పవన్‌ కల్యాణ్‌పై సీపీఐ నారాయణ ఆగ్రహం

16 Jan, 2020 19:26 IST|Sakshi

పవన్‌కు నడ్డా మంచి బందరు లడ్డూలు ఇచ్చారా?

అసలు బీజేపీతో పవన్ ఎందుకు కలుస్తున్నారో చెప్పాలి

చేగువేరా ఆదర్శమన్న పవన్ చెంగువీర అయ్యారు

పవన్‌కు దమ‍్ముందో లేదో చెప్పాలి

సాక్షి, విజయవాడ : భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్న జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌పై సీపీఐ నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పవన్‌ తీరును ఆ పార్టీ నేతలు ఎండగట్టారు. సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మాట్లాడుతూ.. ‘పవన్‌వి స్వార్థ ప్రయోజనాలు ...ఆయన మాకు దూరమైనందుకు బాధ పడటం లేదు. కమ్యూనిస్ట్‌ భావజాలం ఉందని చెప్పుకునే పవన్‌ కల్యాణ్‌ మతతత్వ పార్టీలోకి ఎలా వెళ్లారు. వామపక్షాలకు బాకీ లేదన్న ఆయన.. ప్రజాస్వామ్యానికి మాత్రం బాకీ పడ్డారు.అవకాశ వాదంతో పార్టీలు మారడం సహజం. అయితే.. సిద్ధాంతాలు నచ్చాయని వ్యాఖ్యలు చేయడం ఎందుకు? ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వని బీజేపీతో కలిసి పవన్‌ రాష్ట్రానికి ఏ ప్రయోజనాలను కాపాడతారు? సీఏఏ, ఎన్నార్సీని సమర్థించిన నరేంద్ర మోదీ, అమిత్‌ షా దేశద్రోహులు. అలాంటి చట్టాలను సమర్థిస్తున్న పవన్‌ కూడా దేశద్రోహే’ అని ధ్వజమెత్తారు.

పవన్‌ కల్యాణ్‌ది అవకాశ వాదమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. గతంలో ఏపీకి పాచిపోయిన లడ్డూలు ఇచ్చారన్న ఆయన... నడ్డాను కలిసిన తర్వాత మంచి బందరు లడ్డూలు ఇచ్చారా అని సూటిగా ప్రశ్నించారు. ఢిల్లీ వెళ్లిన నేతలు జేఎన్‌యూకు వెళితే పవన్‌ మాత్రం బీజేపీ కార్యాలయానికి వెళ్లారని విమర్శించారు. చేగువేరా ఆదర్శమన్నపవన్‌ ‘చెంగువీర’ అయ్యారని ఎద్దేవా చేశారు. అసలు బీజేపీతో పవన్‌ ఎందుకు కలుస్తున్నారో చెప్పాలని రామకృష్ణ డిమాండ్‌ చేశారు. దమ్మున్నవాడే బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడతారని, పవన్‌ దమ్ముందో లేదో సమాధానం చెప్పాలని అన్నారు.

చదవండి:

వామపక్షాలకు పవన్‌ కల్యాణ్‌ ఝలక్‌

పవన్కు రాజకీయాల్లో స్థిరత్వం లేదు : అంబటి

మరిన్ని వార్తలు