చంద్రబాబుకు అసలు తలకాయ ఉందా

22 Dec, 2019 04:31 IST|Sakshi

సాక్షి, అమరావతి: రాజధాని ప్రాంత రైతులకు అన్యాయం చేసింది చంద్రబాబేనని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. సీపీఐ 95వ వార్షికోత్సవం సందర్భంగా శనివారం గుంటూరులో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ రాజధానికి 33 వేల ఎకరాలు సమీకరించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. రెండు, మూడు వేల ఎకరాల్లో రాజధాని కట్టుకుని ఉంటే ప్రస్తుతం ఈ పరిస్థితి తలెత్తేది కాదని అభిప్రాయపడ్డారు. రియల్‌ఎస్టేట్‌ వ్యాపారం చేసి రాజధానిని అభివృద్ధి చేయాలనుకోవడం సబబు కాదన్నారు. చంద్రబాబుకు అసలు తలకాయ ఉందా.. అని మండిపడ్డారు. కుక్కపని కుక్క చేయాలని.. గాడిద పని గాడిద చేయాలని, అలా చేయనందుకే చంద్రబాబు బొక్క బోర్లా పడ్డారన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణకు తాము కట్టుబడి ఉన్నామని.. అసెంబ్లీ, సచివాలయం ఒకేచోట ఉండాలన్నారు.

మతప్రాతిపదికన దేశాన్ని చీలుస్తారా?
బీజేపీ ప్రభుత్వం మత ప్రాతిపదికన దేశాన్ని ఛిన్నాభిన్నం చేయాలనుకుంటోందని సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా ఆరోపించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మాట్లాడుతూ.. అసెంబ్లీ, సచివాలయం ఉన్న రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలన్నారు. పార్టీ నేత జంగాల అజయ్‌ కుమార్‌ అధ్యక్షతన జరిగిన ఈ సభలో ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి, ముప్పాళ్ల నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు