏళ్ల పాటు రాజకీయాల్లో కొనసాగారు. ఐదుసార్లు ముఖ్యమంత్రిగా, 14 మంది ప్రధానులను చూసిన రాజకీయ నేతగా కరుణానిధి దేశంలోనే అత్యంత సీనియర్ రాజకీయవేత్త అని కొనియాడారు.

మరిన్ని వార్తలు