కేంద్రాన్ని ప్రశ్నిస్తే  దేశ ద్రోహమా?

12 Oct, 2019 08:26 IST|Sakshi
సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ

సాక్షి, అనంతపురం టౌన్‌ :  కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నించే వారిని దేశ ద్రోహులుగా చిత్రికరిస్తూ ప్రధాని మోదీ పాలనను నెట్టుకొస్తున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ తీరుపై వామపక్షాల ఆధ్వర్యంలో శుక్రవారం అనంతపురంలోని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల ముందు చేపట్టిన ధర్నా కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. నరేంద్ర మోదీ ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తొలినాళ్ల నుంచి దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేసే విధంగా వ్యవహరిస్తున్నారన్నారు. కార్పొరేట్‌ కంపెనీలకు పన్ను మినాయింపులను ఇవ్వడం ఎంతవరకు సమంజసమన్నారు. గడిచిన పాలనలో కార్పొరేట్‌ సంస్థలకు 33 శాతం ఉన్న జీఎస్టీని 17 శాతానికి తగ్గించారని గుర్తు చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసే విధంగా పాలన ఉందని మండిపడ్డారు. ఈ విషయాలను ప్రశ్నించే మేధావులను దేశ ద్రోహులుగా చిత్రీకరించి అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గోరక్షణ పేరిట దళితులు, మైనార్టీలపై బీజేపీ నేతలు ఎక్కడికక్కడ దాడులకు పాల్పడుతున్నారన్నారు. మోదీ ఐదేళ్ల పాలనలో దేశానికి చేసిందేమీ లేదన్నారు. స్విస్‌ బ్యాంక్‌ల్లోని నల్లధనాన్ని వెనక్కు తీసుకువస్తానంటూ నోట్లను రద్దు చేసి సామాన్యులను ఇబ్బందులకు గురి చేశారు తప్పితే ఒక్క పైసా తీసుకురాలేకపోయారన్నారు.

కేంద్ర ప్రభుత్వ తీరును ఎండగట్టేందుకు అక్టోబర్‌ 16నుంచి దేశవ్యాప్తంగా ప్రత్యక్ష ఆందోళనలు చేపడతామన్నారు.  ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్న కేంద్ర ప్రభుత్వ మెడలు వంచుతామన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి జగదీష్‌ మాట్లాడుతూ, గత ఐదేళ్ల పాలనలో బీఎస్‌ఎన్‌ఎల్‌ సంస్థకు బడ్జెట్‌లో పైసా నిధులు కేటాయించకపోగా సంస్థను విచ్ఛిన్నం చేసేందుకు శ్రీకారం చుట్టారన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్‌ మాట్లాడుతూ విభజన చట్టంలోని హామీలను అమలు చేయకుండా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేశారన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ధర్నా విషయం తెలుసుకున్న పోలీసులు వామపక్ష నాయకులను అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. కార్యక్రమంలో వామపక్ష నాయకులు జాఫర్, నారాయణస్వామి, మల్లికార్జున, కాటమయ్య, శంకుతల, నాగేంద్రకుమార్, నాగరాజు, రామిరెడ్డి, మనోహర్, సంతోష్, కేశవరెడ్డి, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.  

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా