‘అప్పుడెందుకు మద్దతిచ్చావ్‌ కేసీఆర్‌ ?’

26 Dec, 2018 15:40 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : సీపీఐ 93వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్‌ రెడ్డి పార్టీ కార్యాలయంలో సీపీఐ జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వర్గ దోపిడీ, అసమానతలు ఉన్నంతకాలం కమ్యూనిస్ట్‌లు ఉంటారని చెప్పారు. పార్టీ ఏర్పాటు చేసినప్పుడు నిర్బంధం ఎదుర్కొన్నామన్నారు. ప్రజా ఉద్యామాలలో ఎందరినో అరెస్ట్‌ చేశారని తెలిపారు. జైల్లో ఉన్నవారి తరఫున జవహర్‌ లాల్‌ నెహ్రూ కేసులు వాదించారని గుర్తు చేశారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో కమ్యూనిస్ట్‌ల పాత్ర మరువలేనిదన్నారు.

ప్రస్తుత సమాజంలో కూడా అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నామని తెలిపారు. టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రజలను ప్రలోభ పెట్టడం వల్లే తెలంగాణలో అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. ప్రస్తుతం దేశంలో ఉన్న అనైక్య పరిస్థితులను విచ్చిన్నం చేయడం కోసమే తాము థర్డ్‌ ఫ్రంట్‌ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. థర్డ్‌ ఫ్రంట్‌ పేరిట ఇన్ని రోజులు దేశవ్యాప్తంగా పర్యటనలు చేసిన కేసీఆర్‌ ఈ రోజు తన బాస్‌ మోదీకి వివరణ ఇస్తారని ఆరోపించారు. థర్డ్‌ ఫ్రంట్‌ నిర్ణయం ఎప్పుడో జరిగిందన్న కేసీఆర్‌ నోట్ట రద్దు, జీఎస్‌టీని ఎందుకు సపోర్ట్‌ చేశారని ప్రశ్నించారు. కేసీఆర్‌ నాటకాలను ప్రజలు గుర్తిస్తారని విమర్శించారు.

త్యాగాల పార్టీ సీపీఐ : చాడ
బ్రిటీష్‌ పాలనకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన పార్టీ సీపీఐ అన్నారు పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌ రెడ్డి. దేశంలో రాజకీయ వ్యవస్థను ఏర్పాటు చేసింది సీపీఐ పార్టీ అని తెలిపారు. తెలంగాణ సాయుధ పోరాటాన్ని నడిపింది కూడా సీపీఐ పార్టీనే అన్నారు. త్యాగాల పార్టీ సీపీఐ అంటూ కొనియాడారు. ప్రాంతీయ పార్టీల వల్ల కమ్యూనిస్ట్‌ పార్టీలు బలహీనపడ్డాయని పేర్కొన్నారు. దేశంలో సెంటిమెంట్‌ రాజకీయాలెక్కువయ్యాయని విమర్శించారు.

మరిన్ని వార్తలు